26 May, 2026 | 1:56 AM

విద్యాశాఖ కమిషన్ సంస్కరణలు ఏమైనట్టు?

26-05-2026 12:00 AM

తెలంగాణ విద్యా రంగంలో సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి (రిటైర్డ్ ఐఏఎస్) రాజీనామా చేయడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2024 సెప్టెంబర్ 6న  రాష్ట్రప్రభుత్వం ఆయన్ను రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్‌గా నియమించింది. రెండేళ్ల కాలపరిమితితో ఈ కమిషన్ ఏర్పాటైంది. అయితే.. పదవీకాలం ముగియడానికి ఇంకా నాలుగు నెలలు మిగిలి ఉండగానే ఆయన రాజీనామా చేయడం దేనికి సంకేతం? విద్యా కమిషన్ ప్రతిపాదించిన ఐదేళ్ల కాంట్రాక్ట్ విధానం, ప్రతి ఐదేళ్లకోసారి అర్హత పరీక్షలు వంటి అంశాలు ఉపాధ్యాయుల్లో ఆందోళన కలిగించాయి. తమ ఉద్యోగ స్థిరత్వానికి భంగం కలుగుతుందని వారు భావించారు.

ఈ వ్యతిరేకతను ముందుగానే ఊహించిన ప్రభుత్వం దీనిపై సలహాదారు కే కేశవరావు నేతృత్వంలో ‘కేకే కమిటీ’ని ఏర్పాటు చేసింది. కమిషన్ సూచనలను పూర్తిగా విస్మరించకుండా, ఉద్యోగులకు నష్టం కలగకుండా మధ్యమార్గం కనుగొనడమే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం. కమిషన్ సిఫార్సుల్లో ఉపాధ్యాయుల పనితీరు ఆధారంగా మూల్యాంకనం, కనీస ఉత్తీర్ణత మార్కులను 35 నుంచి 45కి పెంచడం, పాఠశాలల పనివేళల్లో మార్పులు, జవాబుదారీతనం పెంపు వంటి అంశాలు ఉన్నాయి.

ఇవి ఉపాధ్యాయులపై అదనపు భారం పెంచుతాయని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడ్డాయి. తమ హక్కులు, బదిలీలు, ప్రమోషన్లకు ఇబ్బందులు తలెత్తుతాయనే భయంతో వారు ‘సేఫ్ జోన్’లోనే ఉండాలని చూశారు. ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యా కమిషన్ పనిచేస్తుండగానే, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పన కోసం 2025 ఆగస్టు 29న ప్రభుత్వం కే కేశవరావు నేతృత్వంలో మరో కమిటీని ఏర్పాటు చేసింది. ఆశ్చర్యకరంగా, అదే కమిటీలో ఆకునూరి మురళిని సభ్యుడిగా నియమించింది.

దీంతో ఆయన నేతృత్వంలోని విద్యా కమిషన్‌ను ప్రభుత్వం పక్కన పెట్టిందనే విమర్శలు వచ్చాయి. ఆకునూరి మురళి ప్రతి మండలానికి కనీసం రెండు పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని, చిన్న పాఠశాలల స్థానంలో సమగ్ర సదుపాయాలున్న పెద్ద పాఠశాలలను అభివృద్ధి చేయాలని సూచించారు. ఆరుట్ల పాఠశాలను మోడల్ స్కూల్‌ను తీర్చిదిద్దారు. కానీ, ప్రభుత్వం ‘యంగ్ ఇండియా‘ పాఠశాలలకు ప్రాధాన్యమిస్తూ ఈ సూచనలను పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి.

విద్యారంగాన్ని సమూలంగా మార్చాలంటే రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 18 శాతం విద్యకు కేటాయించాలని కమిషన్ సూచించింది. కానీ, ప్రభుత్వం కేవలం 8.2 శాతం మాత్రమే కేటాయించింది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలంటే మూడు సంవత్సరాల లోపు పిల్లలను చేర్చుకుని, అన్ని పాఠశాలల్లో నర్సరీ తరగతులు ప్రారంభించాలని కూడా కమిషన్ సూచించింది. అయితే, ప్రభుత్వం ప్రీ-ప్రైమరీ ప్రవేశాలను నాలుగేళ్ల పైబడిన పిల్లలకు మాత్రమే పరిమితం చేసింది. ‘ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026’ నివేదికపై ఉపాధ్యాయ సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయి అధ్యయనం లేదని విమర్శించాయి. ప్రస్తుతం ఆ నివేదిక కేకే కమిటీ పరిశీలనలో ఉంది.

కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు ప్రతి సంవత్సరం 20 నుంచి 50 శాతం వరకు ఫీజులు పెంచుతున్నాయని కమిషన్ పేర్కొంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి మూడేళ్లకు ఒకసారి మాత్రమే 10- శాతం ఫీజు పెంపునకు అనుమతించేలా చట్టం తీసుకురావాలని సిఫార్సు చేసింది. కానీ, ఈ సూచన అమలుకాలేదు. ప్రైవేట్ విద్యాసంస్థల ఒత్తిళ్లు దీనికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫీజు నియంత్రణ చట్టం వస్తే తమ వ్యాపార ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని వారు భావిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

విద్యా కమిషన్ తన పదవీకాలంలో మొత్తం తొమ్మిది నివేదికలను ప్రభుత్వానికి సమర్పించింది. అందులో 434 సిఫార్సులు ఉన్నాయి. అయితే ప్రభుత్వం వాటిని సీరియస్‌గా తీసుకున్న దాఖలాలు చాలా తక్కువగా కనిపించాయి. టీచర్ల జీతాలు అధికంగా ఉన్నాయని, వాటిని తగ్గించాలని చేసిన సూచనలు తీవ్ర వివాదానికి దారితీశాయి. టీచర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించడం, ఎడ్‌సెట్ రద్దు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎత్తివేయడం వంటి ప్రతిపాదనలు కూడా ఉపాధ్యాయ వర్గాల్లో వ్యతిరేకతకు కారణమయ్యాయి.