calender_icon.png 14 January, 2026 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం స్వాహా

14-01-2026 01:40:19 AM

  1. ౯ జిల్లాల్లోని 19 మిల్లులపై విజి‘లెన్స్’ l రూ.౬౦ కోట్ల విలువైన ధాన్యం పక్కదారి

అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో రూ.౧౯.73 కోట్ల ధాన్యం మాయం

19 మిల్లుల్లో అక్రమాలే ఇంతైతే.. ఇక మొత్తం ౪,౮౦౦ మిల్లులను తనిఖీ చేస్తే..

వేల కోట్ల అక్రమాలు పక్కా అంటున్న ప్రజానీకం

హైదరాబాద్, జనవరి ౧౩ (విజయక్రాంతి): తెలంగాణలో రైస్ మిల్లర్ల అక్రమాలు పెచ్చరిల్లుతున్నాయి. పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని రైస్‌మిల్లర్లు బుక్కేస్తున్నారు. ప్రభుత్వానికి అప్పగించాల్సిన సీఎంఆర్‌ను సక్రమంగా అప్ప గించకుండా ధాన్యాన్నీ పక్కదారి పట్టిస్తున్నారు. కోట్లకు కోట్లు సొమ్ము చేసుకుం టున్నారు. ప్రభుత్వానికి సీఎంఆర్ అప్పగించాల్సిన అగత్యం వస్తే, దొడ్డు ధాన్యం సేకరించి, ప్రభుత్వానికి నాశిరకం బియ్యం అప్పగించి చేతులు దులుపుకొంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ౪,౮౦౦ రైస్ మిల్లులు ఉండగా తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు రెండురోజుల్లో ౧౯ రైస్ మిల్లులను తనిఖీ చేశారు. సోదాల్లో సుమారు రూ.60 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు వారు గుర్తించారు. 1.90 లక్షల క్వింటాళ్ల ధాన్యం పక్కదారి పట్టినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ౧.౭౯ లక్షల గన్నీ బ్యాగులు మాయమయ్యాయని నిర్ధారించారు.

కేవలం ౧౯ మిల్లులు తనిఖీ చేస్తే రూ.౬౦ కోట్ల మేర అక్రమా లు వెలుగులోకి వస్తే.. ఇక మొత్తం రైస్ మిల్లుల్లో తనిఖీలు చేస్తే.. ఎన్ని వేల కోట్ల లో అక్రమాలు బయటపడతాయోనని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు.

9 జిలాల్లో సోదాలు..

విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తాజాగా మహబూబాబాద్, పెద్దపల్లి, వికారాబాద్, నిజామాబాద్, సూర్యాపేట, నారాయణపేట, పెద్దపల్లి, నల్లగొండ, కామారెడ్డి.. మొత్తం తొమ్మిది జిల్లాల్లోని ౧౯ రైస్ మిల్లులను తనిఖీ చేశారు.

ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే రూ. 19.73 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టిందని గుర్తించారు. సూర్యాపేట జిల్లాలో రూ. 19.32 కోట్ల విలువైన ధాన్యం, నారాయణపేట జిల్లాలో రూ. 15.91 కోట్ల విలువైన ధాన్యం, పెద్దపల్లి జిల్లాలో రూ.11.38 కోట్ల విలువైన ధాన్యం, మహబూబాబాద్ జిల్లాలో రూ. 4.86 కోట్ల విలువైన ధాన్యం, రంగారెడ్డి జిల్లాలో రూ.88 లక్షల విలువైన ధాన్యం దారి మళ్లినట్టుగా విజిలెన్స్ అధికారులు గుర్తించి కేసులు నమోదు చేశారు.

కేవలం 19 మిల్లులను మాత్రమే అంటే ఒక శాతం కంటే తక్కువ మిల్లులను తనిఖీ చేశారు పరిమితమైన మిల్లుల్లో తనిఖీలు చేస్తేనే రూ.60 కోట్ల మేర అక్రమాలు తేలితే, ఇక అన్ని మిల్లుల్లో సోదాలు చేస్తే అక్రమాల విలువ వేల కోట్లలో ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

బహిరంగ మార్కెట్‌కు మళ్లింపు..

మిల్లర్లు ప్రభుత్వం సరఫరా చేసే సన్నరకం ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్ చేసి కిలో రూ. 44 నుంచి రూ. 46 వరకు విక్రయిస్తూ భారీగా లాభపడుతున్నారు. తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం కోసం రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు చేరిన సన్నబియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి మళ్లీ పాలిష్ పట్టి ప్రభుత్వానికి సీఎంఆర్ కింద అప్పగిస్తున్నారు. ఇలా ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని అమ్ముకుని మళ్లీ ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యాన్నే కొని తిరిగి ప్రభుత్వానికి ఇస్తూ మిల్లర్లు రెండు వైపులా లాభాలు గడిస్తున్నారు.

వచ్చిన ధాన్యం.. వచ్చినట్టుగానే..

వాస్తవానికి ప్రభుత్వం సరఫరాచేసే ధాన్యాన్ని మిల్లింగ్‌చేసి సీఎంఆర్‌ను సివిల్ సప్లుసైకి, ఎఫ్‌సీఐకి అప్పించాల్సి ఉంటుంది. కానీ, రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తుండగానే, ధాన్యం మాయమవుతున్నది. మిల్లులకు చేరిన ఆ కాస్త ధాన్యం కూడా మిల్లింగ్ చేసి వెంటనే మిల్లర్లు దానిని బహిరంగ మార్కెట్ విక్రయిస్తున్నారు. 2025 ఖరీఫ్‌లో ఇప్పటివరకు ప్రభుత్వం 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరించింది.

దీనిలో 32.45 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డురకం ధాన్యం, 38.37 లక్షల మెట్రిక్ టన్నులు సన్నరకం ధాన్యం ఉంది. మిల్లర్లు సీఎంఆర్ తర్వాత కిలో ఒక్కొటింటికీ రూ.44 నుంచి రూ. 46 చొప్పున వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇక ప్రభుత్వానికి ఇచ్చే బియ్యం విషయానికి వచ్చేసరికి.. దొడ్డు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి అప్పగిస్తున్నారని గతంలోనే విజిలెన్స్ గుర్తించింది. ఆ బియ్యాన్ని ప్రభుత్వం కిలోకు రూ.14 నుంచి రూ. 16 చొప్పున చెల్లించి కొని రేషన్ షాపులకు పంపిస్తున్నది.

చక్రం తిప్పుతున్న రాజకీయ నేతలు..

రైస్ మిల్లుల వెనుక రాజకీయ నేతల హస్తం ఉండటమే ఈ అక్రమాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇంకొన్నిచోట్ల రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులే బినామీలను పెట్టుకుని దందా సాగిస్తున్నారని ఆయా జిల్లాల్లో చర్చ నడుస్తున్నది. అందుకే విజిలెన్స్ దాడులు పూర్తిస్థాయిలో జరగకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే వారు కావడంతో అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి పండుగ వేళ కావడంతో మామూళ్ల కోసమే ఈ అకస్మాత్తు తనిఖీలు చేశారనే వాదన కూడా మిల్లర్ల నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్ని మిల్లుల్లో తనిఖీలు చేయిస్తేనే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుందని సామాన్య ప్రజలు కోరుతున్నారు.