‘కౌలు’ సాగుకు భరోసా ఏది?
కౌలు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్‌లో మద్దతు ధరకు అమ్ముకునే అవకాశం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పట్టాదారు పాసుపుస్తకం ఉంటేనే పంటను కొనుగోలు చేస్తారు. మద్దతు ధరకు పంట అమ్ముకోవాలన్నా, యూరియా బుక్ చేసుకోవాలన్నా, సన్న వడ్లకు బోనస్ రావాలన్నా పట్టాదారు పాసుపుస్తకం ఉండాల్సిందే.
రాష్ట్రంలో 70 లక్షల మంది భూమి పట్టా కలిగిన రైతులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఖరీఫ్-, రబీ సీజలో రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేల చొప్పున రూ.8,744.13 కోట్ల సాయం చేసింది. రాష్ట్రం లో 1.46 కోట్ల ఎకరాల భూముల ఉన్న రైతుల ఖాతాల్లో ఈ సాయం జమ అయ్యిం ది. అయితే, తాము అధికారంలోకి వస్తే పట్టాదారులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు, భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్‌ఎస్ సర్కార్‌లాగానే పట్టాదారులకి సాయం చేసి కౌలు రైతులు, రైతుకూలీలను విస్మరించడం శోచనీయం.
36 శాతం కౌలురైతులే
రాష్ట్రంలో మొత్తం 70 లక్షల మంది రైతు లు ఉండగా, అందులో 36%, అంటే 25 లక్షల మంది కౌలు రైతులే ఉన్నారని గణంకాలు చెబుతున్నాయి. వారికి అధికారికంగా గుర్తింపు లేకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం, సబ్సిడీ వంటివి అందటం లేదని ‘తెలంగాణ కౌలురైతుల గుర్తింపు సాధ న కమిటీ’ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. గ్రామీ ణ ప్రాంతాల్లోని వ్యవసాయమంతా కౌలుదారుల చేతుల్లోనే నడుస్తుంది. కొన్ని ప్రాం తాల్లో 40 శాతానికి మించి భూములు కౌలు రైతులే సాగుచేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 2.67 లక్షల మంది రైతులు ఉండగా, వీరిలో 52 వేల మంది కౌలు రైతులు ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో 3 లక్షల మంది రైతులు ఉండగా, 72 వేల మంది కౌలు రైతులున్నా రు. మెదక్ జిల్లాలో 56,000 మంది కౌలు రైతులు ఉన్నారు. మూడు జిల్లాల్లో కలిపి 1.80 లక్షల మంది కౌలుదారులుగా ఉన్నట్లు కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఇటీవ ల చేసిన సర్వే గణాంకాలను విడుదల చేసింది.
పెరుగుతున్న కౌలు ధరలు
భూముల విలువలు పెరిగాక పట్టాదారుల్లో చాలామంది వ్యవసాయానికి దూరమయ్యారు. పట్టణాలకు వలస వెళ్లిపోయిన వారు తమ భూముల్ని కౌలుకు ఇస్తున్నారు. గతంలో కౌలు అగ్రిమెంట్ రాసుకునేవారు. అయితే, కౌలు అగ్రిమెంట్ వల్ల భూమిపై హక్కు కోల్పోతామనే అపోహ వల్ల రైతులు గత కొంతకాలంగా మాట ఒప్పందంతోనే భూముల్ని కౌలుకి ఇస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో భూముల స్వభావం పంటల సాగునీటి లభ్యతను బట్టి కౌలు ధరలను పెంచుతున్నారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలో లాభసాటి పంటలైన కూరగాయలు, మిర్చి, ఆలుగడ్డ, చెరకు, ఉల్లి, అల్లంతో పాటు వరి, పత్తి, మొక్కజొన్న ఇత ర పప్పు ధాన్యాలు సాగవుతాయి.
మామిడి, సపోటా, బొబ్బాయి, పండ్లు, పూల తోటలు ఉన్నాయి. మాగాణి పంటలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు, పత్తి, మొక్కజొన్నకు రూ.20 వేలు నుంచి రూ.25 వేలు, అల్లం, చెరకు, మిరప, కూరగాయల సాగు భూములకు రూ.25 వేల వరకు కౌలు ధరలు ఉన్నా యి. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న కౌలు రైతులు తప్పనిసరిగా పెంచిన ధరలను చెల్లించాల్సి వస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో కౌలు డబ్బును ముందే తీసుకుంటున్నారు. దీనివల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దెబ్బతిన్నా కౌలు మాత్రం తప్పడం లేదు.
