13 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం
ఏప్రిల్‌లో 1.26 శాతానికి..
న్యూఢిల్లీ, మే 14: ఆహారోత్పత్తుల ధరలు, ప్రత్యేకించి కూరగాయల ధరలు మండిపోవడంతో ఏప్రిల్ నెలలో టోకు ద్రవ్యోల్బణం 13 నెలల గరిష్ఠస్థాయి 1.26 శాతం మేర పెరిగింది. టోకు ధరల సూచి (డబ్ల్యూపీఐ) పెరగడం వరుసగా ఇది రెండో నెల. ఈ ఏడాది ఫిబ్రవరిలో 0.20 శాతం, మార్చిలో 0.53 శాతం మేర పెరిగింది. గత ఏడాది ఏప్రిల్‌లో ఈ పెరుగుదల 0.79 శాతం. 2023 మార్చిలో నమోదైన 1.41 శాతం పెరుగుదల తర్వాత మళ్లీ అధికంగా పెరిగింది గత నెలలోనే. ఆహారోత్పత్తులు, ముడి చమురు, సహజవాయువు, తయారీ ఉత్పత్తుల ధరలు పెరిగినందున 2024 ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం అధికస్థాయిలో వృద్ధిచెందిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. ఫుడ్ ఆర్టికల్స్ బాస్కెట్‌లో కూరగాయల ద్రవ్యోల్బణం భారీగా 23.60 శాతం పెరిగింది. మార్చిలో ఈ పెరుగుదల 19.52 శాతం. ఆలుగడ్డ ధరలు ఏప్రిల్‌లో గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 71.97 శాతం పెరగ్గా, ఉల్లి ధరలు 59.75 శాతం పెరిగాయి. ఈ ఏడాది మార్చిలో వీటి పెరుగుదల 52.96 శాతం, 56.99 శాతం చొప్పున ఉన్నది. ఏప్రిల్ నెలలో టోకు ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, రిటైల్ ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్ఠస్థాయి 4.83 శాతానికి దిగివచ్చింది.
ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 7.74 శాతం
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 7.74 శాతం పెరిగింది. మార్చిలో ఇది 6.88 శాతం. ఇంధన ద్రవ్యోల్బణం 1.38 శాతంగా నమోదయ్యింది. అంతక్రితం నెల ఇది మైనస్ 0.77 శాతం. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణాన్ని అంతర్జాతీయ కమోడిటీ ధరలు ప్రభావితం చేస్తాయని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అతిది నాయర్ చెప్పారు. క్రూడాయిల్‌తో సహా పలు కమోడిటీల ధరలు కొద్దినెలలుగా పెరుగుతున్నాయని, ఈ కారణంగా డబ్ల్యూ పీఐ మరింత పెరిగి మే, జూన్ నెలల్లో 2 శాతాన్ని మించతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్స రంలో డబ్ల్యూపీఐ సగటున 3.3 శాతం ఉంటుందన్నది ఇక్రా అంచనా.






