ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏది?

16-09-2026 | 05:15am

టీ చిరంజీవులు :

ఇది కేవలం ఒక మంత్రిత్వ శాఖ(Ministry) కోసం డిమాండ్ కాదు, బీసీ(bc)లకు ప్రత్యేక విధాన వ్యవస్థ(Special policy framework) కోసం డిమాండ్. భారతదేశం(India)లో సామాజిక న్యాయం(Social Justice) గురించి మాట్లాడినప్పుడు ఒక ప్రశ్న తప్పక అడగాలి. దళితుల కోసం సామాజిక న్యాయం, సాధికారతకు ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఆదివాసీల కోసం ప్రత్యేక గిరిజన మంత్రిత్వ శాఖ ఉంది. మైనారిటీల కోసం ప్రత్యేక మైనారిటీ మంత్రిత్వ శాఖ, మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక మహిళ, శిశు సంక్షేమ శాఖ ఉంది.

మరి దేశంలోని అత్యంత పెద్ద (52%) సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల్లో ఒకటైన ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కోసం ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖ ఎందుకు లేదు? ఇది కేవలం భావోద్వేగ ప్రశ్న కాదు. ఇది రాజ్యాంగం, చరిత్ర, పరిపాలనా నిర్మాణం, బడ్జెట్, ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం అనే ఆరు కోణాల్లో పరిశీలించాల్సిన ప్రశ్న. 

బీసీలకు ప్రత్యేక వ్యవస్థ లేదని కాదు కానీ, ప్రత్యేక మంత్రిత్వ శాఖ(Ministry) లేదు. ముందుగా ఒక వాస్తవాన్ని స్పష్టం చేయాలి. కేంద్ర ప్రభుత్వం(Central Government)లో ఓబీసీలకు సంబంధించిన వ్యవహారాలు లేవని చెప్పడం సరైంది కాదు. ప్రస్తుతం సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలో ఓబీసీ సంబంధిత విభాగం ఉంది. అలాగే 2018లో 102వ రాజ్యాంగ సవరణ(Constitutional Amendment) ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్(National Commission for Backward Classes) (ఎన్‌సీబీసీ)కి రాజ్యాంగ హోదా కల్పించి ఆర్టికల్ 338బీని చేర్చారు.

ఎన్‌సీబీసీకి ఓబీసీల రాజ్యాంగ రక్షణలను పర్యవేక్షించడం, హక్కుల ఉల్లంఘనలపై ఫిర్యాదులను పరిశీలించడం, సామాజిక అభివృద్ధిపై ప్రభుత్వానికి సలహా ఇవ్వడం వంటి బాధ్యతలను అప్పగించారు. కాబట్టి అసలు ప్రశ్న ఏమిటంటే: ఓబీసీలకు ప్రభుత్వం ఏమీ చేయడం లేదా? అనేది కాదు. దేశంలోని ఓబీసీల అభివృద్ధికి ప్రత్యేకమైన, సమగ్ర, కేంద్రీకృత విధాన వ్యవస్థ ఎందుకు లేదు? అనేదే అసలు ప్రశ్న. చరిత్రలోనే ఒక ముఖ్యమైన వ్యత్యాసం కనిపిస్తుంది. స్వాతంత్య్రం తరువాత సామాజిక సంక్షేమానికి సంబంధించిన అనేక అంశాలు ఒకే పరిపాలనా వ్యవస్థలో ఉండేవి.

(హోమ్ మినిస్ట్రీ) 1985లో సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పడింది. 1998లో దాన్ని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖగా పేరు మార్చారు. తరువాత ఈ వ్యవస్థ నుంచి వేరుపడి 1999లో గిరిజన మంత్రిత్వ శాఖ ఏర్పడింది. అలాగే 2006లో మైనారిటీ శాఖ విడిపోయి ప్రత్యేక మంత్రిత్వ శాఖగా ఏర్పడింది. అలాగే మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి విడిపోయి మహిళా అభివృద్ధి, సంక్షేమ శాఖ 2006లో ఏర్పడింది. కానీ, ఓబీసీ వ్యవహారాలు మాత్రం ప్రధానంగా సామాజిక న్యాయ విభాగం స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఇదే ఇప్పుడు పరిశీలించాల్సిన సంస్థాగత ప్రశ్న.

