ఈ జంట ఎందుకు విడిపోయింది?
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్’. ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌లో శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా, అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ ద్విభాషా చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా ఉభయ భాషల్లోనూ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమాను మేకర్స్ ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్, టీజర్, పాటలు సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. తాజాగా టీమ్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
హరి, జూలియట్ పాత్రల్లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఒదిగిపోయారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ట్రైలర్ ఆరంభంలో వారి మధ్య ఉన్న అందమైన ప్రేమకథను చూపించారు. ఈ అందమైన జంట జీవితంలో ఒక ఊహించని పెద్ద మలుపు చోటుచేసుకుంటుంది.
హరి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అసలు హరి జైలుకు ఎందుకు వెళ్లాడు? అప్పుడు జూలియట్ పరిస్థితి ఏంటి? జైలు నుంచి బయటకు వచ్చిన హరి తన జీవితాన్ని నాశనం చేసిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనే అంశాలను ట్రైలర్‌లో చాలా ఆసక్తికరంగా చూపించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, జ్ఞాని నేపథ్య సంగీతం సమకూర్చారు. ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ అందించారు.




