20 March, 2026 | 8:07 AM

ఆశల పద్దు పొడుస్తుందా!

20-03-2026 12:15 AM

దిడ్డి శ్రీకాంత్ :

తెలంగాణ సమాజం ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్‌లో లక్షల కోట్ల అంకెలను చూసి మురిసిపోయే స్థితిలో లేదు. గత అనుభవాలు, కాగితం మీద కనిపించే మిగులు క్షేత్రస్థాయిలో లోటుగా మారుతు న్న వైనాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ పథకాలకు నిధులు లేవని చెబుతూనే, మరోవైపు రికార్డు స్థాయిలో అప్పులు చేస్తూ, అందాల పోటీలవంటి అనవసర కార్యక్రమాలకు వాటిని వెచ్చిస్తూ, రాష్ట్రాన్ని ఆర్థిక అగాధంలోకి నెట్టడాన్నీ గుర్తిస్తున్నారు.

వాస్తవిక దృక్పథంతో ఆచరణ సాధ్యమయ్యే బడ్జెట్‌నే ప్రజలు కోరుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తెరగాలి. అలాగే, సంపద సృ ష్టిపైనా దృష్టి కేంద్రీకరించాలని కూడా ప్ర జలు కోరుకుంటున్నారు. ఈనెల 16న గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ప్రసంగంతో ప్రా రంభమైన బడ్జెట్ సమావేశాలు ప్రస్తుతం ఆసక్తికరంగా సాగుతున్నాయి. 20న (శుక్రవారం) ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు.

ఈ పద్దుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బడ్జెట్ పరిమాణం ఈసారి రూ.3.15 లక్ష ల కోట్ల నుంచి రూ.3.22 లక్షల కోట్ల వర కు ఉండవచ్చని ఒక అంచనా. అయితే, అంకెలు ఎన్ని లక్షల కోట్లు దాటినా సామాన్యుడికి అందే ఫలితం ఎంత? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.  ఒకవైపు ఆరు గ్యారెంటీల అమలుకు కావాల్సిన భారీ నిధులు, మరోవైపు అంతకంతకూ పె రుగుతున్న అప్పుల భారం మధ్య సర్కారు కత్తిమీద సాము చేస్తున్నది.

అధికార పక్షం సభను నిర్వహించి ప్రజాపాలన అని చెప్పుకోవాలని చూస్తుండగా, క్షేత్రస్థాయిలో వా స్తవాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన అస్త్రాలుగా వాడుకున్న ఆరు గ్యా రెంటీలు నేడు అమలుకు నోచుకోకపోవడంపై సామాన్యుడిలో అసంతృప్తి కనిపిస్తు న్నది. అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోతున్నట్లు కూడా స్పష్టమవుతున్నది. 

కాగ్ నివేదికలో ఎన్నో వాస్తవాలు

కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదిక ప్రకారం రాష్ట్రం ఊ హించని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నది. ఆదాయం ఆశించిన స్థాయిలో రావడం లేదు. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.29 లక్షల కోట్ల రెవె న్యూ రాబడిని అంచనా వేయగా, జనవరి 2026 నాటికి కేవలం 60.23 శాతం అం టే.. రూ.1,38,371 కోట్లు మాత్రమే వసూలైంది. రెవెన్యూ వ్యయం రూ.1,48,937 కోట్లకు చేరింది. అంటే సంక్షేమం, పాలన కోసం వచ్చే ఆదాయం కంటే ఖర్చే ఎక్కువగా ఉంది.

ఫలితంగా రాష్ట్రం రూ. 10,566 కోట్ల భారీ రెవెన్యూ లోటును నమోదు చేసింది. 2026 జనవరి నాటికే రాష్ట్రం తన వార్షిక అప్పుల పరిమితిని దాటేసింది. అం చనా వేసిన దానికంటే 128 శాతం.. అంటే రూ.69,187 కోట్లు అదనంగా అప్పులు చేయడం ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ లోపానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంపై ఉన్న మొత్తం అప్పు రూ. 5.04 లక్షల కోట్లు దాటిపోయింది. ఈ అప్పులకు చెల్లించాల్సిన వడ్డీలే ఏడాదికి వేల కోట్లకు చేరుతుండటంతో కొత్త బడ్జెట్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. 

