19 May, 2026 | 1:45 AM

బడికి రక్షణ కరువు!

19-05-2026 12:42 AM
  1. రాష్ట్రంలో 26 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలు
  2. కార్పొరేట్‌కు దీటుగా ఆధునిక వసతులు
  3. కేవలం 30 శాతం స్కూళ్లకే నైట్ వాచ్‌మన్‌లు
  4. మిగతా చోట్ల విలువైన ఆస్తులకు రక్షణ ప్రశ్నార్థకం

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): వేసవి సెలవుల నేపథ్యంలో ప్రభుత్వ బడులను మూసివేశారు. తిరిగి వచ్చే నెల 12న తరుచుకోనున్నా యి. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పించిన క్రమంలో వీటి భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 26 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లు ఉండగా, అందులో కేవలం 30 శాతం బడులకు మాత్రమే నైట్ వాచ్‌మన్‌లు ఉన్నారు. వాచ్‌మన్‌లు లేని పాఠశాలల్లో విలువైన వస్తువులకు రక్షణ లేకుండాపోయింది. 

పాఠశాలల్లో విలువైన సామగ్రి

ప్రభుత్వ పాఠశాలల బతోపేతంపై దృష్టి సా రించిన తెలంగాణ సర్కార్.. కార్పొరేట్‌కు దీటుగా సౌకర్యాలు కల్పించింది. డిజిటల్ విద్య కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో లక్షలాది రూపాయలు విలువ చేసే ఇం టరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు ఉన్నాయి.

వీటితో పాటు విలువైన క్రీడా సామ గ్రి, మ్యూజికల్ పరికరాలు, ల్యాబ్‌లు, గ్రంథాలయాల్లో పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, కిచెన్ సామగ్రి, ఫ్యాన్లు, ఎలక్ట్రిక్ పరికరాలు, ఫర్నిచర్, ఒకేషనల్‌కు సంబంధించిన వస్తువులు ఉన్నాయి. వీటి రక్షణ కోసం పాఠశాలలకు నైట్ వాచ్‌మన్‌లను నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం తాత్సా రం చేస్తోంది. 

హెచ్‌ఎంలదే బాధ్యత!

వేసవి సెలవుల్లో పాఠశాలల భద్రత ప్రధానోపాధ్యాయులదేనని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారికి కంటి మీద కునుకు ఉండడం లేదు. కొన్ని చోట్ల హెచ్‌ఎంలే పాఠశాలలకు పహారా కాస్తున్నారు. వాస్తవానికి పాఠశా లలకు సెలవుల సమయంలో ఉపాధ్యాయులు అటువైపు కన్నెత్తి చూసే పరిస్థితి ఉండదు.

అలాంటప్పుడు తమను ఎలా బాధ్యులను చేస్తారంటూ హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మన ఊరు- మన బడి పాఠశాలలకు ప్రత్యేకంగా వాచ్‌మన్‌ల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పు డు అది కూడా లేదని పలు ఉపాధ్యాయ సం ఘాల నాయకులు వాపోతున్నారు. వాచ్‌మన్‌లు లేని పాఠశాలల వద్ద పోలీసు పెట్రోలింగ్ నిర్వహించాలని కోరుతున్నారు.

కొన్ని సంఘటనలు

* పెద్దపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈనెల 5న చోరీ జరిగింది. నైట్ వాచ్‌మన్ లేకపోవడం వల్ల సౌండ్ సిస్టమ్ సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్లారు.

* నిర్మల్ జిల్లా నర్సాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఏప్రిల్ 28న గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి క్రీడా పరికరాలను అపహరించుకెళ్లారు.

* కరీంనగర్ జిల్లా కొత్తపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో పీఎం శ్రీ నిధులతో కొనుగోలు చేసిన క్రీడా సామగ్రి చోరీకి గురైంది.  

* పలు పాఠశాలల్లో నల్లాలు విరగొట్టడం, టాయిలెట్లు అపరిశుభ్రంగా చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కంప్యూటర్లు, కిటికీలు, డోర్లు, ఫ్యాన్లు, లైట్లు అపహ రించుకెళ్లారు.

* పాఠశాలల ప్రాంగణాల్లో మద్యం సేవించి సీసాలు పగలకొట్టిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.