13 July, 2026 | 2:38 AM

పుదుచ్చేరిలో ఫెంగల్ పంజా

03-12-2024 03:58 AM

కేంద్ర పాలిత ప్రాంతాన్ని వణికించిన తుఫాన్ 

పుదుచ్చేరి, తమిళనాడులో 9 మంది మృతి

చెన్నై, డిసెంబర్ 2: ఫెంగల్ తుఫాన్ పుదుచ్చేరిని అతలాకుతలం చేసింది. మూడ్నాలుగు రోజులుగా పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిశాయి. రికార్డు స్థాయి లో శనివారం ఒక్కరోజే 44 సెం.మీ వర్షపాతం నమోదు కావడంతో పుదుచ్చేరి పూర్తిగా నీట మునిగింది. తుఫాన్ ప్రభా వం పుదుచ్చేరితో పాటు ఉత్తర తమిళనాడులోని విల్లుపురం, కడలూరు, కాంచిపు రం, చెంగల్‌పట్టు, కృష్ణగిరి తదితర జిల్లాలపై ఎక్కువగా ఉంది.

ఈదురుగాలుల దాటికి ఇండ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరా నిలిచింది. పుదుచ్చేరి, తమిళనా డులో విద్యాసంస్థలు సైతం మూతపడ్డాయి. కృష్ణగిరిలో వరదల్లో బైకులు, కార్లు, బస్సులు కొట్టుకుపోయాయి.

ఏడుగురిని కాపాడిన రెస్క్యూ బృందం

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ సహాయక చర్యలు చేపడుతున్నాయి. వరద బాధితుల కోసం తమిళనాడు ప్రభుత్వం 208 పునరావాస కేంద్రాలు, పుదుచ్చేరిలో అక్కడి ప్రభుత్వం 49 కేంద్రాలు ఏర్పాటు చేసిం ది. వరదల్లో గల్లంతై చెన్నైలో నలుగురు, కరెంట్ షాక్‌తో మరో ముగ్గురు, పుదుచ్చేరిలో ఇద్దరు పౌరులు మృతిచెందారు.

వరదల్లో చిక్కుకున్న 600 మందిని ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. తిరువన్నమలైలో ఓ ఇల్లు కూలి ఆదివారం ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు శిథిలాల్లో చిక్కుకున్నారు. వారిని సైన్యం ప్రాణాలకు తెగించి కాపాడింది.