8 August, 2026 | 1:15 AM

బకాయిల చెల్లింపులు ఎప్పుడు?

08-08-2026 12:00 AM

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆర్థిక సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఉద్యోగి తన కుటుంబాన్ని పోషించడానికి, పిల్లల చదువులు, వైద్యం, ఇంటి రుణాలు, ఇతర అవసరాలు తీర్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు వారి హక్కుగా చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించలేకపోవడమే అందుకు ప్రధాన కారణమని చెప్పడంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు.

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు 6 డీఏలు, సరెండర్ లీవుల చెల్లింపులు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. వాటికితోడు సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న సీపీఎస్ ఏరియర్స్ బిల్లులు, డీఏ బకాయిలు, జీపీఎఫ్ విత్‌డ్రాలు, మెడికల్, ఆరోగ్యపరమైన రీయింబర్స్‌మెంట్ బిల్లులు, జీఎల్‌ఐ వంటి చెల్లింపులు పేరుకుపోయాయి. సగటున ఒక్కో ఉద్యోగ, ఉపాధ్యాయునికి రెండు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం నుంచి బకాయిలు ఉన్నాయి. తమకు హక్కుగా రావాల్సిన వీటి కోసం రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతగానో పోరాడాల్సి రావడం దారుణం.

ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే అదనపు బహుమతులు కావు ఇవి. ముందస్తుగా బడ్జెట్ కేటాయింపులోని చెల్లింపులే. తమకు హక్కుగా పొందాల్సిన వాటి కోసం కూడా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించి, ఇటు ప్రభుత్వానికి, అటు ప్రజలకు ఎంతో సేవ చేస్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ప్రజల మధ్యనే ఉంటారు. తమ జీవితమంతా ప్రజలకు నిస్వార్థంగా పని చేస్తారు. అలాంటి ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బెనిఫిట్స్ సమయానికి అందకపోవడం బాధాకరం. ఈ నేపథ్యంలో చాలామంది రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. నెలలు, సంవత్సరాల తరబడి పలు బిల్లులను నిలిపివేయడం వల్ల ఉద్యోగులు, వారి కుటుంబాలు తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. 

ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలు ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోతే, దాని ప్రభావం కుటుంబంపైనే కాదు, మొత్తం ప్రభుత్వంపై కూడా పడుతుంది. తత్ఫలితంగా ఉద్యోగి పనితీరుపై కూడా ప్రభావం పడుతుంది. ఉద్యోగి కుటుంబంలో పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు, భార్య లేదా భర్త అందరూ ప్రభావితమవుతారు. కాబట్టి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను, పీఆర్సీ, డీఏలను ఆలస్యం చేయడమంటే ఇంకా వారిపై ఆర్థికభారాన్ని పెంచడమే అవుతుంది. 

ఉద్యోగ, ఉపాధ్యాయుల సంగతి ఇలా ఉంటే, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన తర్వాత, తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వారు కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తున్నది. పదవీ విరమణ ప్రయోజనాలపైనే ఆధారపడి ఉన్న అనేక కుటుంబాలు ఈ జాప్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

వాస్తవానికి ఉపాధ్యాయునికి రావాల్సిన డీఏలు, టీఏలు, సరెండర్ బెనిఫిట్స్, జీపీఎఫ్ డబ్బులు, వైద్య బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అతని కుటుంబ ఆర్థిక భద్రతలో భాగమే. సంవత్సరాలుగా పేరుకుపోయిన బకాయిలు, అప్పులు, కుటుంబ బాధ్యతలు, వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య పెన్షనర్లు ఆర్థిక తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం త్వరలో బిల్లుల చెల్లింపులు అంటూ, రూ.1000 కోట్లు ఇస్తున్నామని, రూ.2000 కోట్లు విడుదల చేస్తున్నామని, 100 రోజుల్లో రూ.6000 కోట్లు చెల్లిస్తామని పత్రికల్లో ప్రకటలిస్తూ కాలయాపన చేస్తున్నది. ఉద్యోగ, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు ప్రజలకు ఎనలేని సేవలు చేశారు. అందువల్ల వారి సమస్యను కూడా సమాజం, ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆర్థిక ఒత్తిడి మధ్య విధులు నిర్వర్తించడం ఏ మాత్రం సరికాదు. మానసిక ఒత్తిడి వల్ల ఇటు ఉద్యోగులతోపాటు అటు ప్రభుత్వం, ప్రజలు కూడా సేవాలోపం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంది. అందువల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణితో ఆలోచించాలి. త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యతకత ఉన్నది.

ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ప్రభుత్వ ఉద్యోగులు అనుసంధాన కర్త వంటి వారు. ఉద్యోగులు బాధ్యతగా పనిచేస్తేనే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతాయి. ఉద్యోగులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలంటే, ప్రభుత్వం కూడా తన బాధ్యతను విస్మరించకూడదు. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు జీతం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. అదే సమయంలో ఉపాధ్యాయ, ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు చెల్లించడం కూడా ప్రభుత్వ బాధ్యతే అని గ్రహించాలి. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఆర్థికపరమైన సమస్యలను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించాలి. చెల్లింపులకు కాలపరిమితితో కూడిన ప్రణాళిక రూపొందించాలి. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ప్రాధాన్యతతో విడుదల చేయాలి. వైద్య ఖర్చులు భరించి బిల్లులు సమర్పించిన ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను త్వరగా చెల్లించాలి.

పెండింగ్ డీఏలు, సరెండర్ లీవులు, టీఏ బిల్లులు, డీఏ అరియర్స్, జీపీఎఫ్ విత్‌డ్రాలు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి అన్ని బకాయిల చెల్లింపులో ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకువెళ్లాలి. అందుకోసం ప్రభుత్వం బకాయిల చెల్లింపుల కోసం బడ్జెట్‌లో ప్రత్యేక కసరత్తు చేయాలి.

తెలంగాణ దేశంలోనే రెండో ధనిక రాష్ట్రమని చెప్పుకొంటారు. అలాంటి ధనిక తెలంగాణలో ఈ పరిస్థితి ఎందుకు ఉందన్నది ఆలోచించాలి. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ప్రభుత్వం చెప్తున్నది. కానీ, అందుకు కారణం ఉద్యోగ, ఉపాధ్యాయులు కాదు కదా! ప్రభుత్వ దుబారా ఖర్చులు అందుకు ఒక కారణం. 

పీఆర్సీ మూడు సంవత్సరాల నుంచి నివేదిక కూడా తెప్పించుకోకపోవడం శోచనీయం. డీఏల సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారన్నది వాస్తవం. ఈ విషయాన్ని ప్రభుత్వం ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. ఆర్థికంగానే కాదు, మానసికంగా కూడా దీని ప్రభావం పరిపాలనపై పడుతుంది.

ఉద్యోగుల ఆర్థిక సమస్యలను పట్టించుకోకపోతే, తీవ్రమైన పరిణామాలు తలెత్తవచ్చు. కేజీబీవీ ఎస్‌ఎస్‌ఏ వారి 29 రోజుల సమ్మె వేతనాన్ని చెల్లించాలి. మిడ్ డే మీల్స్ బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లుల బకాయిలు పెరిగితే నాణ్యమైన భోజనం అందించేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం గుర్తెరగాలి.

కొన్ని ఆర్థిక భారం లేని సమస్యలు కూడా ఉన్నాయి. మోడల్ స్కూల్, వివిధ గురుకుల ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాల చెల్లింపులకు ఎలాంటి ఆర్థికభారం ఉండదు. జీతాలు ట్రెజరీ ద్వారా ఇవ్వాలి. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయడం కూడా సులువు. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసి చూపించింది. 190 జీవో ద్వారా విద్యాశాఖలో లాంగ్ డిప్యుటేషన్ ఇవ్వాలి. వాటిని కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల మనోభావాలను అర్థం చేసుకోవాలి. రావాల్సిన అన్ని పెండింగ్ బకాయిలను సకాలంలో పారదర్శకంగా చెల్లించాలి. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రభుత్వానికి భారం కాకూడదు. ప్రభుత్వ వ్యవస్థను నడిపించే బలంగా మారాలి. పీఆర్సీ, డీఏలు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి.

వ్యాసకర్త: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, 9696900969

తెల్కలపల్లి పెంటయ్య