16 July, 2026 | 9:04 AM

బీఆర్‌ఎస్ 15 నెలలైనా బతుకుతదా?

04-07-2024 02:13 AM

15 ఏళ్లు అధికారంలో ఉండటం పక్కనబెడితే..

త్వరలోనే 15 మంది ఎమ్మెల్యేలు జంప్ అవుతారు

హరీశ్‌రావుకు రఘునందన్ కౌంటర్ 

సీఎం రేవంత్‌పైనా మెదక్ ఎంపీ విమర్శలు

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి 15 ఏళ్ల పాటు కొనసాగుతామని ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలను మెదక్ ఎంపీ రఘునందన్ కొట్టిపారేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల వరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు 15 మంది అధికార పార్టీలోకి జంప్ అవుతారని, కనీసం మరో 15 నెలల వరకు ఆ పార్టీ ఉంటుందా అని ఎద్దేవా చేశా రు.

కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తున్నా అమ లులో మాత్రం పూర్తిగా విఫలమైందని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారం కోసం ఎన్నికల సమయంలో సోనియాగాం ధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9వ తేదీన రూ.2లక్షల రుణమాఫీ, రైతు భరోసా ఇస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వారి హైకమాండ్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చి వరంగల్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ల పేరు మీద అనేక హామీ లు ఇచ్చారని కానీ ఏదీ అమలు కాలేదన్నా రు. అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తవుతుంటే ఇప్పుడు కమిటీలు, కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తున్నారని విమర్శించా రు. విత్తనాలు, ఎరువులు, పెట్టుబడులకు పైసలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే ఉపముఖ్యమంత్రి నాయకత్వంలో కమిటీ వేయాలని రేవంత్‌రెడ్డికి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. 

మాటలే.. చేతలేవి?

ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు నెలలోగా అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని కానీ అది ఏ నెలనో చెప్పలేదని రఘునందన్ ఎద్దేవా చేశారు. హామీ ఇచ్చిన మేరకు అర్హులైన రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డివి వట్టి మాటలేనని, చేతలు ఉండవని విమర్శించారు. తన భూమిని కొందరు కాంగ్రెస్ నాయకులు కబ్జా చేస్తున్నారని ఖమ్మం జిల్లా రైతు మంగళవారం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైన విషయమన్నారు. ఇప్పటికైనా సీఎం మేలుకొని రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు.

ఆంధ్రలో కలిపిన 7 మండలాల గురించి మాజీ సీఎం కేసీఆర్ ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను, మంత్రులను కలవలేదని వారి సమస్యలను వినలేదని అన్నారు. నేటి ఫిరాయింపుదారులే రేపు ఫిరంగులై పేలుతారని కేసీఆర్‌కు తాను గతంలోనే చెప్పినట్లు గుర్తుచేశారు. పాత బస్తీల విద్యుత్ బకాయిలు వసూలును అదానీకి ఇవ్వడమేంటని, టెండర్లను పిలిచి ఏజెన్సీలకు ఇచ్చేందుకు కనీసం ప్రభుత్వం వద్ద ఒక పద్ధతి లేదని అన్నారు. పార్లమెంట్‌లో రాష్ర్ట ప్రయోజనాలు, ఆకాంక్షలు నిలబెట్టడానికి బీజేపీ ఎంపీలందరం కృషి చేస్తామని రఘునందన్ హామీ ఇచ్చారు.