25 April, 2026 | 10:15 AM

డీలిమిటేషన్ చిక్కుముడి

06-03-2025 12:00 AM

నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) అంశంపై ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఎందుకు ఇంత రచ్చ జరుగుతోంది? జనాభా ప్రాతిపదికన నియోజకకర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడులో లోక్‌సభ స్థానాల సంఖ్య ఇప్పుడున్న 39నుంచి 31కి తగ్గిపోతుందని, అదే సమయంలో హిందీ రాష్ట్రాలయిన యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో సీట్ల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేసిన ప్రకటన ఈ వివాదానికి బీజం వేసింది. కేరళ కూడా భారీగా నష్టపోయే ప్రమాదం ఉందంటూ ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్  గొంతు కలపడంతో స్టాలిన్ వాదనకు మరింత బలం చేకూరింది. స్టాలిన్ ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే కోయంబత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీ లిమిటేషన్ వల్ల తమిళనాడులో, ఆ మాటకొస్తే దక్షిణాది రాష్ట్రాల్లో  ఒక్క లోక్‌సభ సీటు కూడా తగ్గదని స్పష్టత ఇవ్వడానికి యత్నించారు.

అయితే దక్షిణాదిలో సీట్లు తగ్గవని చెప్తున్నమంత్రి ఉత్తరాదిలో సీట్లు పెరగడంపై పెదవి మెదపకపోవడం ఈ రాష్ట్రాల అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఒక్కతాటిపైకి వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నందున దీనిపై మౌనంగా ఉన్నప్పటికీ తమ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఆయన కూడా మిగతా దక్షిణాది సీఎంలతో గొంతు కలపక తప్పని పరిస్థితి. ఇంతకీ ఏంటీ డీ లిమిటేషన్? భారత రాజ్యాంగంలోని ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం పదేళ్ల కోసారి జరిగే జనగణన ప్రకారం దేశ  జనాభా పెరిగినప్పుడు అందుకు అనుగుణంగా పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య కూడా పెంచాల్సి ఉంటుంది.

1951నుంచి జనగణన ఆధారంగా నియోజక వర్గాల సంఖ్య పెరిగినప్పటికీ 1971 జనగణన తర్వాత నుంచి వాటి సంఖ్య పెరగలేదు. జనాభా నియంత్రణను ఉద్యమ స్థాయిలో చేపట్టడానికి వీలుగా 1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రక్రియను పాతికేళ్ల పాటు నిలిపివేశారు. దీంతో అప్పటినుంచి లోక్‌సభ స్థానాల సంఖ్య 543గానే ఉంది. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ అమలులో గణనీయమైన విజయాలు సాధించినందున ఉత్తర, దక్షిణ భారతాల మధ్య తేడా ఉండకూడదన్న ఉద్దేశంలో మాజీ ప్రధాని వాజపేయి 2001లో మరోసారి ఈ ప్రక్రియను నిలిపివేశారు. 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా పడింది. 

ఇప్పుడు 2025లో జనగణన ప్రారంభమవుతుందని కేంద్రం ఇటీవల ప్రకటించింది. అప్పటినుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన మొదలైంది. కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసినందున తమ రాష్ట్రాల్లో సంతానోత్పత్తి తగ్గిపోయిందని, అదే సమయంలో ఈ విషయంలో విఫలమైన యూపీ, బీహార్‌లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరిగిపోయిందని, జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే లోక్‌సభలో తమ ప్రాతినిధ్యం తగ్గి ఉత్తరాది ప్రాతినిధ్యం పెరిగిపోతుందనేది ఈ రాష్ట్రాల వాదన. ఇప్పటికే అన్ని విషయంలోను దక్షిణాది రా్రష్ట్రాలను చిన్నచూపు చూస్తున్న కేంద్రం ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరిగితే తమను పట్టించుకోదనేది వాటి భయం.

అందుకే జనాభా ఆధారంగానే కాకుండా మిగతా అభివృద్ధి సూచికలనుకూడా పరిగణనలోకి తీసుకోవాలని  కోరుతున్నాయి. అంతేకాదు, మరో పాతికేళ్ల పాటు నియోజక వర్గాల సంఖ్యను ఇలాగే కొనసాగించాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. గత 50 ఏళ్లలో దేశ జనాభా 140 కోట్లను దాటిపోయిన మాట నిజమే. కానీ ఆ కారణంగా రాష్ట్రాల మధ్య అగాధాలు సృష్టించేలా డీ లిమిటేషన్ జరగకూడదనేది వాటి ప్రధాన డిమాండ్. ఇందుకు అమెరికాను వారు ఉదాహరణగా చూపిస్తున్నారు. అక్కడ జనాభా నాలుగు రెట్లు పెరిగినా ప్రతినిధుల సభలో సభ్యుల సంఖ్య మాత్రం 435 గానే కొనసాగుతోంది. ఈ సమస్య సామరస్యంగా పరిష్కారం కాకపోతే దేశంలో ఫెడరల్ స్ఫూర్తికే ముప్పు ఏర్పడుతుంది.