శ్రీచైతన్య విద్యార్థులకు అస్వస్థత
పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
హైదరాబాద్ సిటీబ్యూరో, మేడ్చల్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా కుల్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్‌లోని శ్రీచైతన్య హైస్కూల్‌లో పలువురు విద్యార్థులు శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యా రు. ఉదయం పాఠశాలలోని మూడో అంతస్తులో గల మరుగుదొడ్లను సిబ్బంది శుభ్రం చేస్తుండగా యాసిడ్ కిందపడింది. దీంతో యాసిడ్ వాసన ఒక్కసారిగా పక్కనున్న తరగతి గదుల్లోకి వ్యాపించింది.
ఆ వాసనకు దాదాపు 50మంది విద్యార్థులు రక్తవాంతులు చేసుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పాఠశాల సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే చింతల్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.




