15 August, 2026 | 6:45 PM

West Bengal Election 2026: ఒంటిగంట వరకు 61.11శాతం పోలింగ్ నమోదు

29-04-2026 02:01 PM

ఉదయం 11 గంటల సమయానికి 39.97% ఓటింగ్ 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో బుధవారం నాడు తుది దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(West Bengal Election) కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటకు 61.11శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభ సమయాల్లో, పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల నుండి హింసాత్మక ఘటనలు, విధ్వంసకాండ జరిగినట్లు పోలీసులు తెలిపారు. చప్రా, శాంతిపూర్, నిమ్తలా, భంగార్‌తో సహా పలు ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగాయని పోలీసులు వెల్లడించారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండవ, చివరి దశలో భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ 142 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 41,001 పోలింగ్ కేంద్రాలలో జరుగుతున్న ఈ దశ పోలింగ్‌లో, మొత్తం 3,21,73,837 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,64,35,627 మంది పురుషులు, 1,57,37,418 మంది మహిళలు, 792 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు క్యూ లైన్లో వేచిఉన్నారు. ఈ పోలింగ్ కేంద్రాలన్నింటిలోనూ వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు.