calender_icon.png 19 September, 2025 | 12:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాపురంలో కలహాల చిచ్చు...

19-09-2025 10:51:03 AM

భర్తను హత్య చేసిన భార్య

వేధింపులు తాళలేక ఘాతుకం

నార్సింగి:(విజయక్రాంతి): ​బతుకు పోరాటంలో గెలిచేందుకు సుదూర అస్సాం నుంచి భాగ్యనగరానికి వలసొచ్చిన ఓ జంట కథ విషాదాంతమైంది. కట్టుకున్న భర్త పెట్టే నిత్య నరకాన్ని భరించలేని ఆ ఇల్లాలు, క్షణికావేశంలో హంతకురాలిగా మారింది. వంటింట్లో కూరగాయలు కోసే కత్తే భర్త ప్రాణం తీసే ఆయుధమైంది. ఈ దారుణ ఘటన నగర శివారులోని కోకాపేటలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. నార్సింగి పోలీసుల కథనం ప్రకారం... అస్సాంకు చెందిన భరత్ బరోడా, కృష్ణ జ్యోతి బోరా దంపతులు. పొట్ట చేతబట్టుకుని నగరానికి వచ్చి, కోకాపేటలో నిర్మాణ రంగ కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా భర్త భరత్ తన భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు.

ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి వీరి మధ్య మాటామాటా పెరిగింది. భర్త వేధింపులతో తీవ్ర మానసిక వేదనకు గురైన కృష్ణ జ్యోతి, ఆ గొడవతో సహనం కోల్పోయింది. వంటింట్లో ఉన్న కత్తిని తీసుకుని భర్త భరత్‌పై విచక్షణారహితంగా దాడి చేసింది. అతని కేకలు విని చుట్టుపక్కల వారు వారి గదికి పరుగున వచ్చారు. రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడివున్న భరత్‌ను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, శరీరం నుంచి తీవ్రంగా రక్తం పోవడంతో చికిత్సకు స్పందించక అతను కన్నుమూశాడు. ​సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. భార్య కృష్ణ జ్యోతిని అదుపులోకి తీసుకుని, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.