7 May, 2026 | 1:29 AM

ఉచితాలతో ప్రజల జీవన స్థితిగతులు మారుతాయా?

07-05-2026 12:00 AM

రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలు, తాయిలాలకు ఆశపడి నేడు చాలామంది ఓట్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఉచితాల పేరిట ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలతో ప్రజల జీవన, ఆర్థిక స్థితిగతులు ఏ మేరకు మెరుగుపడుతున్నాయనేది నేడు ప్రధానంగా చర్చించాల్సిన అంశమని చెప్పవచ్చు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం అధికార పార్టీలు మల్లగుల్లాలు పడుతున్న వైనాన్ని ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం.

అమలులో ఆర్థిక పరిస్థితీని చూశాక తమ తప్పిదం ఏమి లేదని, గత ప్రభుత్వాల ఆర్థిక విధానాలు, లోటు బడ్జెట్ కారణంగానే నేడు తమకు ఇబ్బందిగా మారిందని పాలకులు పదే పదే చెబుతున్నారు. ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను ప్రజలకు ఎరగా చూపి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తున్నాయి. అధికారమే లక్ష్యంగా పోటీపడి మరీ ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి. ఆ తర్వాత వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తున్నాయి.

ఈ క్రమంలో ఓటువేసి గెలిపించిన ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వాస్తవానికి  ప్రజల మౌలిక అవసరాలు, ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయాలి. ఆ దిశగా పథకాల రూపకల్పన చేస్తామని హామీలు ఇస్తే బాగుంటుంది. అంతేకానీ, కేవలం అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పథకాలను ఎరవేయడం ఎంత మాత్రం సరైనది కాదు. ఇలాంటి విధానాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటివి. ఆర్థికపరంగా చూసినా దేశానికి, రాష్ట్రానికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు.

ప్రజలు సైతం తాత్కాలిక ఉపశమనాలకు ఆశపడి తమ చేతిలో ఉన్న విలువైన ఆయుధాన్ని అంగట్లో సరుకుగా మార్చుకోవడం సరికాదు. ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా పాలన సాగించి నూతన ఒరవడిని సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా సగటు మానవుడు అధికంగా ఖర్చు చేస్తుంది కేవలం ఆరోగ్యం, విద్య అవసరాలపైనే. ప్రస్తుత రోజుల్లో ఆర్థిక స్థోమత లేకపోవడంతో వేలాది మంది అనారోగ్యం బారినపడి మృతిచెందుతుండటం బాధాకరం.

ఈ క్రమంలోనే అనేక కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్నాయి. తద్వారా మరింత పేదరికంలోకి జారుకుంటున్నాయి. అదే సమయంలో విద్య కోసం పేద, మధ్యతరగతి వారు చేస్తున్న ఖర్చు అంతాఇంతా కాదు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో పూర్తిస్థాయిలో నాణ్యమైన విద్య అందకపోవడం, ప్రైవేటు విద్యను కొనలేక, ఉన్నత చదువులు చదవలేక చాలామంది నిరుద్యోగులుగా మారి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

అయితే, ఇలా కనీస అవసరాలైన విద్య, వైద్యరంగాలను మెరుగుపరించేందుకు ప్రభుత్వాలు ఎక్కువగా దృష్టిపెట్టకుండా, దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే పథకాలను అమలు చేయకుండా ప్రభుత్వాలు ఓటు రాజకీయాలు చేయడం సరికాదు. తాత్కాలికంగా ఉపశమనం కలిగించే ఉచిత పథకాలను అమలు చేస్తూ ఒక రకంగా ప్రజలను పాలకులు సోమరిపోతులుగా చేస్తున్నారనే విమర్శ సైతం లేకపోలేదు.

ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజల ఆర్థిక, జీవన స్థితిగతులు మెరుగుపడే విధంగా పథకాలను రూపొందిస్తూ, ప్రధానంగా కార్పొరేటు స్థాయి వైద్యం, విద్యను ఉచితంగా అందించి నూతన సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 టి.సురేందర్, 9440715635