8 May, 2026 | 3:54 PM

రైతుల కష్టాలు తీరేదెన్నడు?

18-05-2024 12:05 AM

అన్నదాతపై వరుణుడికి కూడా కరుణ లేకుండా పోతోంది. నారు పోసిన దగ్గరి నుంచి పంట కోసేదాకా నాలుగు నెలలపాటు నానా కష్టాలు పడి పండించిన వడ్లను అమ్మడానికి మార్కెట్ యార్డుకు తీసుకు వస్తే అధికారులు కొనడానికి ఆలస్యం చేయడంతో తీసుకువచ్చిన ధాన్యాన్ని అక్కడే ఆరబెట్టుకోవలసిన పరిస్థితి వస్తోంది. కొన్నిచోట్ల అయితే రైతు తను పండించిన పంటను అమ్ముకోవడానికి 20 నుంచి-30 రోజులు కూడా వేచి ఉండాల్సిన సరిస్థితి ఉంది. ఈలోగా అకాల వర్షాలు ఆరబెట్టిన ధాన్యాన్ని ముంచేయడంతో రైతుకు కన్నీళ్లే మిగులుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పగలంతా ఎండ, సాయంత్రం అయ్యేసరికి మబ్బులు కమ్మేసి కుండపోత వర్షం కురుస్తోంది. ఫలితంగా కళ్లాల్లో, మార్కెట్ యార్డుల్లో ఆరబెట్టిన ధాన్యం అంతా తడిసిపోతోంది. ఎంతగా టార్పాలిన్లు కప్పినా ధాన్యంలోకి తేమ చేరుతోంది. కొన్ని చోట్లయితే  వర్షపు నీటిలో వడ్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి.

అధికారుల కొర్రీలు

ఓవైపు అకాల వర్షాలకు ధాన్యం తడిసి దీనావస్థలో ఉన్న రైతన్నను మార్కెట్ యార్డుల్లో అధికారులు మరింత వేదనకు గురి చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనడానికి ముందుకు రావడం లేదు. ఒకవేళ కొనేందుకు ముందుకు వచ్చినా తేమ పేరుతో బస్తాకు రెండు మూడు కేజీలు తరుగు  తీస్తున్నారు. మరోవైపు కనీస మద్దతు ధర చెల్లించడానికి ఇష్టపడ్డం లేదు. వారం పది రోజులయినా కొనక పోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ధాన్యం తడిసి మొత్తంగా నష్టపోవడానికన్నా కాస్త తక్కువ ధరకయినా పండించిన పంటను అమ్ముకోవడం మేలని రైతు భావించే స్థితికి రావడానికి అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం కారణమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు వ్యాపారులు మెరుగైన ధరే చెల్లిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్ని చోట్ల ఆ పరిస్థితి లేదు. 

ప్రతిపక్షాల ఆందోళన

నిన్న మొన్నటి దాకా ఎన్నికల ప్రచారంలో తలమునకలుగా ఉన్న ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు ఇప్పుడిప్పుడే పరిపాలన వైపు దృష్టి పెడుతున్నారు.  రెండు రోజుల క్రితం అధికారు లతో జరిపిన ఉన్నత స్థాయి సమీక్షలో ధాన్యం కొనుగోలుపై  ప్రత్యేక సూచనలు కూడా చేశారు. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, తడిసిన ధాన్యాన్నికూడా తప్పకుండా కొనేలా మార్కెట్ కమిటీ అధికారులను ఆదేశించాలని ఉన్నతాధికా రులకు మార్గనిర్దేశం చేశారు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి ముఖ్యమంత్రి ఆదేశా లకు భిన్నంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ  ధర్నాలు, రాస్తారోకోలతో రోడ్డెక్కిన బీఆర్‌ఎస్ పార్టీ నేతలు పనిలో పనిగా ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. అటు బీజేపీ కూడా ఇదే అంశంపై రైతులతో కలిసి రాస్తారోకోలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం ఇప్ప టి వరకు తెలంగాణలో పండిన ధాన్యంలో 25 శాతం ధాన్యాన్ని  కొనుగోలు చేశారు. అంటే, ఇంకా మూడొంతుల ధాన్యం అమ్మకాలు అలాగే ఉండిపోయాయి. మరోవైపు వర్షాలు మొదలవుతున్నాయి.  పండించిన పంటను అమ్మి ఆ పైసలతో మళ్లీ వ్యవసాయ పనులు మొదలు పెట్టాలనుకుంటున్న రైతన్నకు ప్రభుత్వ అధికా రుల తీరుతో దిక్కుతోచని పరిస్థితి.

ఎంతకాలం ఈ కష్టాలు?

