రాయభారం ఫలించేనా?
- పార్టీ పెద్దలతో కొండా మురళి సమావేశాలు
- పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌తో భేటీకి యత్నం
- అంతకు ముందు రోజు డిప్యూటీ సీఎం భట్టితో సమావేశం
- అదే రోజు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ అయిన భట్టి విక్రమార్క
- కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలపై చర్చ
హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): రాష్ట్ర కాంగ్రెస్‌లో(State Congress) నెలకొన్న రాజకీయ పరిణామాలు.. ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ(Konda Surekha), మాజీ మంత్రి చిన్నారెడ్డి(Chinna Redd)ల విషయంలో పార్టీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందనే అంశంపై కాంగ్రెస్‌లో ఉత్కంఠగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి డబ్బులిచ్చి టికెట్ తెచ్చుకున్నాడని మాజీ మంత్రి చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో వేడి పుట్టించిన విషయం తెలిసిందే.
ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం కూడా సీరియస్‌గానే ఉందనే ప్రచారం జరుగుతున్నది. కొండా సురేఖ, చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇవ్వడంతో తెరవెనుక రాజకీయాలు మెదలయ్యాయి. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి రంగంలోకి దిగారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో బుధవారం ప్రజాభవన్‌లో భేటీ అయ్యారు. గురువారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో భేటీకి యత్నించారు.
ఆయన అందుబాటులో లేకపోవడంతో తర్వాత మాట్లాడుదాని కొండా మురళికి మహేశ్‌కుమార్‌గౌడ్ సూచించారు. మంత్రి కొండా సురేఖ విషయంలో పార్టీ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని భట్టి విక్రమార్కను కొండా మురళి కోరినట్టు తెలిసింది. ఈ విషయంలో భట్టి కూడా నిర్ణయం అధిష్ఠానం చేతిలోకి వెళ్లిందని, ఈ విషయంలో తామేమీ చేయలేమని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు వార్తలు వినిపించాయి.
అయితే అదే రోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భట్టి విక్రమార్క బెంగళూరులో భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఖర్గేతో భట్టి మాట్లాడారనే చర్చ నడుస్తున్నది. అంతకు మూడు రోజుల ముందే కొండా సురేఖ బెంగళూర్‌కు వెళ్లి ఖర్గేతో భేటీ అయి.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించిన విషయం తెలిసిందే.
బీసీల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదంపై దృష్టి
కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై పార్టీ చర్యలు తీసుకుంటే భవిష్యత్‌లో జరిగే ప్రమాదంపై కూడా నేతలు చర్చిస్తున్నారు. వీరిపై అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందనేదానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.






