calender_icon.png 24 February, 2026 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీలు గాడిన పడేనా?

24-02-2026 12:00:00 AM

  1. బల్దియాలో ప్రత్యేక పాలనకు తెర

అందుబాటులోకి నూతన కౌన్సిల్

కొత్త పాలకవర్గంపై పట్టణవాసుల గంపెడాశలు

కొత్త మున్సిపాలిటీలలో అక్రమాలకు చెక్ పడేనా ?

సంగారెడ్డి, ఫిబ్రవరి 23(విజయక్రాంతి):బల్దియాలో ప్రత్యేకాధికారి పాలనకు ఎట్టకేలకు తెరపడింది. ప్రజలు ఎన్నుకున్న నూతన పాలకవర్గం అందుబాటులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. కోహీర్, ఇస్నాపూర్, ఇంద్రేశం, గడ్డపోతారం, గుమ్మడిదల, జిన్నారం మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. మిగతా ఐదు మున్సిపాలిటీలలో గత 12 నెలల పాటు పాలకులు లేకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో మున్సిపల్ పాలన పూర్తిగా గాడి తప్పింది. వార్డుల్లోని సమస్యలను ఆలకించే వారు కరువయ్యారు.

పలు విభాగాల అధికారులు, ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. సమయపాలన పాటించకపోవడంతో ప్రజలకు సకాలంలో సేవలు అందని పరిస్థితి. అలాగే పలు విభాగాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నా యనే విమర్శలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో నూతన పాలకవర్గం ఏ విధంగా పారదర్శకమైన పాలన అందిస్తుందో అని పుర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే పంచాయతీ స్థాయి నుండి మున్సిపాలిటీగా మారి తొలి పాలకవర్గాలు కొలువుదీరిన నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తారో వేచిచూడాల్సిందే. 

అక్రమాలకు చెక్ పడేనా..?

జిల్లాలోని పాత మున్సిపాలిటీలలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ఇంజినీరింగ్ విభాగం ద్వారా చేపట్టిన పలు టెండర్ల ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా విమర్శలు వ్యక్తమయ్యాయి. కొంతమంది అధికారులు తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు తుంగలో తొక్కారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పారిశుద్ధ్యం పట్టించుకున్న నాథుడే కరువయ్యారని పలు వార్డుల ప్రజలు విమర్శించారు.

అలాగే పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు కొత్త మున్సిపాలిటీలలో గత పంచాయతీ పాలనలో కార్యదర్శులు ఇష్టారీతిగా అక్రమ భవన నిర్మాణాలను ప్రోత్సహించారు. అడ్డగోలుగా అనుమతులు ఇచ్చి లక్షల రూపాయలు దండుకున్నారు. మున్సిపాలిటీగా మారే సమయం వరకు కూడా అక్రమాల పరంపర కొనసాగింది. కొత్తగా ఏర్పడిన పాలకవర్గాలు ప్రధానంగా ఇంద్రేశం, ఇస్నాపూర్, గడ్డపోతారం, జిన్నారం, గుమ్మడిదలలో అనుమతిలేని అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటారా లేక అక్రమార్కులకు ఊతమిస్తారా వేచి చూడాల్సిందే.

పర్యవేక్షణ అస్తవ్యస్తం..

కౌన్సిల్ లేకపోవడం, ప్రత్యేకాధికారులు అంతగా దృష్టి సారించకపోవడంతో బల్దియాలలో పాలన వ్యవహారాలు పూర్తిగా గాడితప్పాయి. పలు విభాగాల అధికారులు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. ఇష్టారాజ్యాంగా విధులకు వచ్చి వెళ్తున్నారనే ఫిర్యాదులున్నాయి. ఎవరైనా ప్రశ్ని అధికారులు ఫీల్ విజిట్ వెళ్లారని చెబుతుండటం గమనార్హం.

ఇక తాగునీటి సరఫరా విభాగంలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు.. ఎవరు ఎక్కడ పనిచేస్తున్న రనే వివరాలు సాక్షాత్తు ఆ శాఖ ఇంజినీరింగ్ అధికారుల వద్దనే లేకపోవడం క్షేత్రస్థాయిలో వారిపై పర్యవేక్షణకు అద్దం పడుతోంది. ఇక ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలందించాల్సిన వార్డు ఆఫీసర్లలో పలువురు ఇతర జిల్లాల నుంచి రాకపోకలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లోనూ చేతి వాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.