బీజేపీకే ఓటేయండి!

02-05-2024 12:10:45 AM

టీఎంసీ కన్నా ఆ పార్టీయే బెటర్ 

కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ వ్యాఖ్యలు

కోల్‌కత్తా : దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి కొనసాగుతున్న నేపథ్యంలో నేతల మాటలు కాక రేపుతున్నాయి. బుధవారం ఎన్నికల ర్యాలీలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ప్రజలు తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి ఓటేయడం కంటే బీజేపీకి ఓటేయడం మంచిదని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను బీజేపీ నేత షెహజాద్ పూనావాలా ఎక్స్ వేదికగా షేర్ చేయగా వైరల్ అవుతోంది. “ప్రస్తుతం కాంగ్రెస్, కమ్యూనిస్టు వంటి సెక్యులర్ పార్టీలు గెలవడం అనివార్యం. లేదంటే ప్రజాస్వామ్యం ప్రమాదం లో పడుతుంది. బెంగాల్ ప్రజలు టీఎంసీకి ఓటేయడం అంటే బీజేపీకి ఓటేయడమే. కాబట్టి, టీఎంసీ కంటే నేరుగా బీజేపీకి ఓటేయడమే మంచిది.” అని చౌదరి తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. కాగా, అధిర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ తాను ఇంకా వీడియోను చూడలేదని, ఆయన ఏ సందర్భంలో ఈ వ్యాఖ్య లు చేశారో తెలియన్నారు. “బీజేపీని ఓడించడమే మా ముందున్న ఏకైక లక్ష్యం. ఇండి యా కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలతో పాటు టీఎంసీ కూడా భాగస్వామిగా ఉంది. ఈ విషయాన్ని టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ సైతం చెప్పారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్, తృణముల్ మధ్య పొత్తు లేదు.” అని వ్యాఖ్యానిం చారు. కాగా, అధిర్  రంజన్ చౌదరి వ్యాఖ్యలను టీఎంసీ ఎక్స్ వేదికగా తిప్పి కొట్టింది. ఆయన బీజేపీ బీ టీమ్ మెంబర్ అంటూ ఘాటుగా విమర్శించింది. ఈ ద్రోహానికి పాల్పడిన ఆయనకు బహరంపూర్ ప్రజలు తగిన సమాధానం చెబుతారని పేర్కొంది. కాగా, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.