బడాబాబుల జోలికి హైడ్రా వెళ్లదా?
- పేదల ఇళ్లనే కూలుస్తుందా?
- కాంగ్రెస్ కనుసన్నల్లోనే నాదర్‌గుల్ ప్రభుత్వ భూముల కబ్జా
- రియల్ ఎస్టేట్ మాఫియా, పోలీసుల నుంచి రక్షించాలని హరీశ్‌రావుకు రైతుల మొర
- అధికారులకు ఫోన్ చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): ప్రభుత్వ భూములు, చెరువుల రక్షణ కోసమే హైడ్రా తీసుకొచ్చామని గొప్పలు చెబుతున్న సీఎం, నాదర్‌గుల్‌లోని వేల కోట్ల ప్రభుత్వ భూమి, అందులోని చెరువును రియల్ ఎస్టేట్ రాబందులు కబ్జా చేస్తుంటే ఎందుకు నిద్రపోతున్నారని, బడాబాబుల జోలికి హైడ్రా వెళ్ల దా అని మాజీ మంత్రి హరీష్‌రావు విరుచుకుపడ్డారు. హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చ డానికేనా? ప్రభుత్వ పెద్దల అండదండలతో ప్రభుత్వ భూములను, అందులోని చెరువులను, ఫీడర్ ఛానల్‌ను ధ్వంసం చేస్తూ కంచెలు వేసి కబ్జా చేస్తున్న బడా రియల్ ఎస్టేట్ సంస్థల వైపు కన్నెత్తి చూసే దమ్ము హైడ్రాకు ఎందుకు లేదని నిలదీశారు.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం, నాదర్‌గుల్ పరిధిలోని సర్వే నంబ ర్ 613 (119) ‘కాసుబాగ్ కంచ’లో ఉన్న 373 ఎకరాల, వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా దాడులు, పోలీసుల వేధింపుల నుంచి తమను రక్షించాలని కోరుతూ నాదర్‌గుల్‌కు చెందిన వందలాది మంది రైతులు మాజీ మంత్రి హరీ శ్ రావును బుధవారం కలిశారు. కబ్జాదారులు వేసిన కంచెలు, ధ్వంసమైన తమ వ్యవసాయబోర్లు, దాడుల్లో గాయపడిన ఫొటోలు, వీడి యోలను హరీశ్‌రావుకు చూపించి తమ గోడు ను వెళ్లబోసుకున్నారు.
రైతుల సమస్యలు విన్న హరీశ్ రావు తక్షణమే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. నాదర్ గుల్ భూములు అన్యాక్రాంతం కాకుండా గతంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద హైకోర్టు వరకు న్యాయపోరాటం చేసిందని గుర్తుచేశారు. ఆ భూములు ప్రభుత్వానివే అని ప్రస్తుత ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందన్నారు.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ప్రైవేట్ వ్యక్తులకు ఈ భూములను ధారాదత్తం చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. రైతుల ఫిర్యాదుపై స్పందించిన హరీశ్ రావు రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి, సీపీ సజ్జనార్, స్థానిక ఆర్డీవో, ఎమ్మార్వోలకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. వెంటనే రైతులను ఆ భూముల్లోకి అనుమతించాలని డిమాండ్ చేశారు.
రాజకీయ పునరావాస కేంద్రాలుగా కార్పొరేషన్లు..
సీఎం రేవంత్ రెడ్డికి కార్పొరేషన్ పదవులు ఇవ్వడంపై ఉన్న శ్రద్ద, నిధులు విడుదల చేయడంలో లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు, విధులు లేకుండా కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని మండిపడ్డారు. కార్పొరేషన్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చి ఏం సాధిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 కార్పొరేషన్లకు చైర్ పర్సన్లు ప్రకటించడం పట్ల హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు.
ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 33 కార్పొరేషన్లకు నిధులు కేటాయించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు మరి కొందరికి కార్పొరేషన్ పదవులు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. 33 కార్పొరేషన్లకు గాను 21 కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అసలు ఉద్దేశ్యాన్ని నిర్వీ ర్యం చేస్తున్నారన్నారు. మాల, మాదిగ, సంతు సేవాలాల్, కొముం భీం, ఏకలవ్య, మైనార్టీ కా ర్పొరేషన్లకు ఒక్క రూపాయి కేటాయించకుం డా నిర్లక్ష్యం ప్రదర్శించడం వారి పట్ల చూపుతున్న వివక్షకు నిదర్శనమన్నారు.
ముదిరాజ్, యాదవ, మున్నూరు కాపు, కుమ్మరి, విశ్వ బ్రాహ్మణ, మేదర, వాల్మీకి, బోయ తదితర కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడం సిగ్గుచేటన్నారు.33 కార్పొరేషన్లకు గాను ఇప్పటి వరకు 14,521 కోట్లు కేటాయించగా, విడుదల చేసింది 3198 కోట్లు మాత్రమే అని, వినియోగించింది 305 కోట్లు మాత్రమే అని హరీష్‌రావు ఆరోపించారు.






