7 May, 2026 | 1:30 AM

తెలంగాణ ప్రజలు ‘తల్లి’గా స్వీకరిస్తారా?

07-05-2026 12:00 AM

స్వయంప్రకటిత తెలంగాణ బతుకమ్మ అందరూ ఊహించిన్నట్టుగానే టీఆర్‌ఎస్ పేరుతో మేడ్చల్ జిల్లా, మునిరాబాద్ వేదికగా నూతన రాజకీయ పార్టీని ప్రకటిం చారు. తండ్రిని మించిన తనయ కదా! సెం టిమెంట్ రగిలించే విషయంలో తక్కువేమీ కాదు. అందుకే పార్టీ ఆవిర్భావానికి ముందు ఇంట్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించి, గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి సభకు హాజరయ్యారు. తొలిరో జు జెండా, పార్టీ ఎజెండా ప్రకటించి, కేసీఆర్‌పై బాణాలు సంధిస్తూ తెలంగాణ రాష్ట్ర సేనను (టీఆర్‌ఎస్) ఏర్పాటు చేయాల్సిన అనివార్యత గురించి చెప్పారు. నాడు తండ్రి స్థాపించిన టీఆర్‌ఎస్ పేరుతో మరోసారి రాష్ట్రంలో సెంటిమెంట్ రగిలించాలనే వ్యూ హంతో ఆమె ముందుకుసాగుతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే, ఈ సందర్భంగా పదేళ్లు కేసీఆర్ ప్రభుత్వ అక్రమాల్లో, అవినీతిలో పాలుపంచుకొని నేడు ఉద్యమకారులకు ఏదో అన్యా యం జరిగిందని టీఆర్‌ఎస్ పేరుతో కొత్త నాటకానికి తెరతీశారనే ఆరోపణలు వస్తున్నాయి. నాడు 2014లో తెలంగాణ హోరు లో పార్లమెంట్ సభ్యురాలిగా గెలిచిన కవిత, రెండో ధపా కేసీఆర్ హవా నడుస్తున్న 2019లో ఓడిపోవడం మాత్రం ఆమె స్వయంకృతాపరాధమేనని చెప్పాలి. తన గారాల తనయ ఖాళీగా ఉండటం ఇష్టం లేక, ఉద్యమకారులను పక్కనపెట్టి, తెలంగాణ జాగృతి పవర్ సెంటర్‌గా ఉన్నప్పటికీ కేసీఆ ర్ ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించా రు.

కాగా, కేసీఆర్ పాలన సాగుతున్న రోజు ల్లో నోరుమెదపని కవిత ఇప్పుడు ఉద్యమకారుల ఆత్మగౌరవం గురించి వల్లెవేస్తుం డటం ఆశ్చర్యకరం. అందుకే అధికార యావ తప్ప, ఏనాడూ ప్రజాసేవ చేయాలనే ప్రయ త్నం చేయలేదని విమర్శలు వినవస్తున్నా యి. ఈ నేపథ్యంలోనే కుటుంబ పాలన కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను విస్తరించాలనే బీఆర్‌ఎస్ నిర్ణయాన్ని తప్పుబట్టిన కవిత.. 2022 డిసెంబర్‌లో తెలంగాణ జాగృతి సంస్థను భారత జాగృతి సంస్థగా ఎందుకు నామకర ణం చేశారో ప్రజలకు తెలియజేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

మోదీకి వ్యతిరేకంగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన కేసీఆర్‌కు కవిత పై వచ్చిన మద్యం కుంభకోణం ఆరోపణలు రాజకీయాల్లో ఊపిరాడకుండా చేశాయి. ఈ క్రమంలోనే మోదీ జేబు సంస్థలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈడీ, సీబీఐల దర్యా ప్తు కారణంగా ఈ కుంభకోణంలో కవిత పీకలదాకా ఇరుకున్నారు. 2024 మార్చి 26న కేంద్ర దర్యాప్తు సంస్థలు కస్టడీలోకి తీసుకున్నాయి. ఈ క్రమంలోనే ఆమె దాదాపు 166 రోజులు తీహార్ జైలులో ఊచలు లెక్కబెట్టా ల్సి వచ్చింది.

దీంతో కవితతోపాటు బీఆర్‌ఎస్ కూడా అపఖ్యాతిపాలైంది. అదే సమ యంలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పరాజయం పాలైంది. అయితే, బీఆర్‌ఎస్ ఓటమికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. ఆ ఓటమికి కవిత మాత్రమే కార ణం కాదు. కాళేశ్వరం, ఈ రేస్ కుంభకోణాలు, ఫోన్ ట్యాపింగ్ లాంటి వాటిని నమ్మిన ప్రజలు ఆ పార్టీకి కర్రుకాల్చి వాతపెట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కవిత బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఈ కేసులో నిర్మాణాత్మక సాక్షాధారాలు లేకపోవడంతో సీబీఐ అతి ఉత్సాహా న్ని రౌస్ అవెన్యూ కోర్టు తప్పుబట్టింది. కవితతో పాటు కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాతో సహా 23 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.