రాజ్యాంగం ఓబీసీలను గుర్తించలేదా? అంటే, గుర్తించిందనే చెప్పాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల పరిస్థితులను పరిశీలించడానికి కమిషన్ నియామకానికి అవకాశం కల్పించింది. అదే రాజ్యాంగపరమైన నేపథ్యం నుంచి వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పడింది. తరువాత 102వ రాజ్యాంగ సవరణతో ఆర్టికల్ 338బీ ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్‌కు రాజ్యాంగ హోదా వచ్చింది.

2021లో 105వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలకు తమ ఓబీసీ/ఎస్‌ఈబీసీ జాబితాలను గుర్తించే అధికారాన్ని స్పష్టంగా ఇచ్చారు. అంటే ఓబీసీలు సాధారణ సంక్షేమ పథకాల లబ్ధిదారులు మాత్రమే కాదు; వారి సామాజిక, విద్యా, ఆర్థిక అభివృద్ధి రాజ్యాంగపరమైన విధాన చర్చలో భాగమైంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉంది: రాజ్యాంగబద్ధమైన కమిషన్ ఉంది; కానీ ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. 

మండల్ కమిషన్ తన నివేదికలో చాప్టర్ 13, పేరా 13.37(2), 13.37(3)లో దీనిపై స్పష్టమైన సిఫారసు చేసింది. మండల్ కమిషన్ రెండు ముఖ్యమైన విషయాలను సూచించింది: 1. కేంద్రం, రాష్ట్రాల్లో బ్యాక్‌వర్డ్ క్లాసెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి. 2. ఓబీసీల ప్రయోజనాలను రక్షించడానికి కేంద్రం, రాష్ట్రాల్లో ప్రత్యేక మంత్రిత్వ శాఖ/ డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేయాలి. ఇంకా ముఖ్యంగా, ఓబీసీల కోసం రూపొందించే అభివృద్ధి కార్యక్రమాలకు ఎస్సీ/ ఎస్టీలకు అందించే విధంగానే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కూడా కమిషన్ సిఫారసు చేసింది. అంటే ఓబీసీ మంత్రిత్వ శాఖ డిమాండ్ ఒక కొత్త రాజకీయ నినాదం కాదు; దాదాపు నాలుగున్నర దశాబ్దాల క్రితమే మండల్ కమిషన్ ప్రతిపాదించిన సంస్థాగత సిఫారసు.

మరి 46 సంవత్సరాలుగా ఈ సిఫారసు ఎందుకు అమలు కాలేదు? కేంద్ర ప్రభుత్వం ఓబీసీ మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఇందకు కారణాలను విశ్లేషిస్తే, 1.ఓబీసీలను సామాజిక న్యాయ శాఖ వ్యవస్థలోనే నిర్వహించవచ్చనే దృక్పథం. 2.ప్రత్యేక మంత్రిత్వ శాఖ అంటే ప్రత్యేక రాజకీయ బాధ్యత ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పడితే: ప్రత్యేక మంత్రి, ప్రత్యేక కార్యదర్శి, ప్రత్యేక బడ్జెట్, ప్రత్యేక విధానాలు, పార్లమెంటరీ జవాబుదారీతనం, వార్షిక ఫలితాల సమీక్ష అనే పూర్తి వ్యవస్థ ఏర్పడుతుంది.

అందువల్ల ఇది కేవలం పరిపాలనా మార్పు కాదు; రాజకీయ జవాబుదారీతనాన్ని పెంచే చర్య. అందుకు ఓబీసీల విషయంలో ప్రభుత్వాలు సుముఖంగా లేవు. 3.అసలు సమస్య ఏమిటంటే ఓబీసీలకు మంత్రిత్వ శాఖ అంటే ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ఎస్సీ, ఎస్టీల లాగా సబ్‌ప్లాన్‌లు కూడా పెట్టాల్సి ఉంటుంది. బీసీల ఆర్థిక అభివృద్ధికి ఇష్టపడనటువంటి ఈ ఆధిపత్య కుల ప్రభుత్వాలు బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏదో ఒక సాకుతో ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నాయి.

4.కేంద్రంలో ఇప్పటివరకు పాలించిన ప్రభుత్వాలన్నింటికీ ఓబీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేదు. అవన్నీ కూడా అగ్ర, ఆధిపత్య కుల ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వాలు. ఓబీసీల అభివృద్ధి, సంక్షేమంపై శ్రద్ధ ఉంటే అవి మంత్రిత్వ శాఖను విస్మరించేవి కావు. ఓబీసీలంటే ఓటు బ్యాంకులే తప్ప ఈ దేశంలో వాళ్ల అభివృద్ధి పట్టించుకోకూడదు, వారిని అణచివేసి తాము రాజ్యాధికారంలో ఉండాలనే ధోరణి, భావన తప్ప ఇంకొకటి కాదు.

