కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి
గజ్వేల్: సిద్ధిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్‌కు అనుబంధంగా ఉన్న అన్ని కబడ్డీ క్లబ్‌లు సబ్‌జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దాలని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కే. శివకుమార్ కోరారు. ప్రస్తుతం కొన్ని క్లబ్‌లు మాత్రమే నిరంతరంగా క్రీడాకారులను తయారు చేస్తున్నాయని, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే కొంతమంది సీనియర్ క్రీడాకారులు ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో జరిగే ఆహ్వాన టోర్నమెంట్లలో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. అసోసియేషన్ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించే, జట్టు బాధ్యతలను విస్మరించే క్రీడాకారులపై కోర్ కమిటీ ద్వారా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసోసియేషన్ పట్ల నిబద్ధత, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తితో వ్యవహరించే క్రీడాకారులకు భవిష్యత్తులో జిల్లా జట్టులో ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు.