అంచనాలు తారుమారు

జనవరికాగ్ నివేదిక ప్రకారం.. రాష్ట్రం లో వార్షిక రాబడి రూ.2,84,837 కోట్లు అని అంచనా వేయగా వాస్తవానికి రూ. 2,07,558 కోట్లు మాత్రమే సమకూరింది. ఇది కేవలం 72.87 శాతానికి సమానం. అప్పుల విషయానికి వస్తే రూ.54,009 కోట్ల రుణం తీసుకోవాలని సర్కార్ లక్ష్యా న్ని నిర్దేశించుకుని, ఏకంగా రూ. 69,148 కోట్లు అప్పులు తెచిచింది. ఇది అంచనా కంటే 128.03 శాతం ఎక్కువ. వడ్డీ చెల్లింపుల కోసం రూ.19,369 కోట్లు కేటాయిం చగా, వాస్తవానికి రూ.24,085 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది.

అంటే.. అంచనాలో 124.35 శాతం అధికం. అలాగే, భూముల విక్రయం ద్వారా రూ. 11.2 కోట్లు వస్తాయని భావిస్తే కేవలం రూ.0.51 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఇందులో కేవలం 4.58 శాతం పురోగతి మాత్రమే ఉంది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు రూ. 22,782 కోట్లుగా అంచనా వేయగా, కేవలం రూ. 4,213 కోట్లు మాత్రమే అందాయి. ఇది 18.49 శాతానికే పరిమితమైంది. 

నిరాశాజనకంగా రాబడి

గడిచిన ఆర్థిక బడ్జెట్‌లో కేటాయించిన నిధులు, సంక్షేమ శాఖలకు కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు, పాత అప్పుల వడ్డీల చెల్లింపులకే మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. పన్ను ల ద్వారా రావాల్సిన ఆదాయాన్ని ఎక్కువగా అంచనా వేస్తోందే.. కానీ, వాస్తవంగా రాబడి రావడం లేదు. 2025 రూ. 1.75 లక్షల కోట్ల పన్ను ఆదాయాన్ని అం చనా వేయగా డిసెంబర్ నాటికి అందులో కేవలం 67 శాతం మాత్రమే వసూలైంది. రియల్ ఎస్టేట్ మందగమనం, మద్యం అమ్మకాల్లో ఆదాయం ఆశించినంత రాకపోవడం వంటి కారణాలతో ఖజానాకు గండి పడుతున్నది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రాష్ట్రం పూర్తిగా అప్పులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఎన్నో ఆర్థిక సవాళ్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా దాదాపు రూ.15,000 కోట్ల భారీ వ్యయం తో ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో ఫేజ్- స్వాధీనం చేసుకోవడం, మూసీ నది పునరుద్ధరణ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటా యించాల్సి రావడం ప్రభుత్వానికి పెను భారంగా మారింది. దీనికి తోడు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన వేల కోట్ల పెండింగ్ బిల్లులు కొత్త ప్రాజెక్టుల పురోగతికి అడ్డంకిగా మారాయి.

ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు, వేతనాలు, పెన్షన్ల భారం రాష్ట్ర బడ్జెట్‌లో సగం నిధులను హరిస్తూ ఖజానాను ఒత్తిడికి గురిచేస్తున్న ది. హామీలు నెరవేరాలంటే కేవలం బడ్జెట్ కేటాయింపులు సరిపోవు. బడ్జెట్ నిధులను సకా లంలో విడుదల చేసే ఆర్థిక క్రమశిక్షణ అవసరం. అప్పుల భారాన్ని తగ్గించుకుంటూనే, సర్కార్ రాబడి మార్గాలను అన్వేషించాలి.

    వ్యాసకర్త సెల్: 86868 65759

* తెలంగాణకు రావాల్సిన పన్నుల వాటాలో కేంద్రం కోత విధిస్తున్నది. జీఎస్టీ ద్వారా వచ్చే నిధులు సకాలంలో అందకపోవడంతోనే రెవెన్యూ లోటు ఏర్పడింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ‘మహాలక్ష్మి’, గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగిస్తాం. ఆరు గ్యారెంటీలను కూడా క్రమ పద్ధతిలో అమలు చేస్తాం

- కాంగ్రెస్

* రెండున్నరేళ్లు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించలేదు. ఇది ప్రజలకు ఆ పార్టీ చేసిన పచ్చి మోసం. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎండగడతాం. గతంలో మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని, ఈ ప్రభుత్వం రెండేళ్లలోనే లోటు బడ్జెట్‌లోకి నెట్టేసింది. ఇది చేతగాని ప్రభుత్వం. సంపద సృష్టించలేని సర్కార్

- బీఆర్‌ఎస్ 

* అప్పుల మీద అప్పులు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నది. కేంద్ర నిధులను తన అవసరాలకు మళ్లించి తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నది. రాష్ట్ర ఆదాయం పడిపోతుంటే, లేనిపోని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నది. కాంగ్రెస్ పాలనలో పూర్తిగా వైఫల్యమే కనిపిస్తున్నది.

 బీజేపీ