తీవ్ర వర్షాభావంతో ఆందోళన
రాష్ట్రంలో జూన్ 1 నుంచి జూలై 20 నాటికి 33.53 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 27 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంది. మండలాలవారీగా చూస్తే 358 మండలాల్లో లోటు వర్షపాతం, 85 మండలాలో అత్యంత లోటు వర్షపాతం నమోదైంది. ఎల్ నినో నేపథ్యంలో రాష్ట్రంలో రానున్న మూడు నెలలు కూడా లోటు వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి. ఈ పరిస్థితులలో భూములను కౌలుకు తీసుకొని అడ్వాన్సులు ఇచ్చి, పెట్టుబడులు పెట్టిన కౌలురైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
తెలంగాణలో 1950లో వచ్చిన వ్యవసాయ కౌలుదారి చట్టం కౌలు రైతులను గుర్తించి హక్కులు కల్పించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తరువాత ఆ చట్టం నిర్వీర్యమైంది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కౌలుదారుల రక్షణ కోసం వేసిన జయంతి ఘోష్ కమిటీ పలు సూచనలు చేసింది. కోనేరు రంగారావు భూకమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అప్పటి ప్రభుత్వం 2011లో భూఅధీకృత సాగుదారుల చట్టం తెచ్చింది. ఈ చట్టం కౌలుదారులకు రుణ అర్హత కార్డులు (ఎల్‌ఈసీ) జారీచేయడంతో బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకునే అవకాశం కలిగింది. అయితే, ఈ చట్టం కూడా కాలగర్భంలో కలిసిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కౌలుదారుల సమస్యలపై అధ్యయనం చేసి ఒక చట్టాన్ని రూపొందించాలి. గ్రామసభల్లో కౌలు రైతుల్ని గుర్తించి రుణ అర్హత కార్డులు, రైతు భరోసా, పంట నష్టపరిహారం ఇవ్వాలి.
దక్కని మద్దతు ధర
కౌలు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్‌లో మద్దతు ధరకు అమ్ముకునే అవకాశం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పట్టాదారు పాసుపుస్తకం ఉంటేనే పంటను కొనుగోలు చేస్తారు. చాలామంది భూమి యజమానులు కౌలురైతులకు పాసుపుస్తకాలు ఇవ్వడం లేదు. ఒకవేళ ఇచ్చినా ధాన్యం డబ్బులు భూయజమాని బ్యాంకు ఖాతాలో జమవుతాయి. మద్దతు ధరకు పంట అమ్ముకోవాలన్నా, యూరియా బుక్ చేసుకోవాలన్నా, సన్న వడ్లకు బోనస్ రావాలన్నా పట్టాదారు పాసుపుస్తకం ఉండాల్సిందే. దీంతో కౌలు రైతులకు తిప్పలు తప్పడం లేదు.
కౌలు రైతుల సంక్షేమానికి చర్యలివి
ఏటా సీజన్ ప్రారంభంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీచేయాలి. భూయజమానులపై ఆధారపడే అవసరాన్ని తగ్గించాలి. బ్యాంకు రుణాలు, సబ్సిడీ ఎరువులు, విపత్తు నష్టపరిహారం ఇవ్వాలి. కనీస మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేయాలి. బ్యాంకులో స్వల్పకాలిక పంట రుణాలు పొందటానికి రుణ అర్హత కార్డులు ఇవ్వాలి. ఈ- క్రాఫ్ బుకింగ్ వంటి ప్రభుత్వ పథకాలకు కౌలు రైతులను అర్హులుగా గుర్తించాలి. కౌలు రైతుల చట్టం తీసుకువచ్చి కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించాలి. దీనివల్ల భూయజమానుల హక్కులకు ప్రమాదం లేదని అవగాహన కల్పించాలి. భూ అధీకృత సాగుదారుల చట్టం అమలు చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకొని కౌలు రైతులను ఆదుకోవాలి.
వ్యాసకర్త సెల్: 9490952646