5.అదేవిధంగా ఓబీసీలు కూడా ఎస్సీ, ఎస్టీల వలే వ్యవస్థీకృతమై లేరు. వాళ్లు ప్రభుత్వంపై తగు ఒత్తిడి పెట్టలేకపోతున్నారు. ఓబీసీ అనే భావన 1990 తర్వాతనే దేశంలో బలపడింది. అందువల్ల ఓబీసీ వర్గాల ఒత్తిడి ప్రభుత్వాలపై తగినంత లేకపోవడం ఒక ప్రధాన కారణమని చెప్పొచ్చు. 

ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు?

1. ఓబీసీ అభివృద్ధి అనేక శాఖల్లో చెల్లాచెదురుగా ఉంది. ఓబీసీ సమస్య కేవలం ఉపకార వేతనాలు లేదా హాస్టళ్ల సమస్య కాదు. ఇది విద్య+ ఉద్యోగ+ రిజర్వేషన్లు+ నైపుణ్యాలు+ ఆర్థిక+ వ్యాపారవేత్తల తయారీ+ సంప్రదాయ వృత్తులు+ డేటా+ ప్రాతినిధ్యం+ సామాజిక న్యాయం అన్నింటితో సంబంధం కలిగి ఉన్న వ్యవస్థను ఏర్పాటు చేయడం. అందువల్ల ప్రస్తుతం అనేక మంత్రిత్వ శాఖల్లో విస్తరించి ఉన్న అంశాలను ఒకే సమగ్ర విధానంలోకి తీసుకురావడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉపయోగపడుతుంది.

2.అలాగే ఓబీసీ హక్కుల పరిరక్షణకు, రిజర్వేషన్ల సమస్యలను న్యాయస్థానాల్లో గాని, ప్రభుత్వంలో గాని ఓబీసీల గొంతును సమర్థవంతంగా వినిపించడానికి ఈ మంత్రిత్వ శాఖ ఉపయోగపడుతుంది. 3.ఇది సంక్షేమం కాదు, అభివృద్ధి మిషన్. బీసీలను కేవలం వెనుకబడిన వారికి సంక్షేమమనే దృక్పథంతో చూడడం ఇక సరిపోదు. వెనుకబాటుతనం నుంచి సాధికారత వైపు విధాన మార్పు అవసరం. అందుకు ఈ మంత్రిత్వ శాఖ అవసరం. ప్రత్యేక ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పడితే దాని కింద ఒక జాతీయ అభివృద్ధి మిషన్ ఉండాలి.

దాని ద్వారా 1. నేషనల్ ఓబీసీ డేటా అండ్ సెన్సస్: డివిజన్, కుల జనాభా, విద్య, ఉద్యోగం, ఆదాయం, భూమి, వృత్తులు, వ్యాపారం, ప్రాంతాలవారీ వెనుకబాటుతనం వంటి డేటాను సేకరించాలి. 2. ఓబీసీ విద్యా మిషన్: పాఠశాల స్థాయి నుంచి సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలు, మెడికల్ విద్య, రీసెర్చ్ వరకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. 3.ఓబీసీ ఉద్యోగ పర్యవేక్షణ వ్యవస్థ-: కేంద్ర ప్రభుత్వ శాఖలు, పీఎస్‌యూలు, సెంట్రల్ యూనివర్సిటీలు, అటానమస్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఓబీసీ ప్రాతినిధ్యంపై వార్షిక నివేదిక ఇవ్వాలి.

4. ఓబీసీ ఆర్థిక అభివృద్ధి సంస్థ: ఎంఎస్‌ఎంఈలు, చేతివృత్తులవారు, సాంప్రదాయ వృత్తులవారు, స్టార్టప్‌లు, స్వయం ఉపాధి పొందే వారికి రాయితీతో కూడిన ఆర్థిక సాయం, సాంకేతికత, మార్కెట్ మద్దతును అందించాలి. 5.ఓబీసీ పారిశ్రామికవేత్తల నిధి: ఓబీసీ యువతకు సులభ రుణాలు, క్రెడిట్ గ్యారెంటీ (రుణ హామీ), మెంటరింగ్, ఇంక్యుబేషన్ వంటి సహాయాన్ని అందించాలి. 6.నైపుణ్య, వృత్తిపరమైన ఆధునీకరణ మిషన్-: సాంప్రదాయ వృత్తులను ఆధునీకరించి వాటిని ఆధునిక మార్కెట్ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయాలి.

