ఫీజులు చెల్లిస్తారా.. గద్దె దిగుతారా?
- అసెంబ్లీ ముట్టడికి అఖిలపక్షం పిలుపు
- బకాయిలు వెంటనే చెల్లించాలి
- నిర్లక్ష్య వైఖరి సరికాదని హితవు
పంజాగుట్ట,ఫిబ్రవరి 24(విజయక్రాంతి): రాష్ట్రంలో నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉం టుందని అఖిలపక్ష నేతలు, విద్యార్థి సం ఘా లు హెచ్చరించాయి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కాలేజీ విద్యార్థుల కన్నీటి చదువులు అనే అంశంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం మంగళ వారం నిర్వహించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. రూ.5 వేల కోట్లతో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటున్న ప్రభుత్వం పేద విద్యార్థుల చదువుల కోసం రూ. 7 వేల కోట్ల ఫీజుల బకాయిలను విడుదల చేయకపోవడం సిగ్గుచేటని మండిపడ్డా రు. వారం రోజుల్లోగా నిధులు విడుదల చేయకపోతే మార్చి 16 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీని అల్టిమేటం జారీ చేశారు.
ఈ సమావేశంలో పా ల్గొన్న హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. విద్యపై పెట్టే ఖర్చును ప్రభుత్వం పెట్టుబడిగా కాకుండా మానవ వనరుల అభివృద్ధిగా చూడాలని సూచించారు. బడుగు, బలహీన వర్గాల విద్య పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి సరికాదని హితవు పలికారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఫీజుల సమస్యను కేవలం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సమస్యగా చూడకూడదని, ఇది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు.
పాత బకాయి లు ఇవ్వమని చెబుతున్న ప్రభు త్వం, గత ప్రభుత్వాల కాలం నాటి రాబడిని మాత్రం ఎందుకు వసూలు చేస్తోందని ఆయన నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల శక్తిని తక్కువ అంచనా వేస్తే గద్దె దిగక తప్పదని హెచ్చరించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎల్.రమణ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులంటే ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయిం దని ధ్వజమెత్తారు.
బడ్జెట్లో ఫీజుల కోసం నిధులు కేటాయించకుండా పేద విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు. ఫీజుల విడుదల కోసం విద్యార్థి సంఘాలు చేసే పోరాటానికి బిఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్ద తు ఇస్తుందని వారు ప్రకటించారు. ప్రభు త్వం ఇప్పటికైనా స్పందించి ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం అప్పు ల ఊబిలో కూరుకుపోతున్నా, బడా కాంట్రాక్టర్లకు మాత్రం ఆదాయాన్ని దోచిపెడుతున్నారని వారు ఆరోపించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజు ల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..
ఒకవైపు దేశంలో ఏఐ సదస్సులు జరుగుతుంటే, మరోవైపు తెలంగాణ లో ఫీజులు కట్టలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. చల నం లేని విగ్రహాల కోసం వేల కోట్లు ఖర్చు చేసే కంటే, ఆ నిధులను విద్యార్థుల చదువుల కోసం మళ్లిం చాలని ఆయన డిమాండ్ చేశారు. గత రెండేళ్లలో బడ్జెట్ నిధులు ఎవరికి ఎంత ఖర్చు చేశారు? బడా కాంట్రాక్టర్లకు ఎంత ఇచ్చారు? అనే అంశాలపై ప్రభుత్వం తక్షణ మే శ్వేతపత్రం విడుదల చేయాలని జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు.
పేదల విద్య పట్ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎందుకు కనికరం చూపడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ సమస్యపై రెండు రోజుల్లో ప్రభు త్వ ప్రధాన కార్యదర్శిని, మంత్రులను కలిసి విన్నవిస్తామని, అక్కడ సానుకూల స్పందన రాకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని నేతలు స్పష్టం చేశారు. విద్యార్థులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం మానుకోవాలని, వారి హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్, తాటికొండ విక్రమ్ గౌడ్, జూలూరి గౌరీ శంకర్, ప్రొఫెసర్ మల్లేశ్వర్, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.




