calender_icon.png 22 July, 2025 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెలివేతల భారతం ‘రేపటి కాలం’

21-07-2025 12:00:00 AM

  1. ‘రాజ్యాంగం లేకపోతే దేశ రథచక్రాలు కదలవు
  2. అంబేద్కర్ ఆశయ ఆలోచనలు అగ్నిపర్వతాల్లా బద్దలయితే

మీరూ పరారే !’ అంటూ.. ప్రేమించే మనిషి కోసం, నీడనిచ్చే మానవత కోసం, అనురాగం పంచే ఆత్మీయత కోసం, సామాజిక సమానత కోసం, సామాజిక న్యాయం కోసం ఎదిరెపల్లి కాశన్న తన ‘రేపటి కాలం’ కవితా సంపుటితో ప్రశ్నిస్తున్నాడు. అట్టడుగు కులాల అభాగ్యు లపై స్వారీ చేస్తున్న అగ్రకుల పెత్తందారీతనాన్నీ, సమాజానికి తెలియ జేసేందుకు తాను పెట్టిన పొలికేక.. ఈ కవితా సంపుటి.

183 పుటలు 90 కవితల తో  కండపట్టి నిగ నిగలాడుతున్న మక్కకంకుల పొత్తుమోలె.. పుస్తకం నిండా గట్టిగింజల్లా కాశ న్న కవితలు. కాదు కాదూ.. అడుగడునా అవమానాల వెలివేతల తిరస్కారం ఎగురవేసిన పతాకం. దళితుల గొంతుకై ప్రతిఘటనా స్వర మై ముందుకు కదులుతున్నాడీ కవి కాశన్న.

కవితా సంపుటికి ప్రజాకవి గోరటి వెంకన్న ‘నీరెండ కవనం’, కోయి కోటేశ్వరరావు ‘కాశన్న కవిత్వం సజీవ వాస్తవికత’, సామిడి జగన్ రెడ్డి ‘నిరసనకు నిలువెత్తు సంతకం’తో రాసిన ముం దు మాటలనే ఆత్మీయ వాక్యాలు కవితా సంపుటికి తంగేడు పూల పరిమళాలు అద్దుతాయి.

అట్టడుగు జీవితం నుంచి..

కవి కాశన్న నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలూకా పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్‌లోని మాదిగ వాడలో మశమ్మ, సవారయ్య దంపతులకు జన్మించాడు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో ఉద్యమాల్లోకి వచ్చాడు. దళిత హక్కుల కోసం ‘దళిత సమైక్య’ కార్యకర్తగా, తెలంగాణ మహసభ కార్యకర్తగా ఉద్యమానికి అంకితమయ్యాడు. సమాజంలో దళితులు ఎదుర్కొంటున్న వివక్షణ చూసి చలించిపోయా డు.

అలా తనలో సహజంగానే కవి ఉదయించాడు. సమాజం నుంచి దూరంగా విసిరేయబ డిన మాదిగ లందెపొద్దులో పుట్టి అక్షరాలు దిద్దాడు. అలా 2018లో ‘మూలచుక్క’, 2022 లో ‘తిరగబడె నిషిద్ధున్ని’ అంటూ రెండు కవి తా సంపుటిలు వెలువరించాడు. కాశన్న విడుదల చేస్తున్న మూడో పుస్తకమే ‘రేపటి కాలం’

కాశన్న కవిత్వంలో ఏముందంటే..

సమాజంలో దళితులు ఎక్కడ ఉన్నారు?. రాజ్యాంగ ఫలాలు ఎవరికి దక్కుతున్నాయి? రాజకీయ నాయకులు ఎవరిని ఉసిగొలుపు తూ, ఎవరిని బానిసలుగా  నడిపిస్తున్నారు?  సంక్షేమ పథకాలు కాగితాల్లో మెరిసి, నాయకు ల ప్రసంగాల్లో మురిసి, వాడలకు రాకముందే అదృశ్యమైపోతున్నాయి. ఏటా ప్రవేశపెడుతు న్న “బడ్జెట్‌” చిల్లుల బొక్కెనతో నీళ్లు చేదినట్లున్నాయన్న ఆవేదన కాశన్నది.

“నిజమైన వార సుడు” కవితలో ‘కోనసీమకు అంబేడ్కర్ పేరు పెడితే/ ఏవైనా కొంపలు మునిగిపోయావా/ ఊరూరా అంబేద్కర్ విగ్రహాలనడుగు/ఆ చూ పుడు వేలు/ ప్రపంచానికి /దారి చూపుతున్నది / ఆకాశమంతా అంబేడ్కర్ ముందు/ నీ కనుచూపు ఎంత?”అంటూ జాతిని జాగృత పరిచిన అంబేడ్కరే మా మార్గదర్శి అంటూ.. సమతా జెండాను భుజానికెత్తుకుని అంబేడ్కర్‌ను కీర్తిస్తాడు కాశన్న.

కులవివక్షపై ధిక్కారం..

‘అతడు అమ్మకపు పురవీధుల్లో దేశాన్ని/ నిలబెట్టిన దేశభక్తుడు/ భారత్ వెలిగిపోవడం కాదు /భారత్ కరిగిపోతున్నది/ జాతీయవాద పు తోలు కప్పుకొని /హైందవ నాగులు తిరుగుతున్నవి/ కనిపించిన అన్నింటినీ మింగేస్తోంది/ రాజ్యం కాలనా గు’ అని రాజ్యం తీరును ఎండగట్టాడు కాశన్న. విజ్ఞానం చంద్రమండలానికి పోయినా కుల వివక్ష ఇంకా సమాజంలో పాతుకుపోతున్నది.

రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాకు చెందిన ఇంద్ర మేఘవాల్ అనే తొమ్మిదేళ్ల దళిత విద్యార్థి తాను చదువుతున్న సరస్వతి విద్యానికేతన్ పాఠశాలలోని కుండలో నీళ్లు తాగినందుకు అగ్రకుల ఉపాధ్యాయుడు బాలుడిపై దాడి చేశాడు. దాడిలో బాలుడు మరణించాడు. భారత్ అమృతోత్సవాల సమయంలోనే ఈ ఘటన సంభవించింది. కాశన్న బాలుడి మరణంపై..

ఇంద్ర మేఘవాల్ శవం /మీద అమృతోత్సవం సంబురాలు/ ఒక గ్లాసు మంచినీళ్లకు/ నోచుకోలేని అమృతోత్సవం సంబురాలు/బూటకపు ఉత్సవాలు’ అని కాశన్న నిరసిస్తాడు. ‘ఇది నా మాతృభూమి కాదు.. రైతుల గుండెకోత. తల్లుల కడుపు కోత..’ అంటూ విలవిలాడుతూ వలపోత రాస్తాడు కాశన్న. ‘నా పేరు ఆకలి అంటరానితనం/ నా ఊరు వెలివాడ/ నా ఊపిరి ఆత్మగౌరవం/ నా ఉనికి పోరాటం/ హక్కులు రాజ్యాధికారం’ అంటూ నినదిస్తాడు కాశన్న. 

(రేపు ‘రేపటికాలం’ కవితా సంపుటి ఆవిష్కరణ సందర్భంగా)