12 July, 2026 | 9:03 PM

కొత్త విద్యుత్ ప్లాంట్లలో పునరుత్పాదక రంగానిదే హవా

04-05-2024 12:10 AM

ముంబై, మే 3: దేశంలో కొత్తగా ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్‌లో అధికభాగం పునరుత్పాదక రంగమే సమకూరుస్తున్నదని సెంటర్ ఫర్ ఎనర్జీ ఫైనాన్స్ (సీఈఎఫ్) తెలిపింది. ప్రస్తుతం దేశంలో విద్యుత్ స్థాపక సామర్థ్యం 442 గిగావాట్లకు చేరగా, అందులో రెన్యువబుల్ ఎనర్జీ సామర్థ్యం 33 శాతం (144 గిగావాట్లు), జలవిద్యుత్ స్థాపక సామర్థ్యం 11 శాతంగా (47 గిగావాట్లు)  ఉన్నదని సీఈఎఫ్ వెల్లడించింది. మొత్తం స్థాపక సామర్థ్యంలో బొగ్గుతో నడిచే ప్లాంట్ల సామర్థ్యం తొలిసారిగా 50 శాతంలోపునకు తగ్గిందన్నది.

పునరుత్పాదక విద్యుత్ రంగం కొత్తగా ఏర్పాటు చేస్తున్న సామర్థ్యంలో సౌర విద్యుత్ ఆధిపత్యం వహిస్తున్నదని వివరించింది. 2023 కొత్తగా ఏర్పడిన విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో రెన్యువబుల్ ఎనర్జీ వాటా 70 శాతానికి (26 గిగావాట్లు) చేరగా, అందులో 81 శాతం (15 గిగావాట్లు) సౌర విద్యుత్‌దేనని పేర్కొంది. కొత్తగా పవన విద్యుత్ సామర్థ్యం 2023 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2.3 గిగావాట్ల నుంచి 3.3 గిగావాట్లకు పెరిగిందని  తెలిపింది. 2017 ఆర్థిక సంవత్సరం తర్వాత తొలిసారిగా ముగిసిన ఏడాది 1.4 గిగావాట్ల అణువిద్యుత్ సామర్థ్యం ఏర్పడిందన్నది.