20-07-2025 12:00:00 AM
డాక్టర్ తిరునహరి శేషు :
భారతదేశంలో వెనుకబడిన వర్గాల (బీసీ) రిజర్వేషన్లు అమలు ఒక సంక్లిష్టమైన అంశంగా మారింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2019లో మొదటిసారి జరిగిన స్థానిక సం స్థల ఎన్నికల్లో, ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అప్పటివరకు బలహీన వర్గాలకు అమలైన రిజర్వేషన్లు 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గిపోవడంతో మొద ట వివాదం ప్రారంభమైంది.
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కామారెడ్డిలో నిర్వహించిన సభలో ‘మా పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం’ అని హామీ ఇచ్చారు. ఆ హామీనే కాంగ్రెస్ పార్టీ ‘కామారెడ్డి డిక్లరేషన్’ అని ప్రకటించుకున్నది. అనుకున్నట్టే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలనే డిమాండ్ తెరపైకి రాగానే, హైకోర్టు మూడు నెలల్లో ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం లోకల్ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలనే మీమాంసలో పడింది. ముం దుగా ఇచ్చిన హామీ ప్రకారం.. ప్రస్తుత బీసీ రిజర్వేషన్లకు మరొక 19 శాతం అదనంగా అమలు చేయాల్సి ఉంటుంది.
దీనిలో భాగంగానే రాష్ట్రప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై డ్రాఫ్ట్ బిల్లును రూపొందించి ఉభయ సభల్లో ఆమోదింపజేసింది. తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదానికి పంపిం చింది. కానీ, ఆ బిల్లుపై ఇప్పటివరకు ఎలాంటి అతీగతి లేదు. మరోవైపు సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.
తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం- 2018 లోని 285 (ఏ) క్లాస్‌కి సవరణలు ప్రతిపాదిస్తూ ఆమోదం కోసం గవ ర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ముసాయిదాను పంపింది. గవర్నర్ ఆ ముసాయిదాను ఆ మోదిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తేవాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తున్నది.
అనేక అనుమానాలు..
స్వాతం త్య్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ ఇలాంటి అనుభవం జరగలేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన రిజర్వేషన్ల బిల్లు ప్రకారం.. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీలకు కలిపి 25 శాతం మొత్తం 67 శాతం రిజర్వేషన్లవుతాయి. అప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాలైన 50 శాతం రిజర్వేషన్ల పరిమితి దాటిపోయినట్లవుతుంది. ఈ నేపథ్యంలో బిల్లు ఎలా ఆమోదం పొందుతుందనే మౌలిక ప్రశ్నలకు సహేతుకమైన సమాధానం దొరకడం లేదు.
రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులో రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటడం, ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించకపోవడం, బీసీలకు 42 శాతం ఎందుకు ఇస్తున్నామో సహేతుకమైన కారణం చూ పించకపోవడం, బిల్లును స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లకు మాత్రమే పరిమితం చేయకుండా, విద్యా, ఉద్యోగ రంగాలకూ వర్తింపజేయటం బిల్లులో ప్రధాన లోపాలుగా కనిపిస్తున్నది.
బిల్లు ఆమోదంలో నూ పలు రాజ్యాంగ, చట్టబద్ధమైన, న్యా యపరమైన చిక్కుముడులు ఉన్నాయి. వాటన్నింటినీ, అధిగమిస్తేనే బిల్లు ఆమో దం పొందేందుకు అవకాశాలు ఉంటాయి. బిల్లు ద్వారా రిజర్వేషన్లు సాధ్యం కావడం లేదనే అభిప్రాయం ఏర్పడినప్పుడు, ప్రభు త్వం రిజర్వేషన్ల సాధనకు ప్రత్యామ్నాయ మార్గంగా ఆర్డినెన్స్ ప్రతిపాదనను తీసుకున్నది.
42 శాతం రిజర్వేషన్ల కల్పనకు ఆర్డినె న్స్ జారీ చేయడానికంటే ముందు, పంచాయతీరాజ్ చట్ట సవరణ గవర్నర్ ఆమో దం పొందాలే గానీ, ఎలాంటి అధ్యయనం చేయకుండా న్యాయపరమైన సలహాలు తీసుకోకుండా గవర్నర్ ఆ ముసాయిదా ను ఆమోదిస్తారా..
ఒకవేళ గవర్నర్ ఆ ముసాయిదాకు ఆమోదం తెలిపినా, తర్వా త ప్రభుత్వం జారీ చేసే ఆర్డినెన్స్‌పై న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు కాకుండా ఉంటాయా? మరి పిటిషన్ల సంగతి న్యా యస్థానాలు వెంటనే తేలుస్తాయా? ఒకవేళ సమస్య ఒక కొలిక్కి రాకపోతే పాత రిజర్వేషన్ల పద్ధతితోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది కాబట్టి.. అప్పుడు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పించగలుగుతుందనేది అసలు ప్రశ్న.
