10 April, 2026 | 1:35 PM

పోలీస్ యూనిఫామ్‌తో వాట్సాప్‌కాల్

08-12-2024 01:33 AM

* రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.5లక్షలు స్వాహా

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 7 (విజయక్రాంతి): పోలీస్ యూనిఫాంతో వాట్సాప్ కాల్ చేసిన స్కామర్లు.. ఓరిటైర్డ్ ఉద్యోగిని మనీలాండరింగ్ కేసు పేరుతో భయపెట్టి అతడి ఖాతా నుంచి రూ.5లక్షలు లూటీ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు.. సికింద్రాబాద్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి శనివారం 84203 18553 అనే నంబర్ నుంచి అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. మరో సిమ్‌కార్డును దుర్వినియోగం చేస్తున్నందున ప్రస్తుతం అతని వద్ద ఉన్న నంబర్‌ను డీయాక్టివేట్ చేస్తున్నట్లు చెప్పాడు.

నవంబర్ 24న ముంబైలోని ఓ షాపులో సంబంధిత సిమ్‌కార్డును కొనుగోలు చేసినట్లు నమ్మించాడు. రూ.70వేల కోట్ల మనీలాండరింగ్ కేసుతో అతని భార్యకు సంబంధం ఉందని చెప్పాడు. ఆ తర్వాత ఆ రిటైర్డ్ ఉద్యోగికి మరో అపరిచిత వ్యక్తి పోలీస్ యూనిఫామ్‌తో వాట్సాప్ వీడియో కాల్ చేశాడు. మనీలాండరింగ్ కేసులో మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని చెప్పి అరెస్ట్ వారెంట్ చూపించాడు.

ఈ కేసు నుంచి బయటపడాలంటే తాము చెప్పిన ఖాతాకు డబ్బులు పంపాలని నమ్మబలికాడు. విచారణ పూర్తయిన తర్వాత తిరిగి డబ్బు చెల్లిస్తామన్నాడు. ఇదంతా నిజమేనని నమ్మిన ఆ రిటైర్ట్ ఉద్యోగి రూ.5లక్షలను అతడు సూచించిన ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేశాడు.  అనంతరం ఎదుటి వ్యక్తి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన రిటైర్డ్ ఉద్యోగి సైబర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.