19 May, 2026 | 2:35 AM

బీఆర్‌ఎస్ x బీజేపీ

19-05-2026 01:15 AM

సిరిసిల్లలో లడాయి.. రణరంగంగా నేతన్న చౌరస్తా

  1. కేంద్రమంత్రి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని బీఆర్‌ఎస్ ఆందోళన 
  2. అడ్డుకునే ప్రయత్నం చేసిన బీజేపీ శ్రేణులు 
  3. పరస్పరం చెప్పులతో దాడులకు దిగిన ఇరు పార్టీల శ్రేణులు
  4. లాఠీచార్జీ చేసి చెదరగొట్టిన పోలీసులు

సిరిసిల్ల, మే 18 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం నేతన్న చౌరస్తా వేదికగా బీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో..ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, అందు కు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలు చేయాలని బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ పిలుపునిచ్చారు.

అందులో భాగంగా సిరిసిల్లలోనూ బీఆర్‌ఎస్ శ్రేణు లు ఆందోళనకు దిగగా.. బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య మాటామాట పెరి గి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు కలుగజేసుకుని లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. కాగా బీఆర్‌ఎస్ ఆందోళన కు బస్టాండ్ సమీపంలోని చేనేత విగ్రహం వద్ద పోలీసులు అనుమతిచ్చారు.

కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనాతో 29 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీకి గాంధీ చౌక్ వద్ద నిరసనకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు.. బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ ప్లకార్డులతో నేతన్న చౌరస్తా వేదికకు చేరుకున్నారు. అయితే శాంతియుతంగా కొనసాగుతున్న బీఆర్‌ఎస్ నిరసన వద్దకు పెద్దఎత్తున బీజేపీ కార్యకర్తలు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

బీజేపీ శ్రేణులను రెండుసార్లు పోలీసులు చెదరగొట్టినా వారు తిరిగివచ్చి ‘కేటీఆర్ డౌన్ డౌన్’ అంటూ చేనేత చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. బండి సంజయ్‌ని బర్తరఫ్ చేయాలని ‘బండి సంజయ్ డౌన్ డౌన్’ అంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి, తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. బీజేపీ, బీఆర్‌ఎస్ శ్రేణులు పోటాపోటీగా చేపట్టిన ధర్నా కార్యక్రమం కాస్తా, పరస్పర విమర్శలు, తోపులాటలతో రణరంగంగా మారింది.

చూస్తుండగానే ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం చెప్పులతో దాడులకు దిగారు. కొట్టు కునే స్థాయికి చేరడంతో స్థానికులు, పాదచారులు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి చేతులు దాటి పోతుండటంతో జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే స్వయంగా రంగంలోకి దిగారు. భారీగా పోలీస్ బలగాలను మోహరించి పరిస్థితిని సమీక్షించారు. ఎంత సర్దిచెప్పినా వినకుండా, పోలీసులకు ముప్పుతిప్పలు పెడుతున్న ఇరు పార్టీల నేతలను, కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

లాఠీలకు పనిచెప్పిన పోలీసులు ఘర్షణ పడుతున్న ఇరువర్గాలను చెల్లాచెదురు చేశారు. నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ హఠాత్పరిణామంతో సిరిసిల్ల ప్రధాన రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నేతన్న చౌరస్తా వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తూ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో సిరిసిల్ల పట్టణంలో ప్రస్తుతం ప్రశాంతత ఉన్నప్పటికీ, అంతర్గతంగా తీవ్ర రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది.