21-07-2025 12:00:00 AM
అలిష్టపడిన కంటిపాపలు రెండూ
గాఢంగా కావలించుకునే ఆళ్లకు
అదాల్లునొచ్చిన నీ రూపం
ఆ రెండిటిని కలుసుకోనిత్తలేదు
నాకిప్పుడూ రోజూ ఇదే తంతు దోస్త్!
ఎప్పుడన్నా బలిమీటికి కంటి
పాపలను కలిపి
కాసింత కునుకు తీస్తున్నప్పుడు
లీలగా నీ రూపం కదలాడుతుంది..
తలుపులేసున్న ఇంటిముంగట
అటీటూ తిరుగుతూ
నన్నాటకెట్టా బైటికి రప్పియాల్నో తెల్సిన సాయితగాని లెక్కనే
అలుముకున్న కంటిపాపల ముందు కదలాడుతున్న నీవు
నన్ను రెక్కబట్టుక
గుంజుకపోతున్నట్టుందిరా !
మీరు ఏడేడ పాడినారో, ఏడేడ ఆడినారో
ఏడేడనో దారి తప్పి, ఏడేడ కలిసినారో
ఆ తావులన్నీ కలియదప్పి
సూపుతున్నపుడూ
కాళ్లకిందంతా పచ్చిగా పారుతున్న
మీ నెత్తురు
ఒంట్లె బలమంతా ఎవలో
పీక్కతాగినట్టున్న నన్నుజూసి
నిదుర కళ్లెమ్మటా రెండు ధారలు
ఒక్కతీరుగ కారుతున్న
కన్నీళ్లను తుడిసి ఏమైంది బిడ్దని
అవ్వడిగితే
రోజు రాతిరి జరుగుతున్నదంతా జెప్పిన
ఎర్రగైన నా కళ్లలోకి కళ్లుపెట్టి ఏదో ఎతుకుతున్న అవ్వ
దుఃఖాన్ని కడుపులో దాసిన నిజాన్ని దాయని బొంగురు గొంతుతో
‘దినాం బొచ్చెడు మంది సత్తండ్రు అట్లనే ఈళ్లు కూడా..
సావన్నది తప్పదు గదరా !’ అన్నపుడు
అవ్వ కళ్లల్లోకి సూటిగా సూత్తూ అడిగిన
‘అచ్చిపోయే తొవ్వల.. ఓ చెట్టు
కూలితేనో, కాలితేనో
కలికలి కాని నువ్వు అడవి కాలితే ఎక్కెక్కి ఏడిసినవెందుకే అవ్వా?’
అనంగనే
అవ్వ శెవుకాడ మెల్లిగా నేను వాళ్లంటే అడివి అన్నా!
‘కాదు కాదు అడివంటేనే వాళ్లు’ అని గట్టిగా అరిచింది అవ్వ !