17 July, 2026 | 1:55 AM

నేతలపై కేసుల్లో జాప్యమెందుకు?

06-06-2024 01:02 AM

కేసులు పెరుగుతున్నా విచారణలు ఆలస్యం

ప్రజా ప్రతినిధుల కేసులో హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతున్నదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. నిందితులను కోర్టులో హాజరుపర్చటంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ ౮లో పేర్కొన్నవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులను సత్వరం విచారించాలని ౨౦౨౩, నవంబర్ ౯న అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని ధర్మాసనం సుమోటోగా బుధవారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులపై కేసులు పెరిగాయని హైకోర్టు రిజిస్ట్రీ ధర్మాసనానికి వివరించింది. తాజాగా 143 కేసులు నమోదయ్యాయని, 258 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది. 235 కేసుల్లో సమన్లు జారీ అయినట్లు తెలిపింది. దీంతో రెండు కేసుల్లోనే నిందితులను కోర్టులో హాజరుపరచడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమన్లు జారీ అయ్యాక నిందితుల హాజరుకు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉన్న డిశ్చార్జి పిటిషన్ల పరిష్కారానికి గడువు విధించినప్పటికీ ఫలితం లేకపోయిందని వ్యాఖ్యానించింది. 

ఏపీ ఆపద్ధర్మ సీఎం వైఎస్ జగన్‌కు చెందిన ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 134కుపైగా డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు ముగిసినప్పటికీ తీర్పులు రాలేదు. తీర్పులు చెప్పే దశలో సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో కేసుల విచారణ మొదటికి వచ్చింది. దీనిపై కూడా రిజిస్ట్రీని ధర్మాసనం ప్రశ్నించింది. ఒక్క కేసులో కూడా తీర్పు ఎందుకు వెలువడలేదని ప్రశ్నించింది. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు కోర్టు ఇచ్చిన గత ఆదేశాల ప్రతిని రాష్ట్రంలోని అన్ని కింది కోర్టులకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణను జూలై మొదటి వారానికి వాయిదా వేసింది.