30 June, 2026 | 3:39 PM

కాంగ్రెస్ ది.. రైతు ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ

30-06-2026 02:49 PM
  1. సీఎం రేవంత్ పాలమూరు పరువు తీస్తుండు
  2. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం
  3. కేసీఆర్ చేతిలోనే తెలంగాణ సుభిక్షం
  4. జడ్చర్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు

జడ్చర్ల : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావు  మాట్లాడుతూ.... సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కూడా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతన్నారని, ఉద్యమం కంటే ఉద్యమమే ముఖ్యమని శ్రీనివాస్ గౌడ్ పోరాటం చేశారని గుర్తుచేశారు. సీఎం రేవంత్ పాలమూరు పరువు తీస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ పెట్టుకోవాల్సింది రైతు ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ అని ఎద్దేవా చేశారు. యాసంగి రైతుబంధు పూర్తి స్థాయిలో వేయలేదని హరీశ్ రావు ఆరోపించారు. ఇవాళ వానాకాలం రైతుబంధు వేస్తమంటున్నారని తెలిపారు. కేసీఆర్ చేతిలో ఉంటేనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని వెల్లడించారు.

కాంగ్రెస్ రూ. 29,300 కోట్లు రైతులకు బాకీ పడిందని చెప్పిన హరీశ్ రావు ఈ మొత్తం రైతులకు ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ పంటలకు ఇస్తామన్న బోనస్ బోగస్ గా మారిందని హరీశ్ రావు చెప్పారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ఉన్నప్పుడు యూరియాకు ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చాయా? అని ప్రశ్నించారు. షాపులో యూరియా ఉంటే యాప్ ఎందుకన్నారు. షాపులో లేదు కాబట్టే యాప్ అంటూ కథలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అయినా అమలైందా?, రుణమాఫీ చేస్తామన్నారు.. జరిగిందా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల నాటికి మూసీ ప్రాజెక్టు(Musi Riverfront Development Project) పూర్తిచేస్తామని రేవంత్ రెడ్డి ఒట్టు వేశారు. ఎన్నికల ముందు కనిపించిన దేవుళ్లపై రేవంత్ రెడ్డి ఒట్లు వేశారని స్పష్టం చేశారు. ఆగస్టు 15న రైతు రుణమాఫీ చేస్తామన్నారు.. చేయలేదు.. పాలమూరు పరువు తీసేలా రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెప్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.