28 February, 2026 | 7:11 PM

బీఆర్‌ఎస్ ఓటమిని నా మెడలో వేస్తారా?

28-02-2026 12:49 AM
  1. గులాబీ పార్టీ ఓటమికి అహంకారమే కారణం
  2. కడిగిన ముత్యంలా బయటకు వచ్చా

అయినా నాకు జరిగిన అవమానం తీరదు

ఇప్పటికైనా కేటీఆర్ వాస్తవాలు అంగీకరించి నిజాలు మాట్లాడాలి

కేసు సమయంలో పార్టీ, పార్టీ సోషల్ మీడియా నాకు సపోర్ట్‌గా లేదు

బీజేపీ చేసిన తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొవటంలో విఫలం

పార్టీ పెట్టే ముందు ఈ తీర్పు రావడం ప్రకృతి ఆశీర్వాదం ఇచ్చినట్టే

జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి) : లిక్కర్ స్కాం కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని మొదటి నుంచి చెబుతున్నానని, ప్రస్తుతం కోర్టు తీర్పుతో అది స్పష్టమైందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అసలు వాదనలన్నీ ఫాల్స్ అని కోర్టు స్పష్టం చేసిందన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ తప్పుడు కేసును కొట్టి వేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుకు భారత న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు తెలిపారు.

రైతుల సమస్యలపై రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి , సభ్యులను కలిసి వినతిపత్రం అందజేసిన అనంతరం బీఆర్‌కేఆర్ భవన్ వద్ద కవిత మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుపై స్పందించారు. కేసులో ఉన్న వారందరికీ క్లీన్ చిట్ ఇవ్వటాన్ని స్వాగతించారు. కానీ ఐదున్నర నెలలు పిల్లలకు, కుటుంబానికి దూరంగా ఉండి ఎంతో బాధ, అవమానాలు, వ్యక్తిత్వ హననాన్ని ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కోట్లు ఇచ్చిన సరే ఆ అవమానం తీరేది కాదు, ఆ సమయం మళ్లీ తిరిగి రాదని పేర్కొన్నారు.

ఈ కేసు విషయంలో మా కుటుంబానికి అన్యాయం జరి గిందని, కేసు ప్రతి హియరింగ్‌కు ఇక్కడున్న కార్యకర్తలే వచ్చి నాకు నైతిక స్థైర్యం ఇచ్చారని తెలిపారు. మా అమ్మనాన్నలకు, అత్త మామాలకు, నా భర్తతో పాటు వారి కుటుం బ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజాసేవ చేసేందుకు ఈ కేసులు ఏ మాత్రం నాకు అడ్డంకావని స్పష్టం చేశారు.

కోర్టు తీర్పు తర్వాత కేటీఆర్ స్పందిస్తూ ఒకవైపు కంగ్రాట్స్ చెబుతూనే మరో వైపు పార్టీ ఓటమిని ఈ కేసే కారణమనేలా ట్వీట్ చేశారని చెప్పారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా లో రకరకాల కామెంట్స్ చేస్తూ పార్టీ ఓటమికి ఈ కేసే కారణమనే ట్విస్ట్ ఇచ్చే ప్రయ త్నం చేస్తున్నారని ఆరోపించారు. అసలు ఈ కేసు నా మీద పెట్టింది బీఆర్‌ఎస్ పై కక్ష సాధింపు కోసం కాదా? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. నేను జైలుకు వెళ్లాక కేసీఆర్, కేటీఆర్ సహా పెద్ద నాయకులెవరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని నిలదీశారు. 

అప్పుడే స్పందించి ఉంటేబీ ఆర్‌ఎస్‌కు ఈ గతి పట్టేదా?

