యువతకు ఉద్యోగాలు ఎక్కడ?
‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా ఉంది భారతీయ యువ త దుస్థితి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వెలిగిపోతున్న ఆర్థిక వ్యవస్థ ఒకవైపు ప్రపంచస్థాయిలో వేగంగా దూసుకు వెళుతుంటే, ఆశ్చర్యకరంగా మరోవైపు యువతరానికి చాలినన్ని ఉద్యోగాలు క ల్పించుకోలేని నిస్సహాయ స్థితిని దేశం ఎదుర్కొంటున్నది. ఉపాధి రంగంలో భారతదేశం తీవ్రమైన సంక్షో భానికి గురవుతున్నది. ఆయా రాష్ట్రాలలో నాయకత్వాల శక్తి సామర్థ్యాల మేరకు విదేశీ పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్నప్పటికీ పెరిగిన నిరుద్యోగుల సంఖ్యకు తగినంతగా ఉద్యోగాల కల్పన జరగడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేశంలోని నిరుద్యోగ శ్రామిక శక్తిలో 83 శాతం మంది 15 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. ఒకవైపు ప్రభుత్వాల లెక్కలు ఇటీవలి సంవత్సరాలలో నిరుద్యోగితా శాతం తగ్గుముఖం పడుతున్నట్టు చూపిస్తుంటే, మరోవైపు అనేకమంది యుక్తవయసులో ఉన్నత విద్యాకోర్సులు పూర్తి చేసి కూడా సరైన ఉద్యోగాలు దొరక్క నానా అవస్థలు పడుతున్న స్థితిగతులు ఏ అంచనాలకూ అందడం లేదు. కొందరు దేశంలోనో లేదా విదేశాలలోనో మరింత పెద్ద చదువులవైపు మళ్లుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు అసలే తక్కువంటే, అవి కూడా అనేకమందికి అందని ద్రాక్షలవలె ఊరిస్తున్నాయి. ఇక, ప్రైవేటు నౌకరీలు అత్యున్నత ప్రతిభా, నైపుణ్యాల వారితోనే పోటీలు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లలో ఉపాధి నైపుణ్యాలు విస్తృతంగా కరువవడం సంక్షోభస్థాయికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.
సగం మంది నిరుద్యోగులుగా..
‘ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్2024’ సమాచారంలోకి వెళితే మనం కలవర పడడం ఖాయం. భారతదేశం ప్రతీ సంవత్సరం దాదాపు 50 లక్షలమంది గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేస్తుండగా, వారిలో దాదాపు సగం మంది నిరుద్యోగులుగా మిగులుతున్నట్లు విశ్లేషకులు వాపోతున్నారు. జ్ఞాన సంపద లేకపోవడం వల్ల మాత్రమైతే కాదు కమ్యూనికేషన్, వ్యక్తుల మధ్య సామర్థ్యాలు, వ్యక్తిత్వ వికాసం వంటి ముఖ్యమైన నైపుణ్యాలలో లోపాల కారణంగా కూడా ప్రైవేట్ రంగంలో నెలకొన్న తీవ్రమైన పోటీలో అనేకమంది సామాన్యులు నెగ్గుకు రాలేకున్నారన్నది వాస్తవం. ఇంకా కొందరిలో ఆయా రంగాలలో సాంకేతిక నైపుణ్యాలు ఉంటున్నప్పటికీ, వృత్తిపరమైన విషయాలలో అవసరమైన ప్రతిభాత్మక సానుకూలతలు లోపించడం లోటుగా కనిపిస్తున్నది.
ఈ దయనీయ పరిస్థితి అనేకమంది యువతలో నిరాశ, నిస్పృహలను రేకెత్తిస్తున్నది. తల్లిదండ్రులు అప్పో సొప్పో చేసి, ఎంతో కష్టపడి చదివిస్తే చివరికి పిల్లలు వారి స్థాయి మేరకు ప్రయోజకులు కాకపోతుండడం బాధాకరం. ఈ తరుణంలో సమాజంలోని ఆయా వర్గాలలో పెద్ద ఎత్తున ఆందోళనలు పెరుగుతున్నాయి. పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు, స్వయంఉపాధి మార్గాలు వెతుక్కోవడమూ అందరివల్ల కావడం లేదు. ఇది అనేక కుటుంబాల్లో భావోద్వేగపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నది.
