13 July, 2026 | 1:48 AM

జైనులు.. బౌద్ధులు కోర్టుకు వెళ్తే పరిస్థితేంటి?

03-12-2024 03:49 AM

భారత్‌లో ఏ మతస్థలమైనా మిగులుతుందా?

ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ 

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ‘భారత్‌లోని అనేక మత స్థలాలూ హిందు దేవాలయాలనే కొందరు కోర్టులను ఆశ్రయిస్తు న్నారు. ఆ సంస్కృతి రోజురోజుకూ పెరుగుతున్నది. మున్ముందు జైనులు, బౌద్ధు లు కూడా ఆ స్థలాలు తమవేనని కోర్టుకు వెళితే దేశంలో ఒక్కటంటే ఒక్కటి ఒక్క మత స్థలమైనా ఇతర మతాలకు మిగులుతుందా?’ అని ఏఐఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. అజ్మీర్ దర్గాను శివాలయంగా ప్రకటించాలని హిందూసేన అధ్యక్షుడు విష్ణు గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు ఇటీవల రాజస్థాన్ కోర్టు అంగీకరించింది.

ఈ నెల 20న పిటిషన్‌పై విచారించనున్నది. ఈ నేపథ్యంలో సోమవారం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ  స్పందించారు. 800 ఏళ్ల క్రితం ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ హయాం నుంచే అజ్మీర్‌లో దర్గా ఉందని, చరిత్రకారుడు అమీర్ ఖుస్రో రాసిన పుస్తకంలోనూ దర్గా ప్రస్తావన ఉందని పేర్కొన్నారు. ‘పొరుగు దేశాల అధినేతలు సైతం దర్గాను సందర్శిస్తారు. ప్రధాని మోదీ పదేళ్ల నుంచి పదిసార్లు దర్గాకు చాదర్ పంపించారు.

దర్గాను శివాలయం చేయాలనే అంశంపై ఇప్పుడు మోదీ ఏమని స్పందిస్తారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఎంతకాలం వివాదాలను ప్రోత్సహిస్తాయి. ఇకనైనా వాటిని ఆపాలి. ప్రజలకు వివాదాల ద్వారా ఎలాంటి ఉపయోగమూ లేదు. బాబ్రీ మసీదు వివాదంపై రామ జన్మభూమికి అనుకూలంగా తీర్పు వచ్చిందని, ఆ తీర్పును నాటి సీజేఐ ఆపేసి ఉంటే ఇప్పుడిలా మతస్థలాలపై వివాదాలు తెరమీదకు వచ్చేవి కావని అభిప్రాయపడ్డారు.