పొదుపు మంత్రం గట్టెక్కిస్తుందా!
డా. తిరునహరి శేషు:
ఫిబ్రవరి 28న అమెరికా దేశాలు ఇరాన్‌పై సంయుక్తంగా దాడి చేయటం, ఆ దాడిని ఎదుర్కోటానికి ఇరాన్ ప్రతీకార చర్యలు చేపట్టటంతో పర్షియన్ గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పుడు నాలుగు లేదా ఐదు వారాల్లో దీనికి ముగింపు పలుకుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినా, ఇరాన్ వ్యూహాత్మకంగా తనని తాను రక్షించుకోవటానికి హోర్ముజ్ జలసంధిని మూసివేసి, గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలపై దాడిచేయటం ద్వారా యుద్ధాన్ని ప్రపంచ సమ స్యగా మార్చివేసింది.
ఈ క్రమంలో ఇరాన్ చర్యలు, యుద్ధ పరిస్థితులు చమురు సంక్షోభానికి దారితీసి ప్రపంచంపై, ముఖ్యంగా దక్షిణాసియాపై ప్రతికూల ప్రభావం పడింది. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధిరేటు సాధిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ యుద్ధం ప్రతికూల ప్రభావం చూపుతున్నది. ముడిచమురు, ఎల్‌ఎన్‌జీలను పర్షియన్ గల్ఫ్ నుంచి దిగుమతి చేసుకుంటున్న భారత్‌లో యుద్ధ పరిణామాల వల్ల గ్యాస్, ఆయి ల్ కొరత ఏర్పడటం, ఆయిల్ కంపెనీలకు నష్టాలు రావడం, అంతర్జాతీయ పరిణామాల మూలంగా రూపాయి మారకం విలు వ వేగంగా పతనం కావడం, దేశీయంగా బంగారం కొనుగోలు పెరగటం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.
ఈ నేపథ్యంలో భవిష్యత్తులో సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని గ్రహించి, ఈ సమస్యను అధిగమించటానికి స్వయం గా ప్రధాని రంగంలోకి దిగాల్సి వచ్చింది. మే 10న తెలంగాణలో నిర్వహించిన బహిరంగ సభలో విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడుకోవడానికి, రాబోయే ఆర్థిక విపత్కర పరిస్థితులను ఎదుర్కోవటానికి ప్రజల సహకారాన్ని ప్రధాని కోరారు. ఇందుకోసం ప్రజలు పొదుపు మంత్రాన్ని పాటించాలని విజ్ఞప్తి చేయటంతో ప్రధాని సూచనలపై దేశవ్యాప్తంగా వివిధ వర్గాలలో విస్తృతమైన చర్చ జరుగుతున్నది.
ఆర్థిక పరిస్థితిను చక్కదిద్దేనా?
యుద్ధం ప్రారంభమైన తర్వాత సప్లయ్ చైన్ దెబ్బతినడంతో ఇంధన కొరత ఏర్పడటమే కాదు, ముడిచమురు బ్యారెల్ ధర 72 డాలర్ల నుంచి 106 డాలర్లకు ఎగబాకింది. దీంతో భారత్ దిగుమతులపై చెల్లింపులు పె రగటం, డాలర్‌తో రూపాయి మారకం విలు వ పడిపోవడం, బంగారం దిగుమతులపై పెద్ద ఎత్తున చెల్లింపులు చేయటం వలన 2025-26 ఆర్థిక సంవత్సరానికి దిగుమతుల బిల్లు 775 బిలియన్ డాలర్లకు చేరు కుంది.
అలాగే ఫారెక్స్ నిలువలు 728 బిలియన్ డాలర్ల నుంచి 691 బిలియన్ డాలర్లకి పడిపోయాయి. దిగుమతి బిల్లు పెరిగి విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గిపోతుంటే భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభా వం పడుతుంది. కాబట్టి పొదుపు మంత్రం పాటిస్తూ దిగుమతులను తగ్గించుకోగలిగితే విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది.
భారత్ దిగుమతి బిల్లు ప్రధానంగా ముడిచమురు, బంగారం దిగుమతులపైనే ఎక్కువగా ఖర్చు చేస్తున్నది. భారత్ సుమారుగా 88 శాతం ఇంధనాన్ని దిగుమతి చేసు కుంటుంది. అలాగే బంగారం వినియోగం లో చైనా తర్వాత ప్రపంచంలో భారత్ రెండ వ అతిపెద్ద దేశం. 2025-26లో భారత్ 721 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. మొత్తం 775 బిలియన్ డాలర్ల ఇం పోర్ట్ బిల్లులో 134.7 బిలియన్ డాలర్లు ఇం ధన దిగుమతుల కోసం, 72 బిలియన్ డాల ర్లు బంగారం దిగుమతుల కోసం చెల్లించారు.
అంటే భారత దిగుమతుల్లో క్రూడా యిల్, బంగారం దిగుమతులు సింహభాగా న్ని ఆక్రమిస్తున్నాయి. కాబట్టి విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడుకోవడానికి (ప్రస్తు తం 11 నెలల దిగుమతుల అవసరాలకు సరిపోను ఫారెక్స్ నిల్వలే ఉన్నాయి) 10 శాతం ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించుకోవాలని, దానికోసం ప్రజా రవాణాని, ఎల క్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని, వర్క్ ఫ్రం హోం నిర్వహించాలని ప్రధాని సూచించారు.