ప్రభుత్వాల నుంచి జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ), నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు వంటి చొర వలతోకూడిన కొన్ని సహాయక కార్యక్రమాలు అందరికీ అందుతున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా విద్యా రంగాన్ని పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మా ర్చే దిశగా ప్రశంసనీయమైన చర్యలు ప్రభుత్వాల వైపునుంచి కొరవడుతున్నాయి. అవి ఎంతో కొంత నామ మాత్రంగా ఉంటున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో నిరుద్యోగ అంతరాన్ని పరిష్కరించలేక పోతున్నాయని విమర్శలు వస్తున్నాయి.
ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యారంగంలో వివిధ రకాల కోర్సులను ప్రవేశపెట్టడం పట్ల చూపిస్తున్న శ్రద్ధాసక్తులు చదువు పూర్తయిన వారికి ఉద్యోగాల కల్పన లేదా జీవితంలో స్వయంఉపాధి దిశగా స్థిరపడేలా కావలసిన నైపుణ్యాల సముపార్జనకు కావలసిన శిక్షణ విషయంలో మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ లోటును, అవసరాన్ని ఇటీవలి కాలంలో కొన్ని ప్రభుత్వాలు గుర్తిస్తూ కొన్ని ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చడానికి ఇంకా కొంత సమయం పట్టేలా కనిపిస్తున్నది.
గ్రామీణ యువతకు మరిన్ని ప్రోత్సాహకాలు
ఈ నిరుద్యోగ సంక్షోభం ముఖ్యంగా గ్రామీణ యువతలో తీవ్ర మనోక్షోభకు కారణమవుతున్నది. ఇంగ్లీషులో నిష్ణాతులుగా ఉన్న కొద్ది శాతం మందితో, పట్టణ ఉద్యోగ మార్కెట్లలోకి ప్రవేశించే విషయంలోనూ అనేకమంది గణనీయమైన సవాళ్లను ఎదు ర్కొంటున్నారు. ఆయా ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలు ప్రధానంగా ఇంగ్లీషులో మాత్రమే క్లయింట్లను నిర్వహించాలని ఆశిస్తూ, ఆదేశాలు ఇస్తారు. దురదృష్టవశాత్తు, ‘ఇంటర్ పర్సనల్ నైపుణ్యాలను’ కూడా వారు తరచుగా ఆంగ్లంలోనే ఉండాలని భావిస్తారు. బహుళజాతి కంపెనీలలో ఉద్యోగావకాశాల కోసం గ్రామీణ యువత తమ పట్టణ సహచరులతో పోటీ పడకుండా ఆంగ్లభాషా నైపుణ్యం తీవ్రస్థాయిలోనే అడ్డుకుంటున్నది.
భారతదేశం ఆర్థికంగా ఎంతగా విస్తరిస్తున్నప్పటికీ దీనితో సమానమైన స్థాయిలో యువతకు ఉద్యోగాల కల్పనలో మాత్రం బాగా వెనుకబడి పోతున్నట్టు అం తకంతకూ అసంఘటితంగా పెరుగుతున్న నిరుద్యోగుల శాతమే స్పష్టం చేస్తున్నది. దేశం ఇంతటి భారీస్థా యి నిరుద్యోగితతో ప్రపంచస్థాయి నాయకత్వంగా ఎ లా ఎదగగలదు? మరోవైపు పలు కారణా లు, పరిస్థితులవల్ల యువమేధోవలస కొట్టొచ్చినట్టు దేశానికి తీ వ్ర నష్టదాయకం అవుతున్నది. ప్రపంచంలోనే అధిక యువశక్తిని కలిగిన వున్న భారతదేశం దానిని వినియోగించుకోవడంలో విఫలం చెందు తూ, బృహత్తర ఆకాంక్షలను సాకారం చేయలేని నిస్సహాయ స్థితిని ఎదుర్కొంటున్నది. గ్రామీణ యువతకు కేంద్ర, రాష్ట్రా ల ప్రభుత్వాలు మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించవలసిన అవసరమైతే ఎంతో కనిపిస్తున్నది.
గడీల ఛత్రపతి






