వ్యాకరణమే ప్రాణమైన మిత్రుడు
సాహితీవేత్తలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రక్రియ అంటే ఇష్టం. అలాగే అధ్యాపకులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం (సబ్జెక్ట్) అంటే ఇష్టం. నామటుకు నాకు కవిత్వమంటే ఇష్టం. నా మిత్రుడు ఆలే టి మోహన్‌రెడ్డికి వ్యాకరణమంటే ప్రాణం.
నాగర్‌కర్నూల్ జిల్లా వెలుగొండ గ్రామం లో జన్మించిన మోహన్‌రెడ్డి ఐదవ తరగతి వరకు స్వగ్రామంలో, హెచ్.ఎస్.సి వరకు బిజినపల్లిలో చదివారు. పాలెంలో శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో డిప్.ఓ.ఎల్ చదివి, బి.ఓ.ఎల్, ఎం.ఓ.ఎల్ హైదరాబాద్‌లోని ఆంధ్ర సారస్వత పరిషత్తులో పూర్తిచేశారు.
ఆంధ్ర సారస్వత పరిషత్తులో ఆలేటి నాకు సీనియర్ విద్యార్థి. కానీ, ఆయనా, నేనూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగులో సహాధ్యాయులం. నా సీనియర్ ఆలేటి నాకు క్లాస్‌మేట్ కావడం చిత్రమే.
ఓ.యూ (నిజాం కళాశాల)లో మేం 1978 మధ్యకాలంలో సాయంకాలం విద్యార్థులం. పొద్దుటిపూట తాను రిఫాయిమ్ ఉన్నత పాఠశాలలోనూ, నేను ఇస్లామియా హైస్కూల్‌లోనూ తెలుగు పండితులం.
మా ఎం.ఏ క్లాసులో ఉన్న విద్యార్థులమంతా ఎక్కడో ఒక చోట ఉద్యోగాలు చేస్తున్నవారమే. మా క్లాసులో తెలుగు మీది అభిరుచితో చేరిన విద్యార్థులలో సంస్కృతం, భాషాశాస్త్రం మొదలైన వాటిలో అప్పటికే డాక్టరేట్ డిగ్రీలు సంపాదించుకున్న వారున్నారు.
మాకు ఎం.ఏ క్లాసులు తీసుకున్నవారు ఉద్ధండ పండితులు. అమరేశం రాజేశ్వరశర్మ, పాకాల యశోదారెడ్డి, ఇరివెంటి కృష్ణమూర్తి, వేటూరి ఆనందమూర్తి, ముదిగొండ శివప్రసాద్, ఎస్వీ రామారావు గార్లు ఆయా విషయాలను బోధించగా, ఆచార్య సి.నారాయణరెడ్డి మాకు ఆధునిక కవిత్వాన్ని బోధించేవారు.
ఎం.ఏలో సర్వప్రథమునిగా నిలిచినందుకు నాకు గురజాడ అప్పారావు స్వర్ణ పతకం లభించింది. నాకు స్వర్ణ పతకం లభించినందుకు మనస్ఫూర్తిగా అభినందించిన మిత్రుడు ఆలేటి. మంచి పాండిత్యం కలిగిన ఆలేటి నా రచనాశైలిని మెచ్చుకునేవారు. నిజాం కళాశాలలో చెట్ల నీడన కూర్చొని అప్పటికే నేను రచించిన ‘మల్లిపదాలు’ మీద చర్చ సాగించేవారు మళ్లీ ముందు ముందు ఏం రాస్తావని.
పాఠశాల సబ్జెక్టులలో గణితం లాంటిదే తెలుగులో వ్యాకరణం. ఆలేటికి బాల్యంలో గణితం బాగా పట్టుబడింది. వ్యావసాయిక కుటుంబంలోంచి వచ్చిన ఆలేటి రెండు సంవత్సరాలు పొలం పనులు చూసుకున్నారు. సెలవు రోజుల్లో చేల దగ్గరికి వెళ్లినప్పుడు ఇసుకలో కొత్త లెక్కలను తయారు చేసి వాటి ని సాధించే వరకు నిద్రపోయేవారు కాదు.
పాలెంలో శేషఫణిశర్మ బోధించగా ఆలేటికి తెలుగు వ్యాకరణం, అలంకార శాస్త్రం ఈ రెండింటి మీద ఆసక్తి పెరిగింది. అయినా ఇంటి దగ్గర తన ముగ్గురు పిల్లలకు గణితం బోధించే ఉపాధ్యాయుడు ఆయనే. ఒక దశలో మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లోని ‘రామయ్య కోచింగ్ సెంటర్’లో గణితం బోధించాలనుకున్నారు. కానీ, తన పిల్లలకు చెప్పి తృప్తిపడ్డారు. మనం అనుకున్నవన్నీ సాధించలేం కదా!
ఆలేటికి నాలాగా విశ్వవిద్యాలయంలో ఉద్యోగం చేయాలనే ఆసక్తి లేదు. కానీ, పట్టుదలతో 1983లో ‘కాలేజీ సర్వీసు కమిషన్’ నిర్వహించిన డిగ్రీ కళాశాల లెక్చరర్ పరీక్షకు కూర్చొని 6వ జోన్‌లో మొదటిస్థానం సాధించారు. మహబూబ్‌నగర్, వనపర్తి పట్టణాల్లో పనిచేసి ఆ తర్వాత తాను చదివిన పాలెం ప్రాచ్య కళాశాలలోనే సుమారు 25 సంవత్సరాలు ఉపన్యాసకునిగా, అసోసియేట్ ప్రొఫెసర్‌గా, ప్రిన్సిపాల్‌గా విద్యాబోధన గావించి 2008లో పదవీ విరమణ చేశారు.
