07-01-2026 01:26:29 AM
జీఎస్టీని అడ్డంపెట్టుకుని ప్రజలను వ్యాపారులు దోచుకుంటున్నారు
దేశవ్యాప్తంగా పెండింగ్‌లో 55,813 జీఎస్టీ కేసులు
ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో కులాల వారీగా బీసీల లెక్కలు ఎందుకు బయటకు పెట్టడంలేదని, శాసనమండలి సభ్యుడైన తనకు కులగణన రిపోర్టు ఎందుకివ్వరని ఎమ్మె ల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని నిలదీశారు. తనకు ఆ నివేదికను ఇప్పించాలని శాసనమండలి ఛైర్మన్‌ను కోరారు.
మంగళవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో స్పెషల్ మెన్షన్స్‌లో భాగంగా కులగణన, జాతీయ విద్యావిధానం, జీఎస్టీపైన ఆయన మాట్లాడారు. సోషల్ ఎకానమీ సర్వేలో గాడిదలు, కుక్కలు, పందుల లెక్కలున్నాయని, వాటి కంటే బీసీల లెక్కలు ఘోరమా? -అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీ కులగణన రిపోర్టును ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో జనాభా లెక్కలు చెప్తున్నారు తప్ప, కులాల వారీగా స్పష్టమైన గణాంకాలు బయట పెట్టడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం గతంలో కులగణన కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పింది, కానీ ఆ రిపోర్టు ఏమైంది? డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన సూచనలు ఏంటి? అని ప్రశ్నించారు. ఆ రిపోర్టును పబ్లిక్ డొమైన్‌లో పెట్ట కుండా బీరువాలో ఈ ప్రభుత్వం దాచుకుందని, ప్రభుత్వానికి ఇంకా రెండేళ్ల సమయం ఉందని, ఆ బీరువా తాళాలు తీసి డాక్యుమెం ట్లు ఎలా బయటకు తీయాలో మాకు తెలుసుని కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదు ప్రభుత్వాన్ని నిలదీశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రస్తుత ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా మే ము అధికారంలోకి రాగానే చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తాం అని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలన్న నిబంధన అమలు కాకపోవడం వల్ల వేలాది మంది పేద విద్యార్థులు నష్టపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
1.60 లక్షల కోట్ల మోసం
జీఎస్టీని అడ్డం పెట్టుకొని దేశవ్యాప్తంగా వ్యాపారులు ప్రజలను దోచుకుంటున్నారని మల్లన్న ఆందోళన వ్యక్తం చేశారు. రూ.1.60 లక్షల కోట్ల ఫ్రాడ్ జరిగిందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 55,813 జీఎస్టీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి విలువ సుమారు రూ.1,60,000 కోట్లకు పైగా ఉందని పేర్కొన్నారు. పెద్ద వ్యాపారులు ఫేక్ బిల్లులు, ఫేక్ కంపెనీలతో కోట్లలో మోసం చేస్తుంటే, టెక్నికల్ లోపాల వల్ల ఇబ్బంది పడే చిన్న వ్యాపారులను కూడా ఒకే కోవలో చూడటం సరికాదన్నారు. చట్టంలో చిన్న, పెద్ద వ్యాపారుల మధ్య తేడా ఉండాలని డిమాండ్ చేశారు.
కస్టమర్ల దగ్గర పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి కట్టకుండా మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహబూబ్‌నగర్‌లోని ఒక బట్టల షాపులో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అది ‘వ్యవసాయ ఉత్పత్తులు’గా చూపిస్తూ పన్ను ఎగ్గొడుతున్నారని ఉదాహరణ ఇచ్చారు. తెలంగాణ నుంచి మహారాష్ట్రకు గుట్కా అక్రమ రవాణా అవుతూ పన్ను ఎగవేత జరుగుతోందని సభ దృష్టికి తీసుకెళ్లారు. అవగాహన లోపం వల్ల తప్పులు చేసే చిన్న వ్యాపారులకు గైడెన్స్ ఇవ్వాలని, కానీ ఉద్దేశపూర్వకంగా ఆర్థిక నేరాలు చేసే వారిని వదిలిపెట్టకూడదని ప్రభుత్వానికి మల్లన్న డిమాండ్ చేశారు.