7.ఓబీసీ పరిశోధన సంస్థ-: బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులపై నిరంతర జాతీయ పరిశోధన చేపట్టాలి. 8.ఓబీసీ బడ్జెట్ మానిటరింగ్: కేంద్రంలోని ప్రతి మంత్రిత్వ శాఖ ఓబీసీల కోసం చేస్తున్న వ్యయాన్ని గుర్తించి, సమగ్రంగా పర్యవేక్షించే వ్యవస్థ ఉండాలి. డేటా లేకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదు. ఓబీసీల అభివృద్ధికి ప్రధాన అడ్డంకుల్లో ఒకటి సమగ్ర, తాజా సామాజిక- -ఆర్థిక డేటా కొరత.

మండల్ కమిషన్ ఓబీసీ జనాభాను 1931 సెన్సస్ ఆధారంగా సుమారు 52 శాతంగా అంచనా వేసింది. కానీ, ఆ తర్వాత సాధారణ జనగణనలో ఓబీసీల పూర్తి కుల జనాభా వివరాల వ్యవస్థ కొనసాగలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం 2027 సెన్సస్‌లో కులగణన చేస్తామని హామీ ఇచ్చి రెండవ దశ సెన్సస్ ఫార్మట్‌లో కాలమ్ నంబర్ 10లో ఎస్సీ, ఎస్టీ, ఇతరులనే కాలమ్ పెట్టి మళ్లీ ఓబీసీలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నది. ఓబీసీల కులాల లెక్కలు శాస్త్రీయంగా గణించకుండా, ఓబీసీల కులగణన చేయటం కష్టమని చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నది.

అదే ఒక ఓబీసీ మంత్రిత్వ శాఖ కేంద్రంలో ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్పక తప్పదు. లెక్కలు లేకపోవటం వల్ల నేటి విధాన రూపకల్పనలో ఒక ప్రాథమిక ప్రశ్న మిగిలే ఉంది: అది ఎంత మంది ఓబీసీలు? వారి విద్యాస్థాయి ఎంత? కేంద్ర ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఎంత? వ్యాపారంలో వారి వాటా ఎంత? భూమి, ఆస్తి, ఆదాయంలో వారి స్థానం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమగ్ర డేటా లేకుండా లక్షిత విధానం రూపొందించడం కష్టం. అందుకే కుల గణన + బీసీ సంక్షేమ, అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనే రెండు అంశాలను విడదీయకూడదు. 

బడ్జెట్ కూడా ప్రశ్నలో భాగమే. ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం వల్ల ఓబీసీల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మొత్తం వ్యయాన్ని ఒకే సమగ్ర ఓబీసీ డెవలప్‌మెంట్ బడ్జెట్‌గా చూడటం కష్టంగా ఉంటుంది. ఉదాహరణకు 2025-26 అవుట్‌కమ్ బడ్జెట్‌లో పీఎం యశస్వీ పథకం ఓబీసీ, ఈబీసీ, డీఎన్‌టీ విద్యార్థుల కోసం రూ.2,320 కోట్ల ఆర్థిక అవుట్‌లెట్‌తో నమోదైంది. దేశ జనాభాలో ఓబీసీలు అతిపెద్ద సామాజిక వర్గం. కేంద్ర బడ్జెట్‌లోని స్టేట్‌మెంట్ 10ఏ ప్రకారం రూ.1,96,400.37 కోట్లు ఎస్సీలకు కేటాయించారు. స్టేట్‌మెంట్ 10బీ ప్రకారం రూ.1,41,088.60 కోట్లు ఎస్టీలకు కేటాయించారు. మొత్తం కేంద్ర వ్యయం: 2026-27లో రూ.53,47,315 కోట్లు.

ఓబీసీలకు ఎస్సీ/ ఎస్టీల మాదిరిగా ఒక ప్రత్యేక అలకేషన్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఓబీసీ స్టేట్‌మెంట్ లేదు. కేంద్ర సామాజిక న్యాయ శాఖలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు అన్నీ వర్గాలు కలిపి ఉన్న కొన్ని బడ్జెట్ హెడ్‌లు ఉన్నాయి. ఉదాహరణకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్, ఎంపవర్‌మెంట్ మొత్తం 2026-27 కేటాయింపు రూ.14,427.59 కోట్లు; కానీ ఇది ఓబీసీలకే కాదు. అందరికీ. ఎస్సీలకు రూ.1.96 లక్షల కోట్లు, ఎస్టీలకు రూ.1.41 లక్షల కోట్ల సమగ్ర లక్షిత కేటాయింపులు ఉన్నప్పుడు, ఓబీసీలకు రూ.2,320 కోట్ల పీఎం యశస్వీ మాత్రమే ఎందుకు కనిపిస్తోంది? ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన ప్రత్యేక డెవలప్‌మెంట్ యాక్షన్ ప్లాన్ ఎందుకు లేదు? ఇది ఓబీసీలపై వివక్ష తప్ప ఇంకోటి కాదు.