ఆలేటి వ్యాకరణం బోధించడమే గాక, ఎన్నో వ్యాకరణ గ్రంథాలను రచించారు. ‘తెలుగు వ్యాకరణ దీపిక’ సులభమైన వ్యాకరణ గ్రంథం. 1996లో ‘ఓరియంటల్ లా ఙ్మన్’ సంస్థ ప్రచురించింది. బాల ప్రౌఢ వ్యాకరణాలకు తాను రాసిన కరదీపికా వ్యాఖ్యను ‘ఎమ్మెస్కొ’ ప్రచురించింది. ఆంధ్ర శబ్ద చింతామణి, అథర్వ కారికావళి మొదలైన వ్యాకరణ శాస్త్రాలకు తాను రచించిన కరదీపిక వ్యాఖ్యలు ఇంకా వెలుగు చూడవలసి ఉంది. ‘ఆంధ్ర శబ్ద చింతామణి అథర్వ కారికావళి సర్వస్వం’ ఆలేటి వ్యాకరణ శాస్త్ర పరిశోధనలో చూపిన పటిమకు గీటురాయి.
కరోనా కాలంలో మోహన్‌రెడ్డి ‘తెలుగు భాషాచైతన్య సమితి’ వారి సౌజన్యంతో చెప్పిన బాల వ్యాకరణ పాఠాలు సుమారు 60 వీడియోలు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆ పాఠాలు విని నేను కూడా చర్చలో పాల్గొనేవాణ్ని.
ఆలేటి సాహిత్య వ్యాసాలు స్రవంతి, మూసి పత్రికల్లోనూ, ‘దుందుభి’, ‘ఏరువాక’, ‘వైతాళికులు’ మొదలైన ప్రత్యేక సం చికల్లోనూ ప్రచురితమయ్యాయి. ‘జూమ్’లో చెప్పిన వ్యాకరణ పాఠాలు 600 పుటలతో పుస్తకంగా రూపుదాల్చింది. కానీ, అది ము ద్రణకు నోచుకోకపోవడం బాధాకరం!
నా క్లాస్‌మేట్ అని చెప్పుకొనే ఆలేటి మోహన్‌రెడ్డి నాకు పరిశోధనలో గురువైన ఆచార్య వేటూరి ఆనందమూర్తి గారితో కలిసి ఓ.యూలో భాషాశాస్త్రంలో డిప్లమా చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ సందర్భంగా చెప్పుకోవలసిన విషయం మరొకటి ఉంది. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివి అక్కడే 26 ఏళ్లు పనిచేస్తే, నా మిత్రుడు ఆలేటి తాను చదువుకున్న శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఓరియంటల్ కళాశాల (పాలెం)లో 25 ఏళ్లు ఉద్యోగంలో ఉన్నారు.
నాకూ, ఆలేటికి కొన్ని పోలికలు ఉన్నాయి. ఇద్దరం పూర్వ మహబూబ్ నగర్ జిల్లా వాళ్లం. ఇద్దరం ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల విద్యార్థులం. ఆయన హైదరాబాద్‌లోని రిఫాయిమ్ హైస్కూల్‌లో తెలుగు పండితునిగా ఉద్యోగం ఆరంభిస్తే, నేను సికింద్రాబాద్‌లోని ఇస్లామియా బాయ్స్ హైస్కూల్‌లో ఉద్యోగ జీవితానికి శ్రీకారం చుట్టాను.
ఇద్దరం నిజాం కళాశాల (ఓ.యూ)లో సాయం కళాశాలలో కలిసి చదువుకున్నాం. మా ఇద్దరికీ వ్యాకరణం ఆత్మగా భావించే ఆచార్య రవ్వా శ్రీహరి గారంటే ఎంతో గౌర వం. సంస్కృతానికి పాణినీయ వ్యాకరణం ఎలాంటిదో, తెలుగుకు చిన్నయసూరి బాల వ్యాకరణం అలాంటిది. ఒకరు వ్యాకరణం లో ప్రావీణ్యం చూపిస్తే, మరొకరం కవిత్వంలో చూపెట్టాం.ఆలేటి ఎం.ఓ.ఎల్ (ఓ.యూ)లో మొదటి ర్యాంకు సాధిస్తే, నేను ఎం.ఏ (ఓ.యూ)లో మొదటి ర్యాంకు సాధించాను.
ఇద్దరం ఎం.ఫిల్ చేశాం. పిహె. డి విషయానికి వస్తే ఆయన ‘వనపర్తి సంస్థా నంX తెలుగు సాహిత్య సేవ’ అనే అంశాన్ని గ్రహిస్తే, నేను ‘ప్రాచీన కావ్యాలు గ్రామీణ జీవన చిత్రణ’ అనే అంశాన్ని పరిశోధనా అంశంగా గ్రహించాను. పురస్కారాల విషయానికి వస్తే, ‘పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి ఆయనకు 2014లో ‘కీర్తి పురస్కారం’ లభిస్తే, నాకు ఒక సంవత్సరం ముందుగా 2013లో లభించింది. ఇప్పటికీ నిత్యం పలకరించుకునే మిత్రులం మేం ఇద్దరం.
వ్యాసకర్త సెల్: 9885654381
ఆచార్య మసన చెన్నప్ప






