‘లక్కీ భాస్కర్’తో డైరెక్టర్ వెంకీపై గౌరవం పెరిగింది
దుల్కర్ సల్మాన్ నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న నేపథ్యంలో చిత్రబృందం ఆదివారం విజయోత్సవ సభను నిర్వహించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి తదితరులు పాల్గొన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. “లక్కీ భాస్కర్’ చూసిన తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరిపై చాలా గౌరవం పెరిగింది” అని చెప్పారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘నాకు సినిమా వేడుకకు వచ్చినట్టు లేదు. కుటుంబ వేడుకకు వచ్చినట్టుంది’ అన్నారు. హను రాఘవపూడి మాట్లాడుతూ.. “మా అమ్మ, అమ్మమ్మ ‘లక్కీ భాస్కర్’ చూసి నువ్వెప్పుడు ఇలాంటి సినిమా తీస్తావురా అని అడిగారు.
ప్రేమకథలు కాదు, ఇలాంటి పనికొచ్చే సినిమాలు చేయమని చెప్పారు” అని తెలిపారు. కథానాయకుడు దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. వారితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది’ అన్నారు. కార్యక్రమంలో చిత్రబృందం అంతా పాల్గొన్నారు.