విద్య+ ఉద్యోగం+ ఆర్థిక సాధికారత+ వ్యాపారం+ నైపుణ్యం+ సామాజిక న్యాయం+ ప్రాతినిధ్యం అన్నింటినీ కలిపిన సమగ్ర అభివృద్ధి బడ్జెట్ అవసరం. అందుకే బీసీలు నేడు అడగాల్సిన ప్రశ్న ఓబీసీలకు జనాభా, వెనుకబాటుతనం, అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక ఎందుకు ఉండకూడదు? సామాజిక న్యాయం మంత్రిత్వ శాఖ ఉంది కదా? అనే ప్రశ్నకు సమాధానం ఒక డివిజన్ ఉండటం, ఒక పూర్తి మంత్రిత్వ శాఖ ఉండటం ఒకటే కాదు.

ప్రత్యేక మంత్రిత్వ శాఖకు సాధారణంగా ప్రత్యేక రాజకీయ నాయకత్వం, పరిపాలనా నిర్మాణం, విధాన ప్రాధాన్యత, బడ్జెట్ పర్యవేక్షణ, పార్లమెంటరీ జవాబుదారీతనం వంటి అంశాలను ఒకే కేంద్రంలో సమీకరించే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రత్యేక ఓబీసీ మంత్రిత్వ శాఖ డిమాండ్‌ను ‘మరో కార్యాలయం కావాలి’ అనే చిన్న డిమాండ్‌గా చూడకూడదు. ఇది ‘ఓబీసీల అభివృద్ధికి ప్రత్యేక జాతీయ విధాన వ్యవస్థ కావాలి’ అనే డిమాండ్.

ఇది హక్కు కోసం మాత్రమే కాదు, సమాన భాగస్వామ్యం కోసం. బీసీల సమస్యను కేవలం రిజర్వేషన్ సమస్యగా పరిమితం చేయడం సరైంది కాదు. జనాభాలో ఎంత మంది? అనే దగ్గర ఆగకూడదు. దాని తరువాత విద్యలో ఎంత మంది? ఉద్యోగాల్లో ఎంత? పరిశ్రమల్లో ఎంత? వ్యాపారంలో ఎంత? పాలనలో ఎంత? పార్లమెంట్‌లో ఎంత? విధాన నిర్ణయంలో ఎంత? అనే ప్రశ్నలు రావాలి. అందుకే బీసీలకు ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖ డిమాండ్ అనేది ఒక పదవి కోసం లేదా ఒక కొత్త కార్యాలయం కోసం చేస్తున్న డిమాండ్ కాదు. ఇది ‘వెనుకబడిన వర్గాల సంక్షేమం’ నుంచి ‘వెనుకబడిన వర్గాల సాధికారత వైపు’ భారత ప్రభుత్వ విధానాన్ని మార్చాలని కోరే డిమాండ్.

ఓబీసీల అభివృద్ధికి సమగ్ర, కేంద్రీకృత, జవాబుదారీ కేంద్ర మంత్రిత్వ శాఖ అవసరం. బీసీలకు కేవలం సంక్షేమం కాదు, ప్రత్యేక అభివృద్ధి విధానం కావాలి. కేవలం ఒక డివిజన్ కాదు,  ప్రత్యేక ఓబీసీ మంత్రిత్వ శాఖ కావాలి. డేటా కావాలి, బడ్జెట్ కావాలి, అభివృద్ధి కావాలి, ప్రాతినిధ్యం కావాలి. ఇది ఒక మంత్రిత్వ శాఖ కోసం చేసే డిమాండ్ మాత్రమే కాదు. ఇది భారతదేశ సామాజిక న్యాయ వ్యవస్థలో బీసీలకు సముచితమైన సంస్థాగత స్థానం కల్పించాలనే ప్రజాస్వామ్య డిమాండ్. బీసీలు కలసికట్టుగా పోరాడకపోతే ప్రభుత్వాలు స్పందించవు. ఇప్పుడు పోరాడవలసిన సమయం ఆసన్నమైంది.

 వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్, 

బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ చైర్మన్

మరిన్ని వార్తలు