19 April, 2026 | 2:37 AM

గాలిగోపురం నిర్మాణం పూర్తయ్యేనా?

19-04-2026 12:47 AM
  1. 18ఏళ్లుగా ముందుకు కదలని పనులు

ఏటా లక్షల్లో ఆదాయం ఉన్నా జరగని అభివృద్ధి

పొట్లపల్లిలోని స్వయంభూ రాజేశ్వరస్వామి ఆలయ దుస్థితి ఇది

బ్రహ్మశ్రీ కందారపు రమేశాచార్యులు, (హుస్నాబాద్, విజయక్రాంతి): దక్షిణ కాశీగా పేరుగాంచిన హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలోని స్వయంభూ రాజేశ్వరస్వామి ఆలయం నేడు అభివృద్ధి కోసం ఎదురు చూస్తోంది.భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ పవిత్ర క్షేత్రం ఏటా లక్షలాది ఆదాయం ఆర్జిస్తున్నప్పటికీ, ఆల య అభివృద్ధి పనులు మాత్రం నిలిచిపోవడం భక్తులను కలచివేస్తోంది.

ముఖ్యంగా ఆలయ మహాద్వారానికి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గాలిగోపుర నిర్మాణం 18 ఏళ్లుగా పూర్తి కాక అర్ధాంతరంగా నిలిచిపోవడంతో  గ్రామస్తులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గ్రామం లో 1996లో ఓ ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వుతుండగా శివలింగం వెలుగుచూసింది. ఈ దివ్య లింగాన్ని గ్రామస్థులు మహా భక్తిశ్రద్ధలతో 2006లో వాగు ఒడ్డున ప్రతిష్ఠించి స్వయంభూ రాజేశ్వరస్వామిగా ఆరాధించడం ప్రారంభించారు.

అప్పటి నుంచి గ్రామ ప్రజలు, దాతల సహకారంతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు, నిత్య పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తూ ఆలయ ఖ్యాతిని దూరదూరాలకు చాటారు.ఈ ఆలయ మహిమ, భక్తుల విశ్వాసం రోజురోజుకూ పెరుగుతుండటంతో క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో 2008లో గాలిగోపుర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ స్థపతి కుటుంబానికి చెందిన మదియాలగన్ స్థపతికి రూ.1.10 కోట్లతో ఒప్పందం కుదుర్చి పనులు అప్పగించారు. ముందస్తుగా రూ.80 లక్షలు చెల్లించగా, యుద్ధప్రాతిపదికన పనులు ప్రారం భించి సుమారు 85 శాతం నిర్మాణం పూర్తి చేశారు.

అయితే అనంతరం నిధుల కొరత, పరిపాలనా నిర్లక్ష్యం కారణంగా పనులు క్రమంగా మందగించి, చివరకు పూర్తిగా ఆగిపోయాయి. మిగిలిన పనులు పూర్తి చేయాలంటే కేవలం రూ.25 లక్షలు ఖర్చు చేస్తే సరిపోతుందని ఆలయ నిర్మాణ నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ అధికార యంత్రాంగం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ఆలయ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందనే ఆశతో అప్పటి గ్రామ సర్పంచ్ సులోచన రాజిరెడ్డి, అప్పటి ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్ తదితరుల సహకారంతో నాలుగేళ్ల క్రితం ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు.దీంతో ఆలయానికి ప్రభుత్వ పర్యవేక్షణ, నిధుల వినియోగం, అభివృద్ధి వేగవంతమవుతుందని గ్రామస్థులు ఆశించారు.అయితే ఏమాత్రం ప్రయోజనం కనిపించలేదని స్థానికులు వాపోతున్నారు. ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా రూ.40 లక్షలకు పైగా ఆదాయం వస్తోందని ప్రజలు చెబుతున్నారు.

భక్తుల కానుకలు, హుండీ ఆదాయం, ఉత్సవాల ద్వారా భారీగా నిధులు సమకూరుతున్నప్పటికీ ఆ నిధులు ఆలయాభివృద్ధికి వినియోగం కాకుండా ఖజానాకు మాత్రమే జమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.కోట్ల రూపాయల విలువైన ఆధ్యాత్మిక క్షేత్రానికి కేవలం రూ.25 లక్షలు ఖర్చు చేసి మహాగోపురాన్ని పూర్తి చేయలేకపోవడం విచారకరమని గ్రామ పెద్దలు అంటున్నారు.ఆలయానికి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని తిరిగి ఆలయానికే కేటాయించి గాలిగోపురంతో పాటు మౌలిక సదుపాయాలు, ప్రాంగణ అభివృద్ధి, యాత్రికుల సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.