14-01-2026 01:47:25 AM
ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్ ఉండగా.. ఒక్క డీఏ ప్రకటన
హైదరాబాద్, జనవరి ౧౩ (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధిం చి ఐదు కరువు భత్యాలు(డీఏ) పెండింగ్‌లో ఉండగా, ప్రభుత్వం కేవలం ఒక డీఏను మాత్రమే ప్రకటించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఒక డీఏ ఇస్తామని తాజాగా రాష్ట్రప్రభు త్వం జీవో విడుదల చేసిన నేపథ్యంలో, ప్రభుత్వ తీరును మెజార్టీ సంఘాలు తప్పుబడుతున్నాయి.
అయితే.. టీజీవో డైరీ ఆవి ష్కరణ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి నుంచి డీఏ ప్రకటన చేయడం కొంత కూడా వివాదాస్పదమైంది. ఒక డీఏ ప్రకటించినందుకే టీజీవో నేతలు ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తుతున్నారని టీఎన్జీవో నేతలు మండి పడుతున్నారు. మిగతా సమస్యలను టీజీవో సీఎం దృష్టికి తీసుకెళ్లలేదంటున్నాయి. మొత్తానికి డీఏ ప్రకటన ఉద్యో గుల మధ్య చిచ్చుపెట్టింది.
టీజీవో నేతలు ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు నెరపడంపై టీఎన్జీవో గుర్రుమంటున్నది. ఉద్యోగుల కీలక డిమాండ్లున పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, మెడికల్ బిల్లులు, హెల్త్ కార్డుల జారీ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం వంటి ప్రధాన డిమాండ్లను సర్కార్ పక్కన పెట్టడంపై టీఎన్జీవో నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజీవో, టీఎన్జీవో మధ్య కోల్డ్‌వార్ తారస్థాయికి చేరింది. ఈ కోల్డ్‌వార్ ఉద్యో గవర్గాల్లో ఆందోళన కలి గిస్తోంది.
సంఘాల మధ్య విభేదాలు..
ఉద్యోగులు బతికున్నప్పుడు అత్యవసరంగా అందా ల్సిన హెల్త్ కార్డుల అంశాన్ని ప్రభు త్వం విస్మరించిందని కొందరు నేతలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చని పోయిన తర్వాత ఇచ్చే రూ.కోటి బీమా కంటే ప్రాణాలతో ఉన్నప్పుడు ఇచ్చే వైద్య సదుపాయాలు ముఖ్యమని వారు వాదిస్తున్నారు. జేఏసీ నాయకుల వ్యవహారశైలిపై జిల్లా స్థాయి నాయకులు సైతం సోషల్ మీడి యా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా రు.
ప్రభుత్వం నుంచి ఉద్యోగులు ఆశించిన అంశాలు వేరు, వాస్తవంగా నెరవేరి నవి వేరుగా కనిపిస్తున్నాయంటున్నారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల్లో ఒకదానిని విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం కొంత ఊరటనిచ్చే ప్రయత్నం చేసిందని మరికొందరు చెప్తున్నారు. రూ.కోటి బీమా పథకం కంటితుడుపు చర్య అని, ఆ బీమా ఉద్యోగి మృతిచెందితేనే వర్తిస్తుందని,
పీఆర్సీ కమిషన్ నివేదిక అమలుపైనా స్పష్టమైన హామీ లభించలేదని ఒక వర్గం భగ్గు మంటున్నది. పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణ కోసం సీపీఎస్ రద్దు చేయాలన్న డిమాండ్‌పై ప్రభుత్వం మౌనం వహించిందని పేర్కొంటున్నది. హెల్త్ కార్డుల ద్వారా నగదు రహిత చికిత్స అందడం లేద ని, మెడికల్ బిల్లులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని వాపోతున్నది.
రెండు వైపులా వాదనలు ఇలా..
టీజీవో, టీఎన్జీవో సంఘాల మధ్య విభేదాలు ఇప్పుడు పరాకాష్ఠకు చేరాయి. గత ప్రభుత్వానికి టీఎన్జీవో అనుకూలమని, ప్ర స్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి టీజీవో సన్నిహితమని నేతల మధ్య విమర్శలు సాగుతు న్నాయి. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేదనే నెపంతో టీజీవో నేతలు పోరాటాలను అడ్డుకుంటున్నారని టీఎన్జీవో వర్గాలు వాదిస్తు న్నాయి.
టీజీవో డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి తమను ఆహ్వానించకపోవడం టీఎన్జీవో నేతలకు ఆత్మాభిమాన సమస్యగా మారిందనే అభిప్రాయమూ వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ గ్రూపుల నుంచి పలువురు కీలక నేతలు వైదొలగడం జేఏసీలో చీలికను స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు కలిసికట్టుగా ఉద్యమించిన సంఘాలు ఇప్పు డు అధికార పార్టీకి అనుకూలం, వ్యతిరేకం అనే ముద్రలతో విడిపోవడం గమనార్హం.
పండుగ తర్వాత అత్యవసర సమావేశం..
ఈ పరిణామాల నేపథ్యంలో సంక్రాంతి పండుగ తర్వాత జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో టీజీ వోకు చెందిన ఒక కీలక నేతపై వేటు వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పరిస్థితి మెరుగుపడకపోతే జేఏసీ నుండి బయటకు వచ్చి స్వతంత్రంగా పోరాడాలని టీఎన్జీవో భావిస్తోంది. ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇప్పటికే జేఏసీ తీరుపై అసహనంతో ఉన్నా యి.