తమిళనాడులో ఎలా సాధ్యమైందంటే?
రిజర్వేషన్ల పెంపు అంశం తెరపైకి వచ్చిన ప్రతి సందర్భంలోనూ తమిళనాడులో అమలవుతున్న 69 శాతం రిజర్వే షన్ల గురించి కొందరు ప్రస్తావిస్తున్నారు. కానీ, తమిళనాడులో అధికారంలోకి వచ్చి న ప్రతి ప్రభుత్వమూ సుదీర్ఘ కాలం పాటు ఆ ప్రక్రియపై కసరత్తు చేశాయి. రాజ్యాంగ ప్రక్రియ ద్వారా బలమైన సహేతుకమైన కారణాలను అన్వేషించాయి. చివరకు 69శాతం రిజర్వేషన్లను పెంచుకోగలిగా యి.
ఈ విషయాన్ని ఎవరూ మరచిపో కూడదు. 1970లో సత్తి నాదన్ కమీషన్ సిఫార్సుల మేరకులో బీసీల రిజర్వేషన్ 25 శాతం నుంచి 31 శాతానికి పెంచినప్పుడు, ఎంబీసీ లాంటి ఒక కొత్త వర్గాన్ని సృష్టించి ఆ వర్గాలకు అన్యాయం జరిగిందనే కారణంతో రిజర్వేషన్లను సు ప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు పాలకు లు పెంచగలిగారు.
1982లో అంబా శంక ర్ కమీషన్ బీసీ రిజర్వేషన్లతో కేవలం 11 కులాలు మాత్రమే ప్రయోజనం పొందా యి కాబట్టి, బీసీల్లోని కింది వర్గాలకు కూడా రిజర్వేషన్ల ఫలాలు అందాలంటే రిజర్వేషన్లను 31 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని బీసీలను నాలుగు గ్రూపులుగా వర్గీకరించాలని కమిషన్ సిఫార చేయటం వల్ల ఈ సహేతుకమైన కారణంతో బీసీలకు 50 శాతం, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు ఒక శాతంతో మొత్తంగా 69 శాతం రిజర్వేషన్లు సాకారమయ్యాయి.
అడ్డంకులేంటి?
1994లో 243 (డీ) (టీ) ఆర్టికల్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే సందర్భంలో ఆ రిజర్వేషన్ల కు ఒక నిర్దిష్ట పరిమాణం నిర్ణయించకపోవడం, 2010లో కృష్ణమూర్తి వర్సెస్ యూ నియన్ ఆఫ్ ఇండియా కేసులో ట్రిపుల్ టెస్ట్ ద్వారా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి, బీసీల వెనుకబాటు తనం ఆధారంగా రిజర్వేషన్ల పరిమితి 50 శాతం మించకుండా రిజర్వేషన్లు కల్పించాలనే తీర్పు.. బీసీల రిజర్వేషన్ల పెంపునకు అడ్డుగోడగా మారింది.
అలాగే రాష్ట్రప్రభుత్వం నియమించిన భూసాని వెంకటేశ్వరరావు డెడికే టెడ్ కమీషన్ రిజర్వేషన్ల పెంపునకు ఒక స్పష్టమైన కారణాన్ని చూపకుండా, ఇంకా బీసీలలో వెనుకబాటు తనం కొనసాగుతుంది.. కాబట్టి 42 శాతం రిజర్వేషన్లను ప్రతిపాదిస్తున్నామని బిల్లులో చెప్పిన కారణంతో రిజర్వేషన్లు సాధించలేకపోవచ్చు.
1994 నుంచి 2019 మ ధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సంక్రమించిన 34 శాతం రిజర్వేషన్లను కేవలం కొన్ని సామాజికవర్గాలే ఉపయోగించుకుంటున్నాయని, మెజార్టీ ఎం బీసీ కులాలు, సంచార జాతులు రిజర్వేషన్లను ఉపయోగించుకోలేక రాజకీయంగా వెనుబడ్డాయనేది వాస్తవం. ఈ విషయాన్ని ప్రభుత్వం గానీ, డెడికేటెడ్ కమిష న్ గానీ.. బిల్లులో ప్రస్తావించలేదు.
ఎంబీసీలు, సంచార జాతులకు న్యాయం చేసేందుకు బీసీల రిజర్వేషన్లను 23 శాతం నుంచి 42 శాతానికి పెంచుతున్నామని, అలాగే బీసీ రిజర్వేషన్లను వర్గీకరిస్తున్నామనే అంశం డెడికేటెడ్ కమీషన్ బిల్లులో ప్రస్తావించి ఉంటే, రిజర్వేషన్ల సాధనకు మార్గం సుగమమయ్యేది. కులగణన నుంచి రిజర్వేషన్ల బిల్లు, రాబోయే ఆర్డినెన్స్ వరకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లోనూ స్పష్టత లేదు. ఇవన్నీ బోసీ కోటా అమలుపై ప్రశ్నలే.
వ్యాసకర్త - 98854 65877