15-12-2025 01:18:25 AM
తిరువనంతపురం, డిసెంబర్ 14: కేరళ స్థానిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. రాష్ట్ర రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్‌తో పాటు త్రిపునితుర మునిసిపాలిటీతో సహా పలు పురపాలక సంఘాలను కైవసం చేసుకుంది. రాష్ట్ర రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్‌ను సీపీఐ(ఎం) నుంచి బీజేపీ చేజిక్కించుకుంది. దీంతో 45 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతున్న లెఫ్ట్ పాలనకు ఈ ఎన్నికతో తెరపడింది.
బీజేపీ సాధించిన ఈ విజయంలో రిటైర్డ్ డీజీపీ ఆర్ శ్రీలేఖ విజయం కీలకమైంది. ఆమె శరభంగం డివిజన్ నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆమె విజయంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. దీంతో 64 ఏళ్ల శ్రీలేఖను మేయర్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆమె ఎన్నికైతే, రాష్ట్ర రాజధానిలో బీజేపీకి తొలి మేయర్ అవుతారు.తిరువనంతపురంలో పుట్టి పెరిగిన శ్రీలేఖ 1987 జనవరిలో కేరళ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి అయ్యారు.
మూడు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె కెరీర్‌లో, సీబీఐ, కేరళ క్రైమ్ బ్రాంచ్, విజిలెన్స్, ఫైర్ ఫోర్స్, మోటార్ వెహికల్స్ డిపార్ట్‌మెంట్, జైళ్ల శాఖ వంటి కీలక ఏజెన్సీలలో పనిచేశారు. 2017లో డీజీపీగా పదోన్నతి పొందారు.
గతఅక్టోబర్ 2024లో ఆమె బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. తన పోలీసు కెరీర్‌లో ఎటువంటి రాజకీయ అనుబంధం లేదని, పక్షపాతం లేకుండా పనిచేశానని ఆమె స్పష్టం చేశారు. కేరళ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు, తిరువనంతపురం కార్పొరేషన్‌కు నాయకత్వం వహించడానికి శ్రీలేఖను బీజేపీ ఎంపిక చేస్తుందా లేదా అనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.