23 July, 2026 | 1:49 AM

విప్లవ అగ్నిజ్వాల ఆజాద్

23-07-2026 12:00 AM

నేడు ఆజాద్ జయంతి :

‘నీ పేరేమిటి?’ కాశీ న్యాయస్థానంలో న్యాయమూర్తి అడిగిన ప్రశ్న అది. ‘ఆజాద్’ అని ఆ బాలుడు సమాధానమిచ్చాడు. తండ్రి పేరు? ‘స్వాతంత్య్రం’. ఇల్లు ఎక్కడ? ‘జైలు’. ఆ సమాధానాలు విన్న బ్రిటిష్ న్యాయమూర్తి అతనికి కొరడా దెబ్బల శిక్ష విధించాడు. శరీరం రక్తమోడినా ఆ బాలుడు తలవంచలేదు. ఆ రోజు నుంచి దేశం ఆయనను చంద్రశేఖర్ ఆజాద్ అని పిలవడం ప్రారంభించింది. 1906 జూలై 23న మధ్యప్రదేశ్‌లోని భాబ్రా గ్రామంలో చంద్రశేఖర్ జన్మించారు.

సంస్కృత విద్యను అభ్యసించేందుకు కాశీకి వెళ్లిన ఆయన జీవితాన్ని జలియన్ వాలా బాగ్ మారణకాండ పూర్తిగా మార్చేసింది. ప్రముఖ విప్లవకారులు రామ్‌ప్రసాద్ బిస్మిల్, శచీంద్రనాథ్ సన్యాల్‌ల సాంగత్యంలో ఆయన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో చేరాడు. 1928లో ఢిల్లీలో జరిగిన సమావేశంతో విప్లవ ఉద్యమానికి కొత్త దిశ లభించింది. అనంతరం భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లతో కలిసి బ్రిటిష్ అధికారులపై జరిగిన విప్లవ చర్యల్లో ఆజాద్ కీలకపాత్ర పోషించారు.

లాలా లజపతిరాయ్ మరణానికి ప్రతీకారంగా సాండర్స్ హత్యకు రూపకల్పన చేయడంలో ఆయన నాయకత్వం విశేషమైనది. సెంట్రల్ అసెంబ్లీలో బాంబు విసిరిన ఘటనతో దేశవ్యాప్తంగా విప్లవకారుల పట్ల ప్రజల్లో అపారమైన గౌరవం పెరిగింది. 1931 ఫిబ్రవరి 27న అలహాబాద్‌లోని ఆల్ఫ్రెడ్ పార్కులో జరిగిన పోరాటం వీరోచితం.

ఎనభై మంది పోలీసులు చుట్టుముట్టినా ఆజాద్ వెనుకడుగు వేయలేదు. చివరకు ఒక్క బుల్లెట్ మాత్రమే మిగలడంతో బ్రిటిష్‌వారి చేతికి చిక్కకూడదనే తన ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటూ, అదే బుల్లెట్‌తో ప్రాణాలు అర్పించారు. తద్వారా ‘ఆజాద్‌గా జీవించాను.. ఆజాద్‌గానే మరణిస్తాను’ అనే మాటను నిలబెట్టుకున్నారు.

వనకల్ల వీరప్ప

 వ్యాసకర్త: జర్నలిస్టు, 9908621080