వీరంతా కలిసి కొత్త జేఏసీగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేఏసీ నాయకత్వం ప్రభుత్వానికి లొంగిపోయిందని కింది స్థాయి ఉద్యోగులు భావిస్తున్నారు. పండుగ తర్వాత జరిగే సమావేశం తెలంగాణ ఉద్యోగ ఉద్యమ భవిష్యత్తును నిర్ణయించనుంది. జేఏసీలోని ఓ కీలక నేతను ఆ పదవి నుంచి తొలగించే అవకాశముందని ఓ కీలక నేత తెలపడం గమనార్హం.
అవసరమైతే టీఎన్జీవో జేఏసీ నుంచి బయటకు వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా తెలిసింది. టీజీవో సం ఘం నేతల విధానాలు టీఎన్జీవో సంఘం నేతలకు నచ్చడంలేదనే ఆరోపణలున్నాయి. టీజీవో సంఘం, సీఎం కుమ్మక్కయ్యారని తమపై ఫిర్యాదు చేసినట్లుగా టీఎన్జీవో సం ఘం నేతల ఆరోపణ. గతంలోనూ ఇలా జరిగాయని ఓ కీలక నేత పేర్కొన్నారు.
దీంతో ఎవరికి వారుగా వేర్వేరు సంఘాలుగా పోరాటం చేసుకుంటే మంచిదనే అభిప్రాయాలను మరో నేత అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే తమ సంఘం కార్యక్రమంలో సీఎం డీఏ, బీమాను ప్రకటించడంతోనే విమర్శలకు తావిచ్చిందని టీజీవో సంఘంలోని ఒకరు పేర్కొన్నారు. సీఎం పాల్గొన డంతో తమ సమస్యలన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్లామని, ఈ క్రమంలోనే సీఎం డీఏ, బీమాను ఆయన ప్రకటించారని చెప్తున్నారు. మిగతా సమస్యలపై తర్వాత పరిష్కరిస్తానని సీఎం చెప్పారని పేర్కొన్నారు.
ఇది టీ కప్పులో తుఫాను
ప్రస్తుతం జేఏసీలో నడుస్తున్న చర్చ టీ కప్పులో తుఫాను లాంటిది. ప్రభుత్వంతో మేం కలిసి పనిచేస్తాం. ఉద్యోగుల హక్కుల సాధన కోసం జేఏసీగా పోరాటం చేస్తాం. డిమాండ్ల విషయంలో రాజీ పడబోం. ఇది మా ఇంట్లో పంచాయతీ లాంటిది. జేఏసీ చైర్మన్‌గా మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్‌గా మేమేం ఉంటాం. కూర్చొ ని మాట్లాడుకుని అంతర్గత సమస్యలను పరిష్కరించుకుంటాం. అందుకు ఎలాంటి త్యాగానికైనా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఏ సంఘంలోనైనా లుకలుకలు సహజం. గతంలోనూ ఇ లాంటివి వచ్చాయి. మా సమస్యల ను సీఎంకు విన్నవించాం. తమకు కొంత సమయమివ్వాలని సీఎం కోరారు.
ఏలూరి శ్రీనివాస రావు, టీజీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ జనరల్
కేవలం టీఎన్జీవోల ఈర్ష
బీఆర్‌ఎస్ పాలనలో పదేళ్ల పాటు టీఎన్జీవో సంఘం వారితో అంటకాగింది. అప్పుడు ఆ సంఘం నేతలు ఎలాంటి హక్కులూ సాధించలే కపోయారు. మేం స్వతంత్రంగా పనిచేయడం లేదు. ఉద్యోగుల పక్షాన, జేఏసీ పక్షాన పోరాటం చేస్తున్నాం. సీఎం టీజీవో డైరీ ఆవిష్కరణ సీఎం డీఏ ప్రకటించారనేది టీఎన్జీవోలకు ఈర్ష్య. ఇది సరైంది కాదు.
ఒక టీజీవో నేత
జేఏసీ రెండు ముక్కలయ్యేలా ఉంది.
ఉద్యోగుల జేఏసీ రెండు ముక్కలు అయ్యేలా ఉంది. అవసరమైతే మేం బయటకు వచ్చే ఆలోచన కూడా ఉంది. టీజీవో కార్యకలాపాలు, విధానాలు మాకు నచ్చడంలేదు. మేం ఎప్పుడూ ఉద్యోగుల పక్షాన ఉంటాం. పండగ తర్వాత సమావేశం పెట్టి ఒక నిర్ణయం తీసుకుంటాం.
ఒక టీఎన్జీవో నేత
మిగతా సమస్యల సంగతేంటి?
ప్రభుత్వం డీఏ ప్రకటించింది. అది బాగానే ఉంది. మిగతా మరి మిగతా సమస్యల పరిస్థితి ఏంటి? పీఆర్సీ, హెల్త్ కార్డుల లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. టీజీవో ప్రభుత్వాన్ని వాటి గురించీ అడగాలి కదా. మమ్మల్ని అడగమంటే ఎలా?. గతంలో జేఏసీ నేతలు చేసిందే మేం చేస్తామంటే ఎలా?. అప్పుడున్న నేతలు చేసిందే ఇప్పుడు టీజీవో చేస్తున్నది. పండుగ తర్వాత మీటింగ్ పెట్టి విషయం తేల్చుకుంటాం.
ఒక టీఎన్జీవో నేత