03-02-2026 02:11:56 AM
3న విత్ డ్రాకు చివరి గడువు
మరిపెడ ,ఫిబ్రవరి 2 (విజయక్రాంతి):మరిపెడ మున్సిపాలిటీ ఎన్నికలు రసవత్తంగా మారనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగియగా, శనివారం నామినేషన్లు పరిశీలన పూర్తయింది. అయితే మరిపెడ మున్సిపాలిటీలో ఒక్కో వార్డులో అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీల నుంచి నలుగురు కంటే ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేయడంతో ఆయా పార్టీలకు సమస్యగా మారింది. బీ ఫామ్ అదృష్టం ఎవరికి వరించునో అంటూ నాయకుల్లో ఉత్కంఠ నెలకొన్నది. బీఫామ్ కోసం ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు.
పార్టీలో తనకున్న పట్టును పై స్థాయి వరకు నాయకులతో ఉన్న సన్నిహిత్యాన్ని ఆసరాగా చేసుకోని గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. మరిపెడ మున్సిపాలిటీలో ఎమ్మెల్యేతో పాటు సీనియర్ల అండదండలు ఆశీస్సులు తమకే ఉన్నాయంటూ ఒకటికి రెండుసార్లు కలిసి తమ పరిస్థితిని వివరిస్తున్నారు. మరిపెడ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా మొత్తం 139 మంది అభ్యర్థులు ఇప్పటికి నామినేషన్ దాఖలు చేశారు.
ఫిబ్రవరి 3న నామినేషన్ల విత్ డ్రా గడువు ముగియనున్నది. ఏ వార్డులో ఎవరిని విత్ డ్రా చేయిస్తారో ..ఎవరిని బరిలో ఉంచుతారనే ఉత్కంఠ నెలకొంది. మరిపెడ మున్సిపల్ మున్సిపాలిటీ ఏర్పడ్డాక రెండో సారి జరుగుతున్న ఎన్నిక కావడంతో సర్వత్ర ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా సర్వేలు నిర్వహించామని అధికార పార్టీ నేతలు తెలిపారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యతనిస్తూ, జనాధారణ , పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తకు పార్టీ టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ఇటు ఎమ్మెల్యేతో పాటు పార్టీ అధిష్టానం కూడా నిర్వహించిన సభలో తమ పేరు ఉందో లేదో బి ఫామ్ తమకు వస్తుందొ లేదో అంటూ ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పటివరకు పార్టీ కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని సైతం ప్రకటించలేదు. ఈ క్రమంలో మరిపెడ మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఆరుగురు అంతకుమించి ఆశావాహులు ఉన్నట్లు తెలుస్తుంది.