అంతేకాదు, ఏడాది పాటు బంగారం కొనుగోలు నిలిపివేయాలని, వీటితోపాటు ఎరువులు, రసాయనాల వాడకం తగ్గించి సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇ వ్వాలని, వంటనూనెల వినియోగాన్ని తగ్గించడం ద్వారా దేశానికి, దేహానికి ఉపయోగ మని, డెస్టినేషన్ వివాహాలు, విదేశీ ప్రయాణాలు తగ్గించాలని విదేశీ ఉత్పత్తుల స్థానే దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు.
మోదీ సూచనలు పాటించడం ద్వారా ఇంపోర్ట్ బిల్లు ఘననీయంగా తగ్గటమే కాకుండా విదే శీ మారకద్రవ్య నిల్వలను రక్షించుకోగలుగు తాం. యుద్ధం ప్రారంభమైన తర్వాత దేశీ య మద్దతుదారులతో భారత్ తన వృద్ధిరేటును కాపాడుకోగలుగుతున్నా రూపాయి విలువ పతనం, కోల్పోతున్న విదేశీ మారకద్రవ్య నిల్వలతో భారత్ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు పడిపోయింది.
ప్రత్యామ్నాయాలు పరిష్కారాలు
రాబోయే సంక్షోభం నుంచి గట్టెక్కడానికి భారత్ పొదుపు మంత్రాన్ని పాటించాల్సిం దే. ఇప్పటికే ప్రపంచంలో 40కి పైగా దేశా లు భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి చర్యలు ప్రారంభించాయి. అందరికంటే ముందుగా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఫిలిప్పీన్స్ ఇంధన ఎమర్జెన్సీని ప్రకటించింది. అదే దారిలో పాకిస్థాన్ నాలు గు రోజుల పని దినాలు, ఇండోనేషియాలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం, దక్షిణ కొరియాలో వాహనాల రవాణాకు సరి,- బేసి సంఖ్యల విధానం లాంటి చర్యలు ప్రారంభించాయి.
యుద్ధం ద్వారా ఎదురయ్యే సవాళ్లను అధిగమించటానికి ఇరాన్, రష్యాల నుంచి అందివచ్చిన అవకాశాలను సరిగా వినియోగించుకోకపోవడం, సకాలంలో చర్యలు చేపట్టకపోవడంతో భారత్ లో కూడా పరిస్థితి చేయిదాటిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరని రూ.1332, గృహ వినియోగ సిలిండర్ ధర రూ.60 పెంచారు. ఆయిల్ కంపెనీలు రోజుకి రూ.1600-1700 కోట్లు నష్టపోతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను కూడా లీటర్‌కి రూ.3కి పైగా పెంచారు.
గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ధరలు పెంచేస్తున్నారు. ఎరువులు, సిమెంట్, ఇనుము లాంటి వస్తువులు ధరలు కూడా పెరగబోతున్నాయనే చర్చ జరుగుతున్నది. కాబట్టి, ప్రభుత్వం ప్రస్తుత ద్రవ్యోల్బణ సమస్యను అదుపులో పెడుతూనే భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోకుండా చర్యలు చేపట్టాలి.
ప్రభుత్వ వైఖరి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది. సమస్య వచ్చిన తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టడం కంటే సమస్యను అంచనా వేసి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ఇంధన వినియోగాన్ని తగ్గించే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి, చైనా లాగా చమురు నిల్వ సామర్థ్యాన్ని పెం చుకోవడం, దేశీయంగా ఉత్పత్తిని పెంచడం, ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ చేపట్టాలి. దీనిలో భాగంగానే రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించాలనే నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకుంది.
బంగారం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక భారతీయ సంస్కృతి సురక్షితమైన పెట్టుబడి. కాబట్టి బంగారం వినియోగాన్ని కూడా తగ్గించలేం. అందుకే దిగుమతులను, వినియోగాన్ని నిరుత్సాహపరచడానికి దిగుమతి సుంకాలను పెంచుతున్నారు. అకస్మాత్తుగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపునకు మళ్లీతే శ్రీలంకలో ఏర్పడిన పరిస్థితులు పునరావృతమయ్యే ప్రమాదం లేకపోలేదు. నాయకు లు వాహన శ్రేణి తగ్గించుకున్నంత మాత్రాన సమస్యకు పరిష్కారం దొరకదు. వారి సౌకర్యాలపై చేస్తున్న ఖర్చు, అవినీతి తగ్గాలి.
లేకపోతే నేపాల్ పరిణామాలు ఇక్కడ కూడా ఎదురుకావచ్చు. రహదారులు, ఎయిర్‌పోర్టులు, రైల్వేల ఆధునికీకరణతో పాటు ప్రజలకి సౌకర్యాలు చౌకగా అందజేయడంపై కూడా ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రధాని చెబుతున్న పొదుపు మంత్రం, చేస్తున్న సూచన లు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం లాంటివన్నీ చూస్తుంటే ప్రజలను దొంగదెబ్బ తీశారనే భావన వ్యక్తమవుతున్నది.
పొదుపు మంత్రం పాటించాలని ప్రధాని సూచించిన రెండు రోజుల్లో స్టాక్ మార్కెట్ల పతనంతో 16 లక్షల కోట్ల రూపాయలు ఆవిరవడం చూస్తుంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కానీ, సంక్షోభాలను తట్టుకొని నిలబడటం, వాటిని అధిగమించటం భారత ఆర్థిక వ్యవస్థకు కొత్తేమీ కాదు. సంక్షోభాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ మన దేశం వికసిత్ భారత్ లక్ష్యం వైపునకు పురోగమించాలని ఆశిద్దాం.
వ్యాసకర్త సెల్: 9885465877