దీంతో కవితకు కొంత ఊరట లభించినట్టయింది. కానీ, జరగాల్సిన నష్టం జరిగిపో యింది. అటు కేజ్రీవాల్, ఇటు కేసీఆర్ ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. తన కుమార్తె ను ఈ కేసు నుంచి బయటపడేయటానికి బీజేపీకి కేసీఆర్ సరెండర్ కావడం వల్లనే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సున్నాకు పరిమితమైందనే ప్రచారం ఉంది. అనంతరం తనను దూరం పెట్టడాన్ని జీర్ణించుకోలేక కవి త రాసిన ఉత్తరం గులాబీ పార్టీలో దుమారాన్ని రేపింది. ఈ క్రమంలోనే ఆమె బీఆర్ ఎస్‌కు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, జైలుకు వెళ్లిన వారందరు ముఖ్యమంత్రులు అవుతారనే ప్రచారాన్ని విశ్వసించి కాబోలు టీఆర్‌ఎస్ పేరిట కొత్త కుంపటి పెట్టుకున్నారు. 

అయితే, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రజా సంఘాలు, సామాజిక తెలంగాణ ప్రధాన ఎజెండాగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఎన్నో పార్టీలు మట్టిలో కలిసిపోయాయి. తెలంగాణ ప్రజా సమితి, జై తెలంగాణ, నవ తెలంగాణ, తెలంగాణ ప్రజారాజ్యం, తల్లి తెలంగాణ, తెలంగా ణ సాధన సమితి, తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ నగారా సమితి, తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ రక్షణ సమితి, వైఎస్సార్ తెలంగా ణ లాంటి ఎన్నో పార్టీలు నిలబడలేదు, ఎల్లకాలం తలపడలేదు. 2018లో తెలంగాణ ఉద్యమనేత కోదండరాం పెట్టిన తెలంగాణ జనసమితి ప్రజల్లో చొచ్చుకపోయినా ధన బలం ముందు నిలవలేకపోయింది.

మరి ఇలాంటి పరిస్థితుల్లో ఐదు నెలలు జైలు జీవితాన్ని గడిపి, నేడు ఆత్మగౌరవం, అస్తిత్వం అంటూ కవిత పెట్టిన కొత్త పార్టీ కాలపరీక్షకు నిలుస్తుందా? అన్నది చూడాలి. అయితే, ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఎవరున్నారనే ప్రశ్న అందరిలో మెదులుతున్న ది. కేసీఆర్ హయాంలో క్యాబినెట్‌లో మహి ళా మంత్రిగా లేకపొతే కవిత నోరు తెరవలేదు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గిస్తే పెదవి విప్పలేదు. కానీ, ఇప్పుడు మహిళలు, ఓబీసీల రిజర్వేషన్ల కోసం, సామాజిక న్యాయం కోసం పోరాడతానని, తల్లి పాత్ర పోషిస్తానని ఆమె చెప్తున్నారు.

అయితే, దశాబ్దం పాటు మాట్లాడని కవిత నేడు బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడితే ఎలా నమ్మాలి? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్నా ఆ పార్టీ నేతలు కనీసం స్పందించకపోవడంతో బీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్ ఒక్కటేననే వాదన కూడా వినిపిస్తున్నది. అదే విధంగా బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటైనందుకే కవితకు ఉపశమనం దొరికిందనే అభిప్రాయం లేకపోలేదు.

కల్వకుంట్ల కవిత మంచి వక్త. భావవ్యక్తీకరణలో తండ్రిని మించిన తనయ. అందులో ఎలాంటి శషభిషలు లేవు. ఆమె టీఆర్‌ఎస్ ను స్థాపించడంతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కింది. ‘పాంచజన్యం’ శంఖం పూరించిన కవిత ఉచిత విద్య, వైద్యంతోపాటు సామాజిక తెలంగాణ పేరుతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా రు. అయితే, తండ్రి కేసీఆర్ పాలనా వైఫల్యా లు, హామీల ఎగవేతలు ఇప్పుడు ఆమె పాలిటశాపంగా మారాయి. 

అంతేకాదు, తమ స్వార్థం కోసం పెట్టే పార్టీలు ఎక్కువకాలం నిలవవని, ప్రజల్లో నుంచి, ప్రజా సమస్యల నుంచి పుట్టిన పార్టీలే బలంగా నిలబడతాయని స్వయంగా కేసీఆర్ చెప్పడం ఆమెకు ఇబ్బందికరంగా మారింది. అయితే, తెలంగాణ ఏర్పాటులో ‘చిన్నమ్మ’గా పేరొందిన సుష్మా స్వరాజ్, తమిళనాట ‘పురచ్చి తలైవి’ జయలలితలాగా తెలంగాణ ‘అమ్మ’గా మారాలనుకుం టున్న కవిత భవిత ఏమిటనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.

 వ్యాసకర్త: కేయూ జర్నలిజం శాఖ విభాగాధిపతి, 9866255355