17 July, 2026 | 1:44 AM

గుండం చెరువుకు కబ్జా గండం!

06-06-2024 01:05 AM

చితల్‌ఘాట్ గుండం చెరువులో జాలి ఫెన్సింగ్

ఎఫ్‌టీఎల్ పరిధిలో కడీలు  ఏర్పాటుపై అనుమానాలు

తూం, కట్ట కబ్జాకు ఓ ప్రైవేట్ కంపెనీ ప్రయత్నం?

పక్కనే 65వ జాతీయ రహదారి ఉండడంతో డిమాండ్

ఎకరం 4 కోట్లు కావడంతో కబ్జాదారుల కన్ను?

చేతులుమారుతున్న విలువైన చెరువు భూములు 

పట్టించుకోని నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులు

సంగారెడ్డి, జూన్ 5 (విజయ క్రాంతి) :  రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చెరువులు భోజ్యమవుతున్నాయి.  నీరు అడుగంటితే చాలు.. అడుగుల లెక్కన అమ్మేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ మండలంలోని చింతల్ ఘాట్ గ్రామంలో గల గుండం చెరువు కూడా కబ్జాదారుల వలలో చిక్కుకుంటోంది. 65వ జాతీయ రహదారి పక్కన ఉండడంతో భూములకు డిమాండ్ పెరిగింది. ఎకరం ధర రూ.3కోట్ల నుంచి రూ.4కోట్ల మధ్య పలుకుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఖాళీ స్థలాలపై కన్నేసిన రియల్ వ్యాపారులు కొందరు చెరువు భూములను ఆక్రమించేందుకు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. గుండం చెరువు మొత్తం 23 ఎకరాలలో విస్తరించి ఉందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇందులో 114 సర్వే నంబర్‌లో 6.04 ఎకరాల భూమి ఉంది. 17 ఎకరాల వరకు పట్టా భూమి ఉంటుంది. ఈ పట్టాభూమిలో సుమారు రూ.30కోట్లు విలువ చేసే భూమిలో కడీలు పాతి జాలి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం కబ్జాకు గురవుతున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పట్టా భూముల్లో నీరు చెరువులోపలికి వెళ్లిన తర్వాత రైతులు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ భూములను అమ్మడానికి వీలు లేదు. అయితే, జాలి ఫెన్సింగ్ ఏర్పాటుతో వ్యాపారం సాగుతున్నదనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కడీలు రైతులు వేశారా? లేదా కబ్జాదారులు వేశారా? అనే సందిగ్ధత వ్యక్తమవుతోంది. చెరువు తూం నుంచి కట్ట పైవరకు ఫెన్సింగ్‌తో చెరువు భూముల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై గ్రామస్తులు నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారే లేరని స్థానికులు పేర్కొంటున్నారు. 

బోర్డులు ఎక్కడివి?

చెరువు శిఖం భూముల్లో వ్యవసాయంతో లబ్ధి పొందడమే తప్ప వాటిని అమ్మడం కుదరదు. కనీసం అందులో హద్దులు వేయాలన్నా అధికారులు అనుమతి తప్పనిసరి అని పలువురు పేర్కొంటున్నారు. అలాంటి ఆ స్థలంలో ప్రైవేటు సంస్థల బోర్డులు నెలకొల్పడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో చెరువులో ఈ భూమి ఓ ప్రైవేట్ కంపెనీకి చెందినదిగా బోర్డు ఉండేది. ఇటీవల, నెల క్రితం నుంచి మరో కంపెనీ బోర్డు దర్శనమివ్వడం బడా రియల్ వ్యాపారులు పనే అయి ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. అధికారుల ప్రోత్సాహంతోనే గుండం చెరువులో ఫెన్సింగ్ జాలి, హెచ్చరిక బోర్డులు వెలుస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.  

గుండం చెరువు సర్వేకు ఆదేశించాం

కోహీర్ మండలంతోని చితల్ ఘాట్ గ్రామంలో ఉన్న గుండం చెరువు మధ్యలో నుంచి కడీలు పాతి ఫెన్సింగ్ జాలి ఏర్పాటు చేశారని గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. విచారణ చేపట్టాలని తహసీల్దార్‌ను ఆదేశించా. గుండం చెరువుకు ఎఫ్‌టీఎల్ పరిధి గుర్తించేందుకు నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులు జాయింట్ సర్వే చేయాలని కోరాను. పట్టా భూమి ఉన్న వారు సరిహద్దులు ఏర్పాటు చేసుకోనేందుకు అవకాశం ఉంది. కానీ ఫెన్సింగ్ వేసుకునే నిబంధన లేదు. ఎఫ్‌టీఎల్ గుర్తించి రక్షణ చర్యలు చేపడతాం. రాజు, ఆర్‌డీవో, జహీరాబాద్

గుండం చెరువులో ఎఫ్‌టీఎల్ హద్దులు గుర్తిస్తాం

గుండం చెరువు మధ్యలో పట్టా భూమి ఉన్నవారు కడీలు పాతి ఫెన్సింగ్ జాలి ఏర్పాటు చేశారని గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. దీంతో ఎఫ్‌టీఎస్ పరిధిపై సర్వే చేయాలని రెవెన్యూ శాఖను కోరాం. గుండం చెరువు 6.04 ఎకరాలో ఉంది. పట్టా భూమి సుమార్ 17 ఎకరాల వరకు ఉంటుందని అంచనా. పట్టా భూమి ఉన్న వారు చెరువు మధ్యలో ఎలాంటి నిర్మాణాలు చేసేందుకు అనుమతులు లేవు.  నిబంధనలకు వ్యతిరేకంగా కడీలు పాతి, ఫెన్సింగ్ జాలి వేస్తే తొలగిస్తాం. ఎఫ్‌టీఎల్ పరిధిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తాం.

 -డీఈఈ, నీటిపారుదల శాఖ, జహీరాబాద్