23-02-2026 01:39:53 AM
శ్రీలంకకు ఘోరపరాభవం
ఓడే మ్యాచ్‌లో లంక గెలుపు
పల్లెకెలె, ఫిబ్రవరి 22 : సూపర్ 8 తొలి మ్యాచ్ వర్షంతో రద్దయిన వేళ తీవ్ర నిరాశకు గురైన అభిమానులకు రెండో మ్యాచ్ మాత్రం ఊహించని కిక్ ఇచ్చింది. స్పిన్ ఉచ్చుతో ఇంగ్లీష్ టీమ్ ను తిప్పేద్దామనుకున్న శ్రీలంక చివరికి తామే అందులో చిక్కుకుని ఘోరపరాభవాన్ని చవిచూసింది. ఒకవిధంగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిచిందనే దాని కంటే శ్రీలంక చేజేతులా ఓడిందని చెప్పొచ్చు. సూపర్ 8 గ్రూప్ 2లో భాగంగా శ్రీలంక, ఇంగ్లాండ్ మధ్య జరిగిన పోరు ఆసక్తికరంగా సాగింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ లంక స్పిన్నర్ల దెబ్బకు చేతులెత్తేసింది. ఫిల్ సాల్ట్ (62) తప్పిస్తే మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. లంక స్పిన్‌ను ఎదుర్కోలేక బ్యాట్లెత్తేశారు. ఒక దశలో 94 పరుగులకే సగం వికెట్లు కో ల్పోవడంతో ఇంగ్లాండ్ కనీసం 120 రన్స్ అయినా చేస్తుం దా అనుకున్నారు. అయితే చివర్లో విల్ జాక్స్ 14 బంతు ల్లో 4 ఫోర్లతో 21 పరుగులు చేయడం ఇంగ్లాండ్ కు గౌరవప్రదమైన స్కోరు అందించింది. ఒకదశలో మంచి స్కోరు చేసిలా కనిపించినా లంక స్పిన్నర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది.
బట్లర్, బెథెల్ , బాంటన్ నిరాశపరిచారు. దీంతో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. లంక బౌలర్లలో వెల్లలాగే 3, మధుశనక 2, తీక్షణ 2 వికెట్లు పడగొట్టారు. స్పిన్ పిచ్ అయినప్పటకీ ఫామ్‌లో ఉన్న లంక బ్యాటర్లను చూస్తే ఇంగ్లాండ్ ఓటమి ఖాయంగా కనిపించింది. అయితే ఇంగ్లాండ్ స్పిన్నర్లు కూడా రాణించారు. ముఖ్యంగా విల్ జాక్స్ లంకను దెబ్బకొట్టాడు. వరుస ఓవర్లలో వికెట్లు తీసి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చేశాడు. విల్ జాక్స్ స్పిన్ మాయాజాలానికి శ్రీలంక పవర్ ప్లేలోనే సగం వికెట్లు కోల్పోయింది.
నిస్సాంక (9), మిషారా (6), కుశాల్ మెండిస్ (4), రత్నానాయకే(0) డకౌటయ్యారు. కెప్టెన్ శనక ఆదుకునే ప్రయత్నం చేసిన మిగిలిన వారి నుంచి సపోర్ట్ లేకపోయింది. శనక 24 బంతుల్లో 30 పరుగులకు ఔటవడంతో లంక ఓటమి ఖాయమైంది. చివరికి శ్రీలంక 95 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో విల్ జాక్స్ (3/22), డాసన్, ఆర్చర్, రషీద్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ తమ సెమీస్ అవకాశాలను మె రుగుపర్చుకోగా.. శ్రీలంక వెనుకబడింది.