తెలంగాణలో రైతులకు ఈ కష్టాలు ఇప్పుడే కాదు, దశాబ్దాలుగా ఇదే దుస్థితి. ‘దేవుడు కరుణించినా పూజారి వరమివ్వడ’న్నట్లు వానదేవుడు కరుణించి నాలుగు వర్షాలు కురిసి పుష్కలంగా నీళ్లు ఉన్నా అధికారుల తీరుతో వేసిన పంట చేతికి వచ్చే దాకా రైతుకు కష్టాలు తప్పడం లేదు. గతంలో కరెంటు కష్టాలతో అర్ధరాత్రి పూట బోరుబావుల వద్దకు పరుగులు తీసి తెల్లవార్లూ నిద్ర మానుకుని పొలాన్ని తడపాల్సి వచ్చేది. గంటలకొద్దీ క్యూలలో నిల బడి ఎరువులు, క్రిమి సంహారక మందు లు కొనడం దాకా అన్నిటికీ  ఇబ్బందులే. ఇన్ని కష్టాలు పడి నాలుగు నెలలపాటు పంటను కాపాడుకున్నా చేతికొచ్చిన పంట ను అమ్ముకోవడానికి మళ్లీ కష్టాలు. పంట కోసేందుకు కూలీలు దొరక్క పోవడం మరో సమస్య. దొరికినా ఎక్కువ కూలీ ఇవ్వాల్సి రావడం. ఇన్ని సమస్యలు దాటుకుని పండించిన పంటను అమ్ముకోవ డానికి మార్కెట్‌కు తీసుకు వస్తే ఇక్కడ మళ్లీ అంతకు మించిన కష్టాలు. నిజానికి ఒకప్పుడు రైతు పంట పండించే సమయానికి వ్యాపారులే కళ్లాల దగ్గరకు వచ్చి ఆ పంటను కొనుక్కుని వెళ్లేవారు. రైతుకు ఇప్పుడు వస్తున్న కష్టాలు ఏవీ అప్పుడు ఉండేవి కాదు. అయితే, అప్పట్లో వ్యాపారులు చెప్పిన ధరకే అమ్మాల్సి వచ్చేది. ఆ విధంగా రైతు నష్టపోయే వాడు. కానీ, ఇప్పుడు ప్రభుత్వాలే మద్దతు ధరకు ధాన్యాన్ని కొంటామని చెప్పడంతో ఎక్కు వ ధర వస్తుందన్న ఆశతో రైతు మార్కెట్ యార్డుకు పంటను తీసుకు రావడం మొదలైంది. దీన్ని ఆసరాగా చేసుకుని అధికా రులు, దళారీలు కుమ్మక్కయి రైతులను రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులే నయం అనుకునే పరిస్థితి తీసుకు వస్తున్నారు.  

ధాన్యాన్ని కాంటా వేయడానికి అవసరమయిన గోనె సంచుల దగ్గరి నుంచి అమ్మిన ధాన్యానికి  సొమ్ము చేతికి వచ్చేదాకా అన్నీ సమస్యలే. మార్కెట్‌కు తెచ్చిన ధాన్యం  పది రోజులయినా అమ్ముడు పోలేదంటే అన్ని రోజులు రైతులకు తన ధాన్యం వద్ద జాగారమే. ఏ అర్ధరాత్రో అకాల వర్షం వస్తే ఇక రైతన్న కష్టాలు అన్నీ, ఇన్నీ కాదు. ధాన్యం తడిసిందన్న ఆందోళనతో కొందరు రైతులు అసువులు బాసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కా రం ఎప్పుడు అని ప్రతి ఒక్క రైతూ ప్రశ్నిస్తూనే ఉన్నాడు. రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ, రైతు బంధు.. ఇలా ఏవేవో  తాయిలాలు ఇచ్చే ప్రభుత్వం రైతు పండించిన పంటను కనీస మద్దతు ధరకు కొంటామన్న భరోసాను ఎందుకు కల్పించడం లేదు? రెండేళ్ల క్రితం రైతులు ఏడాదిపాటు దేశ రాజధాని ఢిల్లీ దిగ్బంధంతో ఆందోళన చేసింది కూడా ఇలాంటి గ్యారంటీ కోసమే కదా! అప్పుడు ప్రధాని మోడీ రైతులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని రైతు నేతలు అంటున్నారు. అయిదేళ్లలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోడీ మాటకూడా నీటిమీద రాతగానే మిగిలిపోయింది. ఈ కారణంగానే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరాదిన బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని కూడా వార్తలు వస్తున్నాయి. రైతు కడుపు మండితే ప్రభుత్వాలు కూడా కూలుతాయని తెలిసినా ఏ ప్రభుత్వం కూడా ఈ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. ‘రైతే రాజు’ అని ప్రతి పార్టీ, ప్రభుత్వమూ చెబుతున్న మాట. కానీ, ఆ రైతన్న పడే కష్టాలను తీర్చడంపై ఎవరు కూడా దృష్టి పెట్టడం లేదు. ఎన్నికల సమయంలో మాత్రమే వారు గుర్తుకు వస్తున్నారు. ఈ పరిస్థితి మారకపోతే రైతన్న మరోసారి ఉద్యమించే పరి స్థితి వస్తుంది. ఇది రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికీ వర్తిస్తుంది. 

కె. రామకృష్ణ

 వ్యాసకర్త సెల్: 99082 59123