19 May, 2026 | 5:56 AM

జహీరాబాద్ స్థానం ఎవరికో?

22-04-2024 12:26 AM

హోరా హోరీగా బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రచారాలు

గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వారివే

సంగారెడ్డి, ఏప్రిల్ 21 (విజయక్రాంతి) : జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో నాలుగు భాషాలు మాట్లాడే ప్రజలు నివాసం ఉంటున్నారు. హైదరాబాద్ కర్ణాటక ప్రాం తంగా జహీరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక రెండు రాష్ట్రాల సరిహద్దులో పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నది. జహీరాబాద్ శాసనసభ నియో జకవర్గానికి కర్ణాటకలోని బీదర్ జిల్లా సరిహద్దుగా ఉండగా నారా యణఖేడ్, జుక్కల్ శాసనసభ నియోజక వర్గాలకు బీదర్, ఔరాద్, నాందేడ్ సరిహద్దు పట్టణాలుగా ఉన్నాయి.

ఈ పార్లమెంట్ పరిధిలోని ప్రజలు తెలుగుతో పాటు కన్నడ, మరాఠా, ఉర్దూ నాలుగు భాషాలు మాట్లాడుతారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో స్థానికులకే పట్టం కట్టారు. వారు లింగాయత్ సామాజిక వర్గాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఈసారి లింగాయత్ సామాజిక వర్గంతోపాటు బీసీ వర్గానికి చెందిన గాలి అనిల్‌కుమార్ బీఆర్‌ఎస్ తరఫున బరిలో నిలిచారు. మూడుసార్లు ఒకే సామాజిక వర్గానికి పట్టం కట్టగా ఈసారైన బీసీ సామాజిక వర్గానికే పట్టం కడుతారా లేదా వేచి చూడా ల్సిందే. 

లింగాయత్‌ల ఓట్ల కోసం యత్నం

జహీరాబాద్‌లో అధికంగా ఎస్సీలు, ముస్లిం మైనార్టీలు ఉన్నప్పటికీ ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్క లింగాయత్ సామాజికవర్గంతోనే సమావేశాలు నిర్వహిస్తున్నా రనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో వారి ఓట్లు ఎవరి వైపు ఉంటాయో తెలియని పరిస్థితి.పదేండ్లు బీఆర్‌ఎస్ వెంట ఉన్న మైనార్టీలు, ఎస్సీ ఓటర్లు పార్టీకి దూ రం అవుతున్నట్లు సమాచారం. రెండు సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారని తెలిసింది.

బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేకపోవడంతో ఓటర్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొన్నది. బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థులు తమ సామాజిక వర్గాలకు చెందిన కుల గురువులను, మత పెద్దలను ప్రచారం కోసం రావాలని కోరుతున్నారు. నామినేషన్లు వేసిన వెంటనే తమకు అనుకూలంగా ప్రచారం చేయాలని వేడుకుం టున్నారు.