పల్లెదారులపై పట్టింపేదీ..?
ప్రమాదాలు జరుగుతున్నా కనిపించని చర్యలు.
కల్వకుర్తి ఏప్రిల్ 15:గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సదుపాయాల లేమి ప్రజలను నిత్యం ప్రమాదాల బారిన పడేలా చేస్తోంది. ముఖ్యంగా లో లెవల్ బ్రిడ్జిలు ఉన్న ప్రదేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. వర్షాకాలంలో చెరువుల నుంచి రహదారులపైకి నీరు ప్రవహించడం వల్ల ప్రజలు ప్రాణాలకు తెగించి ప్రయాణించాల్సి వస్తోంది.కల్వకుర్తి మండలంలోని జీడిపల్లికురుమిద్ద, వెంకటాపూర్‌జీడిపల్లి, ఎల్లికల్ నుండి ముకురాల వంటి గ్రామాలను కలిపే రహదారులు తీవ్ర ప్రమాదాలకు కేంద్రంగా మారాయి. ఈ మార్గాల్లో ఎగువన ఉన్న చెరువుల నుంచి నీరు దిగువకు వచ్చి రోడ్లపై నుండి పారుతూ ముందుకు వెళుతుంది.
దశాబ్దాల క్రితం నిర్మించిన లో లెవల్ బ్రిడ్జిలు కాలక్రమేణా దెబ్బతిని, ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి.జీడిపల్లి వద్ద రహదారిపై భారీ గోతులు ఏర్పడి నీటిలో కనిపించకుండా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంకటాపూర్ వద్ద కాలువలు రోడ్డు మీదుగా ప్రవహించడం వల్ల వాహనదారులు నీటిలోంచే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.
ముకురాల ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు లేకపోవడంతో మట్టి పూర్తిగా కొట్టుకుపోయి మార్గం ప్రమాదకరంగా మారింది.ఏడాది పొడవునా నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సేవలు కూడా ఆలస్యమవుతున్నాయి.
అయినప్పటికీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యలను పట్టించుకోకపోవడం ప్రజల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. వర్షాకాలం ప్రారంభం కాకముందే శాశ్వత పరిష్కారంగా హై లెవల్ బ్రిడ్జిలు నిర్మించి, రహదారులను బలోపేతం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.






