ఖమేనీ హత్యపై మౌనమెందుకు?
మోదీ వైఖరిపై సోనియా అభ్యంతరం
న్యూఢిల్లీ, మార్చి 3 : ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా విమర్శించారు. ఈ క్లిష్ట సమయంలో భారత్ మౌనంగా ఉండటం తటస్థత అనిపించుకోదని, అది నైతిక బాధ్యత నుంచి తప్పుకోవడమేనని ఆమె ధ్వజమెత్తారు. మంగళవారం ఒక పత్రికలో రాసిన వ్యాసంలో సోనియా గాంధీ పలు కీలక అంశాలను లేవనెత్తారు.
సార్వభౌమ దేశాధినేతను లక్ష్యంగా చేసుకుని హత్య చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. ‘ఒకప్పుడు శాంతి, న్యాయం కోసం గొంతు విప్పిన భారత్, ఇప్పుడు తన చిరకాల మిత్రుడైన ఇరాన్ సంక్షోభంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండటం మన దౌత్య విలువలకే విఘాతం‘ అని ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాలపై దాడులను ఖండించిన ప్రధాని ఇరాన్‌పై జరిగిన దాడిని ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు.
ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగించుకుని వచ్చిన 48 గంటల్లోనే ఈ దాడి జరగడం కేవ లం యాదృచ్ఛికం కాదని సోనియా గాంధీ అనుమానం వ్యక్తం చేశారు. భార త విదేశాంగ విధానం ఒక వ్యక్తి ’వ్యక్తిగత’ దౌత్య కేంద్రంగా మారిపోయిందని ఆమె విమర్శించారు. రష్యా, చైనా వంటి దేశాలు ఈ దాడిని ఖండిస్తుంటే, భారత్ మౌనంగా ఉండటం ’నిశ్శబ్ద ఆమోదం’ తెలిపినట్టుగా ఉందని, ఇది గ్లోబల్ సౌత్ దేశాల్లో మన పరపతిని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ఖమేనీ మృతికి సంతాపం కూడా తెలపకపోవడం చారిత్రక మిత్రుడికి ద్రోహం చేయడమేనని సోనియా అభివర్ణించారు.




