8 July, 2026 | 12:47 AM

కేజీబీవీలో వర్గ పోరు.. చక్కదిద్దేదెవరు?

08-07-2026 12:00 AM

ఇప్పటికే పీవో సస్పెండ్.. ఏడుగురికి షోకాజ్ నోటీసులు

అధికారులు సర్ది చెబుతున్న... ఫలితం శూన్యం

ఆ కస్తూర్బాపై వెల్లువెత్తుతున్న విమర్శలు 

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులు 

మహమ్మదాబాద్, జులై 7 : విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థుల్లో ఓర్పు సహనంతో పాటు సమన్వయంతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తపన పెంచాల్సిన ఆ కస్తూర్బా పాఠశాల అధ్యాపకుల తీరు భిన్నంగా ఉంది. ఒకరిపై ఒకరు  అసహనానికి గురి అవుతూ వారి సమస్యలే ప్రజల ఎజెండాగా చూపిస్తూ విద్యార్థినిలకు చదువుపై శ్రద్ధ తగ్గేలా పరోక్షంగా కారణమవుతుండ్రు.

చదువులకు దూరం అవుతున్నారని సంకల్పంతో పేద విద్యార్థులకు మండల పరిధిలోని కస్తూర్బా పాఠశాలను ఏర్పాటు చేసి ఇంటిగ్రేటెడ్ విద్యా బోధన చేయిస్తూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్న విషయం అందరికీ విధితమే. కాగా జిల్లాలోని మహమ్మదాబాద్ మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాల లోని ఉపాధ్యాయుల వర్గ పోరు ఆ గోడలు దాటి గ్రామాలకు జిల్లా అధికారుల వరకు చేరింది. ఈ తరుణంలోనే జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఈ కస్తూర్బా పాఠశాలను తనిఖీలు చేపట్టి విధి నిర్వహణ సరిగా లేదని గుర్తించి ఎస్‌ఓను సస్పెండ్ చేశారు.

అంత చక్కబడింది అనుకున్నప్పటికీ ఉపాధ్యాయులలో కూడా తప్పులు ఉన్నాయని గుర్తించిన అధికార యంత్రాంగం మరో ఏడు మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఈ కస్తూర్బా పాఠశాలలో ఉపాధ్యాయులలో ఒకరంటే ఒకరికి సమన్వయం లోపించింది. అధికారులు ఎంత చక్కదిద్దామనుకున్నప్పటికీ షో కాజు నోటీసులు మాకు వచ్చేది లేకుండే మీకే వచ్చేది ఉండే మేము కరెక్ట్ గానే ఉన్నాం కాదు మేమే కరెక్ట్ గా ఉన్నాం అంటూ వారిపై వారే ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. 

పాఠాలు చెప్పమంటే.. పంచాయతీలు ఏంటి?

 విద్యార్థి జీవితంలో గురువుది ప్రత్యేక స్థానం. తల్లిదండ్రుల తర్వాత గురువే దైవమంటూ నిత్యం మనం వింటుంటాం. విద్యార్థినీలు తప్పు చేస్తే చక్కదిద్దాల్సిన గురువులే వారిలో వారే విమర్శలు చేసుకుంటూ పాఠాలు చెప్పకుండా పంచాయతీలకు తావిస్తూ విద్యార్థినీలలో కూడా ఇదే చర్చే ఉండేలా చేస్తే ఆ విద్యార్థులు ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికార యంత్రాంగం చక్కదిద్దాలని చూసినప్పటికీ ఈ చర్చ ఉంటుంది తప్ప ఓ కొలిక్కి రావడం లేదని తెలుస్తుంది. ఇప్పటికైనా ఆ కస్తూర్బా పాఠశాలల ఉపాధ్యాయులు ఆరోపణలకు ముగింపు పెడుతూ విద్యార్థుల భవిష్యత్తు బంగారు మయమయ్యేలా అడుగులు వేయాలని విద్యార్థినిల తల్లిదండ్రులు చెబుతున్న మాట. 

 కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు విద్యార్థినీల తల్లిదండ్రులు...

 విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఇది సరైన పద్ధతి కాదని గత కొన్ని రోజులుగా ఇదే పనిగా ఉపాధ్యాయులు కొందరు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రోజులుగా చూస్తున్నప్పటికీ ఎలాంటి మార్పు కనిపించలేడం లేదని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని విద్యార్థినిల తల్లిదండ్రులు చెబుతున్న మాట. ఈ ఫిర్యాదు అందేది వరకు ఉపాధ్యాయులు వర్గపోరుతో అసహనాలతో అంతర్లీన యుద్ధం చేస్తూ విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తే అందరిపై చర్యలు ఉండే అవకాశం లేకపోలేదు. కస్తూర్బా పాఠశాల తీరు మారుతుందా మారదా వేచి చూడాలి. 

చదువు కోసం మాత్రమే విద్యార్థులు వచ్చారు..

కేవలం బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి తమ తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని సంకల్పంతో విద్యార్థినిలు కస్తూర్బా పాఠశాలకు విచ్చేశారు. ఉపాధ్యాయులు తమకు ఉద్యోగాలు వచ్చాయి తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తామని విధుల్లో చేరారు. విద్యార్థులు వారి లక్ష్యం మేరకు అడుగులు వేస్తున్నప్పటికీ ఉపాధ్యాయులు మాత్రం ఆ లక్ష్యానికి వ్యతిరేకంగా అడుగులు వేయడంతోనే ఈ సమస్య తారస్థాయికి చేరుకుంటుంది. ఇకనైనా ఈ వర్గ పోరుకు ముగింపు పలికి విద్యార్థుల జీవితాలకు భరోసానిచ్చేలా అడుగులు వేస్తూ సమన్వయంతో ముందుకు సాగాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. లేనియెడల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.