అత్యంత పవిత్రంగా తొమ్మిది రోజులు అన్నం తినకుండా బతుకమ్మ ఎత్తుకొని జాతి సంస్కృతిని తెలిపిన బిడ్డను నేను అని, అలాంటిది బతుకమ్మ ప్లేస్‌లో లిక్కర్ బాటిల్ ఎత్తుకున్నట్లు బీజేపీ సోషల్ మీడియా నన్ను అవమానిస్తుంటే బీఆర్‌ఎస్ సోషల్ మీడి యా ఏమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడే అలాంటి తప్పుడు ప్రచారాలను ఎదుర్కొంటే బీఆర్‌ఎస్‌కు ఈ గతి పట్టేదా అని ప్రశ్నించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోవటానికి నేను కారణమా? అనే అంశంపై ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరారు. ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్‌లు, దోపిడీ దార్లకు టికెట్లు ఇవ్వవద్దు అని మొత్తుకున్నా సరే ప్రజల మీదకు రుద్దటం అనే అంశాలను అప్పుడు చర్చలో ఉన్నాయని, అన్నింటికన్నా కూడా అహంకారం కారణంగానే బీఆర్‌ఎస్ ఓడిపోయిందని స్పష్టం చేశారు.

కోర్టు తీర్పును మీకు అనుకూలంగా మలుచుకొని పార్టీ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ వాస్తవాలు గ్రహించి ఇప్పటికైనా తప్పులు ఎక్కడ జరిగాయో సమీక్షించుకోవాలని హితవు పలికారు. నిజాలను అంగీక రించి ప్రజలకు జవాబుదారీగా ఉం డాలని కేటీఆర్‌కు సూచించారు. నేను కేసుల్లో ఉన్నప్పుడు పార్టీ, పార్టీ సోషల్ మీడి యా ఎప్పు డు నాకు సపోర్ట్ చేసిందని,

ఈ కేసు వల్లే ఓడిపోయినట్లు ఇప్పుడు అడ్డమైన రాతలను సోషల్ మీడియాలో రాస్తున్నారని మండిపడ్డారు. నిజంగా ఈ కేసులో వెనకాల ఏం జరిగిందో కేటీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. పార్టీ ఓటమిని నా మెడకు వేయాలని చూస్తే ప్రజలు కూడా హర్షించరని, దయచేసి నిజాలు చెప్పాలని కోరారు. రెండు నెలల్లో పార్టీ పెట్టబోతున్నానని, ప్రకృతి ఆశీర్వదం తోనే ఈ తీర్పు వచ్చిందని భావిస్తున్నానని తెలిపారు. 

నా అరెస్టుకు ముందే అసెంబ్లీ ఎన్నికలు  

కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీలో ఎన్నికలు జరిగాయని, కానీ తెలంగాణలో మాత్రం అసెంబ్లీ ఎన్నికల తర్వాత నేను అరెస్ట్ అయ్యాయని గుర్తుచేశారు. కానీ ఈ కేసు కారణంగా అంటూ నిజాన్ని ట్విస్ట్ చేసే ప్రయత్నం మీ సోషల్ మీడియా ఆర్మీ ద్వారా చేస్తున్నారని, కానీ ఇప్పుడు అలా ఏది పడితే అది మాట్లాడితే చెల్లదని హెచ్చరించారు. నాకు మీ మాదిరిగా ఆర్మీ లేదని, ఇక్కడున్న పిడికెడు మందితోనే నేను ప్రజల పక్షాన పోరాటం చేస్తానని ప్రకటించారు. ఒక ఆడబిడ్డ కష్టంలో ఉన్నప్పుడు అడ్డమైన టైటిల్స్ పెట్టిన అడ్డగాడిదలకు తగిన సమయంలో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.

బీజేపీ వాళ్లు మాట్లాడిందే బీఆర్‌ఎస్ వాళ్లు మాట్లాడుతున్నారంటే వాళ్లిద్దరూ ఒక్కటే అన్నారు. బీఆర్‌ఎస్ ఎందుకు ఓడిపోయిం దో నీతిగా నిజాయితీగా ఆలోచించాలని హితవు పలికారు. ఓటమిని నా మెడలో వేయాలనే తాపత్రయం ఎందుకు? బీఆర్‌ఎస్ అంత వీక్‌గా ఉందా? ఒక వ్యక్తి తప్పు చేస్తే ఓడిపోయే స్థితిలో బీఆర్‌ఎస్ ఉందా? అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నా పేరు ఎక్కడా చర్చల్లోనే లేదని స్పష్టం చేశారు.